సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడు తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రైల్వే లైన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ మేరకు ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు కేంద్రం పచ్చజెండా ఊపిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. సర్వే కోసం తాజాగా రూ. 14 కోట్లను కేటాయించిందని తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్డు, దానివెంట ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారిపోతా యని పేర్కొన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన సానుకూల మార్పులు వస్తాయని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నలువైపులా లైన్లను అనుసంధానిస్తూ..
హైదరాబాద్‌కు నలువైపులా ఉన్న రైల్వేలైన్లను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రైల్ రింగ్ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం లభిస్తుందని.. ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు త్వరగా, సులభంగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. దీనితోపాటు కరీంనగర్– హసన్‌పర్తి (వరంగల్) మధ్య 61 కిలోమీటర్ల రైల్వేలైన్ సర్వే కోసం రైల్వేశాఖ రూ.1.5 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
భక్తుల సౌకర్యార్థం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.330 కోట్లతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. ఈ వ్యయంలో మూడింట రెండొంతుల మేర రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన ఉన్నా ముందుకు రాలేదని.. దీనితో మొత్తం ఖర్చును కేంద్రమే భరించి పనులు చేపట్టాలని నిర్ణయించిందని వెల్లడించారు. దీనితోపాటు ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి 2023–24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
ఎన్‌సీడీసీ కోసం భూమి ఇవ్వండి
అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)’ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కానీ జీనోమ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటుకోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు బదలాయించలేదని చెప్పారు.
ఇది రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని.. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాయనున్నట్టు తెలిపారు. దేశంలో పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సెపె్టంబర్‌లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించనున్నట్టు వివరించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఎలాంటి చర్చా లేదు
తెలంగాణలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం మార్పు వంటిదేమీ లేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్ష మార్పు అంశమేదీ అధిష్టానం దృష్టిలో లేదని, దీనిపై పారీ్టలో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు.
కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని, ఇదంతా మీడియా సృష్టించిన గందరగోళమేనన్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్ష మార్పు వార్తలను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ కూడా కొట్టిపారేశారు. అధిష్టానం వద్ద ఇలాంటి ఆలోచనేదీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment