
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: తెలంగాణకు రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ కానుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి అభివర్ణించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే మార్గాన్ని ఆనుకొని ఉన్న జిల్లాల్లో ఐటీ పార్కులు, ఫార్మా కంపెనీలు, మాల్స్, మల్టీప్లెక్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండానే వివిధ జిల్లాల ప్రజలు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరు కోవడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు.
పర్యాటకం కూడా అభివృద్ధి చెందు తుందన్నారు. శనివారం హైదరాబాద్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హేచ్‌ఏఐ) అధికారులతో సమావేశానంతరం కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158.50 కి.మీ. మేర నిర్మించబోయే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని రకాలుగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు వేగంగా భూసేకరణ నిర్వహించే నిమిత్తం 3 ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
రోడ్డు నిర్మాణ వ్యయా న్ని కేంద్రమే భరించనుందని కిషన్‌రెడ్డి చెప్పారు. చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మధ్య 180 కి.మీ. నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం ప్రాజెక్టుకు సంబంధించి డీపీ ఆర్ తయారవుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ పెరుగుదలకు అనుగుణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ను భవిష్యత్తులో 4 లేన్ల నుంచి 8 లేన్లుగా మార్చేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు.
రూ. 93,656 కోట్లతో హైవేల పనులు
తెలంగాణకు జాతీయ రహదారులు, ఇతర రోడ్ల కింద కేంద్రం అత్యధికంగా రూ. 93,656 కోట్లు కేటాయించిందని కిషన్‌రెడ్డి వివరించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ 99 శాతం మేర పెరిగిందని చెప్పారు. అంతకుముందు 2,511 కి.మీ. మేర జాతీయ రహదారులు తెలంగాణలో ఉండగా గత ఏడేళ్లలో 2,483 కి.మీ. మేర కొత్త జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు.
జాతీయ రహదారులపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గించే కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలో 378 ప్రాంతాలను కేంద్రం గుర్తించిందన్నారు. ఇందుకోసం ఆర్‌యూబీ, ఆర్‌వోబీల నిర్మాణానికి రూ. 850 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్–బెంగళూరు (ఎన్‌హెచ్–44) రోడ్డులో కర్నూలు వరకు (251 కి.మీ) ‘సూపర్ ఇన్ఫర్మేషన్ హైవే’లో రియల్‌టైమ్ డిజిటల్ వ్యవస్థ ద్వారా ముఖ్యమైన సమాచారం కోసం రూ. 4,700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.
తెలంగాణలో పీఎం గతిశక్తి హై–ఇంపాక్ట్ ప్రాజెక్టులో భాగంగా 898 కి.మీ. మేర ఐదు కారిడార్ల నిర్మాణానికి రూ. 22,706 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. షోలాపూర్–కర్నూలు–చెన్నై కారిడార్ (ఎకనమిక్ కారిడార్), హైదరాబాద్–విశాఖ (ఇంటర్ కారిడార్ రూట్), హైదరాబాద్–రాయ్‌పూర్ (మరో ఎకనమిక్ కారిడార్), ఇండోర్–హైదరాబాద్ (ఇంటర్ కారిడార్ రూట్), నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ (మరో ఎకానమిక్ కారిడార్ కింద) ఉన్నాయన్నారు.
ప్రతీదీ రాజకీయం చేయడం రాదు...
నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని కేటీఆర్ సహా పలువురు మంత్రులు చేస్తున్న విమర్శలను విలేకరులు ప్రస్తావించగా ప్రతీదీ రాజకీయం చేయడం తమకు రాదని కిషన్‌రెడ్డి బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment