సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు బేడీలు వేసి మరీ భువనగిరి సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చిన ఉదంతంపై రాజకీయంగానూ విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో యాదాద్రి భువనగిరి పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. అసలు వాళ్లు రైతులే కాదంటూ ప్రకటించారు డీసీపీ రాజేష్ చంద్ర.
అరెస్ట్ అయినవాళ్లలో రైతులు ఎవరూ లేరు. ఆ నలుగురూ జమ్మాపూర్‌లోని ఓ కంపెనీలో కార్మికులుగా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసం 20 గుంటల భూమి కొనుగోలు చేశారు. ఇంతకుముందు వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు మాపై దాడి చేసి వాహనం ధ్వంసం చేశారు. అంతేకాదు గతంలో కలెక్టరేట్‌లోకి వెళ్లి లోపల నిప్పు పెట్టారు. మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడి కాన్వాయ్ పై దాడి చేసినందుకు అరెస్టు చేశాం. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ఎస్కార్ట్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ల ప్రవర్తన సరిగా లేకనే ముందస్తు జాగ్రత్త కోసం బేడీలు వేయాల్సి వచ్చిందని డీసీపీ వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తులో ఉన్న పోలీస్ ఇంచార్జ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారాయన. అయితే..
ఇది సబబేనా?
ఈ పరిణామంపై సాక్షి టీవీతో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మాట్లాడారు. కొండంత తీసుకొని గోరంత నష్టపరిహారం ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరే ఎకరం, ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతుల భూములు పూర్తిస్థాయిలో కోల్పోవాల్సి వస్తోంది. బడా నాయకుల భూములను కాపాడుకోవడం కోసమే అలైన్మెంట్ మార్చారు. మోటకొండూరు నుంచి ఉన్నటువంటి అలైన్మెంట్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది?. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వం సంకెళ్లు ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పాలి?.. అని నిలదీశారు.
అధికారులకు, నాయకులకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు వినిపించుకున్న ఫలితం లేకుండా పోయిందని, రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, రైతులమైన తమపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు వాళ్లు. ఒక రాజకీయంగానూ ఈ పరిణామంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రౌడీల మాదిరి బేడీలు వేస్తారా?
రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద రైతులంటే కేసీఆర్ కు అంత చులకనెందుకు?. నిర్వాసితులైన రైతులకు న్యాయం చేయాల్సింది పోయి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?. ఆ రైతులు చేసిన తప్పేంది?. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తే జైల్లో వేస్తారా?. కేసీఆర్ సర్కార్ కు పోయే కాలం దగ్గర పడింది. ప్రజాకోర్టులో కేసీఆర్‌కు శిక్ష తప్పదు అని బండి సంజయ్ విమర్శించారు.
బాధితుల తరపున కాంగ్రెస్ పోరాడుతుంది
ఇక భువనగిరి కోర్టు పరిణామంపై కాంగ్రెస్ సీనియర్, మాజీ ఎంపీ వీహెచ్ స్పందించారు. ‘‘భువనగిరి RRR భూ నిర్వాసితులు ఆరుగురు పై కేసులు పెట్టారు. గతంలో మిర్చి రైతులకి సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌ది. ఇప్పుడు RRR నిర్వాసితులకు సంకెళ్లు వేశారు. రియల్టర్లు దగ్గర డబ్బులు తీసుకొని భువనగిరి రైతులకి అన్యాయం చేస్తున్నారు. రైతుల దగ్గర Ak 47 గన్స్ ఉన్నాయా చెప్పండి?. అన్నం పెట్టె రైతులకి సంకేళ్లు వేస్తారా? వారి నాన్ బెయిల్ కేసులు పెడతారా?.
అన్నం పెట్టే రైతులకి సంకేళ్లు వేసే ఏకైక ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం. రియల్టర్ల తో బిఆర్ఎస్ నేతలు కుమ్మక్కై కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు . భువనగిరి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని వీహెచ్ ప్రకటించారు.
ఇదీ చదవండి: అసలు ఆ మీటింగ్‌ల వెనుక ఎవరున్నారు?
Comments
Please login to add a commentAdd a comment