గ్రీన్‌ నేషనల్‌ హైవేస్‌ కారిడార్‌గా రాజమండ్రి–విజయనగరం ఎన్‌హెచ్‌  | Rajahmundry Vijayanagaram NH as the Green National Highways Corridor | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ నేషనల్‌ హైవేస్‌ కారిడార్‌గా రాజమండ్రి–విజయనగరం ఎన్‌హెచ్‌ 

Published Mon, Jul 27 2020 4:14 AM | Last Updated on Mon, Jul 27 2020 4:14 AM

Rajahmundry Vijayanagaram NH as the Green National Highways Corridor - Sakshi

సాక్షి, అమరావతి: రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారి (516–ఈ)ని గ్రీన్‌ నేషనల్‌ హైవేస్‌ కారిడార్‌గా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గుర్తించింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి పునరావాస పునర్నిర్మాణ (ఆర్‌ అండ్‌ ఆర్‌) పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సామాజిక ప్రభావ అంచనా సర్వే (సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ సర్వే) ఇటీవలే పూర్తయింది. ఆర్‌ అండ్‌ ఆర్‌కు మొత్తం రూ.210 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారిని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ ఈ ప్రాజెక్టును హరిత కారిడార్‌ ప్రాజెక్టుగా ప్రకటించింది. గ్రీన్‌ నేషనల్‌ హైవే కారిడార్‌ ప్రాజెక్టులుగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌) 782 కి.మీ. హరిత కారిడార్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో ఏపీకి సంబంధించి 209 కి.మీ. వరకు తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రెండు వరుసల రహదారిని నిర్మించనున్నారు. మూడు ప్యాకేజీల కింద ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశ కింద రెండు స్ట్రెచ్‌లలో రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. మార్చి నెలాఖరున టెండర్లు ఖరారు కావాల్సి ఉండగా, కోవిడ్‌–19 నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేసింది.  

రహదారి నిర్మాణానికి మొత్తం రూ.1,550 కోట్లు 
► 209 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి 190 హెక్టార్ల మేర భూమి అవసరం అవుతుంది. రహదారి నిర్మాణానికి రూ.1,550 కోట్ల వరకు ఖర్చవుతుంది.  
► కొయ్యూరు–పాడేరు (133 కి.మీ.), పాడేరు–అరకు (49 కి.మీ.), బౌదార–విజయనగరం (27 కి.మీ.) మూడు స్ట్రెచ్‌లుగా నిర్మాణం చేపడతారు. 
► ఈ ఇంటర్‌ స్టేట్‌ హైవే నిర్మాణం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి, పాడేరు, కేడీ పేట, అరకు ప్రాంతాల మీదుగా సాగుతుంది.  
► సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తి చేసిన ఎన్‌హెచ్‌ఏఐ గ్రీవియన్స్‌ రీడర్స్‌ కమిటీ (జీఆర్‌సీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.  
► బౌదార–విజయనగరం, పాడేరు–అరకు రెండు ప్యాకేజీలకు సంబంధించి 80 కి.మీ. రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement