కోట గోడను తలపించే ఎత్తులో నిర్మాణం కానున్న రీజనల్ రింగురోడ్డు.. వరికోత హార్వెస్టర్లు అండర్‌పాస్‌ల నుంచి దాటేందుకు వీలుగా ట్రిపుల్ ఆర్ కనీస ఎత్తు 5.5 మీటర్లకు పెంపు
హైవేలను క్రాస్ చేసే ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద ఏకంగా 30 అడుగుల ఎత్తు.. ప్రస్తుతం 11 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఔటర్ రింగ్‌రోడ్డు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపొడవైన రింగురోడ్డుగా రికార్డుకెక్కనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మరో ఘనతను సొంతం చేసుకోనుంది. కోటగోడను తలపించేలా 18 అడుగుల రికార్డు స్థాయి ఎత్తుతో ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కానుంది.
జాతీయ రహదారులు, ముఖ్యమైన రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దీని ఎత్తు ఏకంగా 30 అడుగులు ఉండనుంది. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇంత ఎత్తులో ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మాణం కాలేదు. హైదరాబాద్ చుట్టూ మణిహారంగా రూపుదిద్దుకున్న ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) ఎత్తు 11 అడుగులు మాత్రమే ఉంది.
ఇంత ఎత్తు ఎందుకంటే..
ఉత్తర భాగంలో ప్రతి అర కిలోమీటర్‌కు ఒక వంతెన ఉండనుంది. పాదచారులు దాటే అండర్ పాస్ ఎత్తు గతంలో మూడున్నర మీటర్లుగా నిర్ధారించారు. ఇటీవలే దాన్ని మార్చి 4 మీటర్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్తగా చేపట్టే ఎక్స్‌ప్రెస్ వేలలో చిన్న అండర్‌పాస్‌ల క్లియరెన్స్ ఎత్తు 4 మీటర్లుగా నిర్ధారించారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వరికోతలకు హార్వెస్టర్ యంత్రాల వినియోగం అధికంగా ఉంది. వాటి ఎత్తు 4.3 మీటర్లు. ఇవి రోడ్డు దాటాలంటే అంతకంటే ఎత్తుతో క్లియరెన్స్ ఉండాలి.
ఇందుకోసం రీజనల్ రింగ్‌రోడ్డులో అండర్‌పాస్‌ల కనిష్ట క్లియరెన్స్‌ను 4.5 మీటర్లుగా నిర్ధారించారు. దానిమీద రోడ్డు మందం మరో మీటర్ కనిష్టంగా ఉంటుంది. దీంతో అండర్‌పాస్‌లు ఉండే ప్రాంతాల్లో రోడ్డు ఎత్తు ఐదున్నర మీటర్లుగా ఉండనుంది. అండర్‌పాస్‌లు లేనిచోట్ల దాని ఎత్తు తగ్గించే వీలుంది. కానీ ఈ రోడ్డులో ప్రతి అర కిలోమీటర్‌కు చిన్నదో, పెద్దదో ఏదో ఒక అండర్‌పాస్ ఏర్పాటు కానుంది.
అందువల్ల అండర్‌పాస్ ఉన్న చోట్ల రోడ్డు ఎత్తు పెంచి ఆ తర్వాత తగ్గిస్తే వేగంగా దూసుకెళ్లే వాహనాలకు ఆ ఎత్తుపల్లాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. దీంతో ఈ రోడ్డు మొత్తం కనీసం 18 అడుగుల ఎత్తులో ఉండేలా డిజైన్ చేశారు. ఈ రోడ్డులో 27 పెద్ద వంతెనలు సహా 309 వంతెనలు నిర్మించనుండగా వాటిలో 187 అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను దాటుతూ 11 ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్‌లు నిర్మించనున్నారు. ఇంటర్‌ఛేంజ్‌ల వారీగా ఆయా డిజైన్లను ‘సాక్షి’ గతంలోనే వెలుగులోకి తెచ్చింది.
ఏడాదిన్నర కిందటే పనులు మొదలవ్వాల్సి ఉన్నా..
రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. త్వరలో గ్రామాలవారీగా భూ పరిహారానికి సంబంధించి అవార్డులు పాస్ చేయనున్నారు. దీంతో 158 కి.మీ. నిడివి ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) యంత్రాంగం రోడ్డు నిర్మాణానికి వీలుగా అప్పట్లోనే డిజైన్లు సిద్ధం చేసుకుంది. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో అప్పట్లో పనులు పడకేశాయి
Comments
Please login to add a commentAdd a comment