ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ఎఫెక్ట్
56 వేల వృక్షాల తొలగింపు
ప్రత్యామ్నాయంగా మహబూబాబాద్‌లో 3.30 లక్షల మొక్కల పెంపకం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణంతో 56 వేల వృక్షాలు నేలకూలబోతున్నాయి. ఈ భాగం రోడ్డు అలైన్‌మెంటు పరిధిలో ఉన్నందున వీటిని తొలగించేందుకు అటవీ శాఖ అనుమతించింది. భారీ సంఖ్యలో వృక్షాలను తొలగించాల్సిరావటంతో పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో వాటి లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కోల్పోయిన చెట్లకు ప్రతిగా 3.30 లక్షల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే మహబూబాబాద్‌లో భూమిని ఎంపిక చేశారు.
మూడు ప్రాంతాల్లో ఎక్కువ అటవీ భూములు
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని నిర్మించే 162 కి.మీ. నిడివిలో మూడు ప్రాంతాల్లో అటవీ భూములు అడ్డు వస్తున్నాయి. అడవి గుండా రోడ్డు నిర్మిస్తే వన్యప్రాణుల సంచారానికి ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఆయా అటవీ భూముల్లో ఏదో ఒక చివరి నుంచి అలైన్‌మెంటు సాగేలా కన్సల్టెన్సీ సంస్థ దృష్టి పెట్టింది. రోడ్డుకు ఓవైపు 95 శాతం అటవీ భాగం ఉంటే, మరోవైపు 5 శాతం వరకు మాత్రమే ఇతర భూమి ఉండేలా అలైన్‌మెంటును రూపొందించింది. గజ్వేల్, నర్సాపూర్, యాదాద్రి ప్రాంతాల్లో ఈ అటవీ భూములున్నాయి.
మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లా పరిధిలో 8.511 హెక్టార్లు.. వెరసి 72.3536 హెక్టార్ల మేర అటవీ భాగం అలైన్‌మెంటు పరిధిలోకి వచ్చింది. అంటే 200 ఎకరాలకు లోపు మాత్రమే ఉత్తర రింగు ప్రభావానికి గురికానున్నాయి.
ఈ ప్రాంతాల్లో 44 వేల వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. దీంతో వాటిని తొలగించేందుకు ఇటీవల అటవీ శాఖ అనుమతించింది. ఇక అటవీ భూముల వెలుపల ఉండే సాధారణ భూముల్లోని మరో 12 వేల వృక్షాలను కూడా తొలగించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. వెరసి ఉత్తర భాగం పరిధిలో 56 వేల వృక్షాలను తొలగించబోతున్నారన్న మాట.
పరిహారం స్థానంలో మొక్కల పెంపకం
ప్రాజెక్టుల్లో కోల్పోయే అటవీ భూములకు కూడా పరిహారం ఇచ్చే విధానం గతంలో అమల్లో ఉండేది. అయితే మోదీ ప్రభుత్వం.. పరిహారానికి బదులు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి వాటిల్లో మొక్కలను పెంచాలని నిర్ణయించింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ఇప్పుడదే వర్తింపజేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించారు. కొత్తగూడ మండలం పరిధిలోని పొగుళ్లపల్లి, నీలంపల్లి, గంగారం మండలం పరిధిలోని చింతల్‌గూడ గ్రామంలో ఈ భూమిని గుర్తించారు. ఈ మూడు గ్రామాల పరిధిలో కలిపి 3,29,452 చెట్లు పెరిగేలా త్వరలో మొక్కలు నాటనున్నారు.
జంతువులకు ఇబ్బంది కలుగకుండా ఎకో బ్రిడ్జీలు
3 అటవీ ప్రాంతాల్లో జింకలు, దుప్పులు, నక్క లు, కోతులు, కొండముచ్చులు, నెమళ్లు, ఎలుగుబంట్లు కొన్ని ఇతర జంతువులు ఉన్నాయని గుర్తించారు. రోడ్డు నిర్మాణంతో వీటికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. జంతువులు ఒకవైపు నుంచి రోడ్డు దాటి మరోవైపు వెళ్లేలా ఎకో బ్రిడ్జీలు (పర్యావరణ హిత వంతెనలు) నిర్మించనున్నారు.
వీటివల్ల పైనుంచి వాహనాలు వెళ్తున్నా, జంతువులు దిగువ నుంచి మరోవైపు వెళ్లేందుకు, వచ్చేందుకు వీలవుతుంది. ఇక జంతు సంచారం మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల శబ్దాలు వాటిని ఇబ్బంది పెట్టకుండా రోడ్డుకు రెండు వైపులా నాయిస్ బారియర్స్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment