క్యామ్లిన్‌- పీఎన్‌సీ.. భలే దూకుడు | Camlin fine sciences- PNC Infratech zooms | Sakshi
Sakshi News home page

క్యామ్లిన్‌- పీఎన్‌సీ.. భలే దూకుడు

Published Fri, Jun 26 2020 10:39 AM | Last Updated on Fri, Jun 26 2020 10:39 AM

Camlin fine sciences- PNC Infratech zooms - Sakshi


రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌  170 పాయింట్లు ఎగసి 35,013కు చేరింది. తద్వారా 35,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 10,348 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఓవైపు క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌, మరోపక్క పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌
ప్రతిపాదిత నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌  తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 180 కోట్లను సమీకరించనున్నట్లు తెలియజేసింది. నిధులను మెక్సికో, చైనాలలో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థల(జేవీలు)లో పూర్తి వాటాలను సొంతం చేసుకునేందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు తక్కువకావడం.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 5 పెరిగి రూ. 53.6 వద్ద ఫ్రీజయ్యింది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 57 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌
జాతీయ రహదారుల అధీకృత సంస్థ(NHAI) నుంచి రూ. 1412 కోట్ల కాంట్రాక్టు లభించినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ వెల్లడించింది. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి నజీబాబాద్‌ వరకూ 54 కిలోమీటర్లమేర నాలుగు లేన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉంటుందని తెలియజేసింది. భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా హైబ్రిడ్‌ యాన్యుటీ పద్ధతి(HAM)లో సాధించిన ఈ ఆర్డర్‌ను 24 నెలల్లోగా పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు తక్కువకావడం.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 13 జమ చేసుకుని రూ. 146 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 152 వరకూ ఎగసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement