రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై కేంద్రం మడతపేచీ | Central Government Denied Nod To Regional Ring Road Second Phase In Hyderabad | Sakshi
Sakshi News home page

‘రింగ్‌’ సగమే!

Published Fri, Nov 1 2019 2:00 AM | Last Updated on Fri, Nov 1 2019 4:20 AM

Central Government Denied Nod To Regional Ring Road Second Phase In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు అయోమయంలో పడింది. హైదరాబాద్‌ చుట్టూ విస్తరించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ ఆర్‌)కు అవతల 338 కిలోమీటర్ల మేర నిర్మించాలని భావించిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థ కంగా మారింది. ప్రస్తు తం ఇందులో సగం రోడ్డుకు మాత్రమే కేం ద్రం సూత్రప్రాయం గా అంగీకారం తెలి పింది. మిగిలిన సగం రోడ్డును దాదాపు తిర స్కరించి నట్టుగానే కనిపి స్తోంది. అది ఆర్థికంగా సాధ్యం కాదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకోవాలని పరోక్షంగా సూచిస్తోంది. వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా దాదాపు 500మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపి అందిస్తే చూస్తానని చెప్పడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం సగం రింగ్‌ మాత్రమే సాకారమయ్యేలా మారింది. రెండో భాగానికి కేంద్రం అంగీకరించాలంటే స్వయంగా ప్రధాని మోదీ సంతృప్తి చెంది ఆమోదిస్తే తప్ప అది పట్టాలెక్కే పరిస్థితి కనిపించటంలేదు.

ఓఆర్‌ఆర్‌ కీలక భూమిక..
ఔటర్‌ రింగ్‌రోడ్డు.. వైఎస్‌ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా హైదరా బాద్‌ నగరం చుట్టూ సాక్షా త్కరించిన భారీ ప్రాజెక్టు. 158 కిలోమీటర్ల మేర ఎనిమిది వరుసలతో దేశంలోనే తొలి ఎక్స్‌ ప్రెస్‌ వేగా ఇది నిర్మిత మైంది. ఇంత భారీ రింగురోడ్డు అవసరమా అన్న అనుమానాలు వ్యక్త మైన తరుణంలో నిర్మిత మైన ఈ రోడ్డు.. హైదరాబాద్‌ అభివృద్ధిలో కీలక భూమిక పోషిం చింది. దేశంలో శరవేగంగా పురోగమించిన నగరాల జాబితాలో భాగ్యనగరం ముందు వర సలో ఉండేందుకు దోహదపడింది. నగరం చుట్టూ శివారు ప్రాంతాల ముఖచిత్రం మారడానికి సాయపడింది. అలాంటిది దీన్ని మించిన రింగు రోడ్డు నిర్మిస్తే భాగ్యనగరం మరింత పురోగమించడం ఖాయం. ముఖ్యంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆవల ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్‌.. దూరదృష్టితో ఆలోచించి రూపకల్పన చేసిన ప్రాజెక్టే ఈ రీజినల్‌ రింగు రోడ్డు.

ఏంటీ రీజినల్‌ రింగ్‌రోడ్డు?
హైదరాబాద్‌ చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆవల దాదాపు 50 కిలోమీటర్ల పరిధిని అనుసంధానిస్తూ నిర్మితమయ్యే రోడ్డు ఇది. తొలుత దీన్ని నాలుగు వరుసలతో నిర్మించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఆరు వరసలుగా నిర్మించాలని నిర్ణయించింది. ఇది 338 కిలోమీటర్ల మేర నగరం చుట్టూ నిర్మితమవుతుంది. నగరం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 20కి పైగా పట్టణాలను అనుసంధానిస్తూ వలయంగా ఈ రోడ్డు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు.

ఇప్పుడేం జరిగింది?
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 2016లో రూపకల్పన చేసింది. భారీ వ్యయంతో కూడుకున్నది కావటంతో రాష్ట్ర రహదారులుగా ఉన్న మార్గాలను జాతీయ రహదారులుగా మార్చి అనుసంధానించటం ద్వారా దీన్ని సాకారం చేయొచ్చని భావించి కేంద్ర ఉపరితల రవాణాశాఖకు దరఖాస్తు చేసింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, రోడ్లు భవనాల శాఖ అధికారులు భేటీ అయి దీనిపై చర్చించారు. దీంతో ఆయన 2018లో ఆమోదించటంతో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీన్ని రెండు భాగాలుగా చేసి 152 కిలోమీటర్ల తొలి భాగాన్ని జాతీయ రహదారిగా డిక్లేర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. తాత్కాలికంగా ఆ రోడ్డును ఎన్‌హెచ్‌ 161 బీబీగా పేర్కొంది. రెండో భాగాన్ని కూడా ఆమోదించి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరింది. ఈ లోపు ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా పెండింగులో పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కో ప్రాజెక్టును ప్రత్యేకంగా పరిశీలించి పాత నిర్ణయాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్థికంగా వెసులుబాటు కాని ప్రాజెక్టులుగా గుర్తించిన వాటిని పక్కన పెట్టారు. ఆ జాబితాలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు రెండో భాగాన్ని కూడా చేర్చారు.

కేంద్రం ఏమంటోంది?
దాదాపు రూ.7వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్‌ రెండో భాగం నుంచి టోల్‌ రూపంలో తప్ప మరే ఆదాయం రాదు. టోల్‌ కూడా నామ మాత్రంగానే ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టుగా 500 మీటర్ల వెడల్పుతో చేపడితే బాగుంటుంది. అంతమేర భూసేకరణ జరిపి వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా చేసి కేంద్రానికి అప్పగిస్తే ఆ రోడ్డును నిర్మిస్తామని మెలిక పెట్టింది. అది జరగాలంటే వేల హెక్టార్ల ప్రైవేటు భూమిని సేకరించాలి. అంత మొత్తం భరించడం ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు.

రాష్ట్రం ఏం చేయాలి?
జాతీయ రహదారుల విషయంలో ఇప్పటికీ తెలంగాణ బాగా వెనకబడి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల చుట్టూ ఉన్న రోడ్‌ నెట్‌వర్క్‌ హైదరాబాద్‌కు లేదు. దీంతో పాత ప్రతిపాదనను ఆమోదించి రీజినల్‌ రింగ్‌రోడ్డుకు అనుమతిస్తే హైదరాబాద్‌ కూడా ఇతర ప్రధాన నగరాల రోడ్‌ నెట్‌వర్క్‌ సరసన నిలుస్తుందని చెబుతోంది. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీని ఈ మేరకు ఒప్పించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో దీనిపై ప్రధానికి నివేదించే అవకాశం కనిపిస్తోంది. ‘‘గతంలో నితిన్‌ గడ్కరీ చాలా జాతీయ రహదారులను మంజూరు చేశారు. కానీ మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఆ వేగానికి బ్రేకులేశారు. ఇప్పుడు భారీ ప్రాజెక్టులకు ఉదారంగా చేపట్టేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో కాకుండా సాధారణ జాతీయ రహదారిగానైనా దీన్ని సాకారం చేసుకోవాల్సి ఉంది. అవసరమైతే భవిష్యత్తులో దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ మేరకు మోదీని ఒప్పించాల్సి ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి ఆయనతో భేటీ అయి చర్చిస్తే ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది’’ అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement