రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసిత రైతులను భువనగిరి కోర్టు నుంచి నల్లగొండ జైలుకు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్న పోలీసులు
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్చాలని ఆందోళన చేసిన రైతులకు యాదాద్రి భువనగిరి పోలీసులు సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీసుల తీరుపై రాజకీయ పార్టీల నేతలు, రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జైల్లో ఉన్న రైతులను మంగళవారం భువనగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చే క్రమంలో వారి చేతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. వాస్తవానికి ఆ రైతులకు సోమవారమే బెయిల్ వచ్చింది. అయినా పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వారు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో..
భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రైతులు ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ రోడ్డుతో తాము భూములను పూర్తిగా కోల్పోతున్నా మని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మే 30న భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా.. అదే సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి కలెక్టరేట్‌లో సమావేశం ముగించుకుని వెళ్తున్నారు. ధర్నా చేస్తున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
పోలీసులు వారిని చెద రగొట్టారు. అదే రోజు భువనగిరి రూరల్ పోలీసులు ఆరుగురు రైతులపై కేసు నమోదు చేశారు. రాత్రికల్లా గడ్డమీద మల్లేశ్ (ఏ1), పల్లెర్ల యాదగిరి (ఏ2), అవిశెట్టి నిఖిల్ (ఏ3), మల్లెపోయిన బాలు (ఏ4) అనే నలుగురు రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ5 తంగళ్ళపల్లి రవికుమార్, ఏ6 గూడూరు నారాయణరెడ్డి (బీజేపీ నేత)లు పరా రీలో ఉన్నట్టుగా చూపించారు. తొలుత భువనగిరి సబ్ జైలుకు తరలించిన నలుగురు రైతులను.. వారికి రాజకీయ నాయకుల పరామర్శలు అధికం కావడంతో శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ 4న నల్లగొండ జైలుకు తరలించారు.
బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో..
రిమాండ్‌లో ఉన్న నలుగురికి సోమవారం భువన గిరి జిల్లా కోర్టులో కండిషనల్ బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ ప్రక్రియలో జాప్యం కావడంతో వారి విడుదల ఆలస్యమైంది. అయితే సోమవారా నికి 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో మంగళ వారం ఉదయమే భువనగిరి కోర్టులో హాజరుపర్చ డానికి తీసుకువచ్చారు.
కోర్టు ముందువరకు సంకెళ్లు వేసి రైతులను వాహనంలో తీసుకువచ్చిన పోలీసులు.. వారిని జడ్జి ముందు హాజరుపరిచి తిరిగి పోలీస్ వాహనంలో ఎక్కించుకునిపోయే క్రమంలోనూ బేడీలు వేయడంతో వివాదం తలెత్తింది. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలావుండగా ఈ రైతులు మంగళవారం సాయంత్రం నల్లగొండ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.
కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులకు బేడీలు వేయడం చూసి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చడమేనని, అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు.
దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?: బండి సంజయ్
రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాల్సింది పో యి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా? అని మండిపడ్డారు. కాగా రైతులేమైనా తీవ్రవాదులు, రేపిస్టులు, బందిపోట్లా? సంకెళ్లు వేసి తీసుకెళ్ల డానికి.. అని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలావుండగా రైతుల దగ్గర ఏకే 47 తుపాకులున్నాయని సంకెళ్లు వేశారా? అని కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు.
న్యాయం చేయమని ప్రాధేయపడితే సంకెళ్లు వేస్తారా?
నల్లగొండ క్రైం: న్యాయం చేయమని ప్రాధేయ పడితే సంకెళ్లు వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రజా ప్రతినిధులను అడిగిన ప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ కోసం, వరంగల్ రహదారి కోసం, హైటెన్షన్ విద్యుత్ లైన్ కోసం మూడు దశలుగా ఇప్పటికే తమ భూములు త్యాగం చేశామని, ఇప్పుడు మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌కు భూములు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా పోతే తమ కుటుంబాల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment