సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి మూడు కాలా(కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్)ల పరిధిలో అవా ర్డు పాస్ చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పట్టాదారుల వారీగా వివరాలు నమోదు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో సేకరించాల్సిన భూముల్లో ఉన్న నిర్మాణాలు, తోటలు, ఇతర ఆస్తుల విలువను మదింపు చేసే ప్రక్రియకు తాజా గా అధికారులు శ్రీకారం చుట్టారు. సేకరించాల్సిన భూమి విలువ ఆధారంగా పరిహారాన్ని అందించే క్రమంలో, ఆయా భూముల్లో ఉన్న నిర్మాణాలు, చెట్ల విలువలను కూడా గుణించి పరిహారం అందిస్తారు. ఇప్పుడు వాటి విలువకు సంబంధించి అధికారులు సర్వే చేస్తూ లెక్కలు సేకరిస్తున్నారు.
ఉత్తరభాగంలో 8 ’కాలా’లు
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 8 ‘కాలా’లున్న విషయం తెలిసిందే. ఇందులో యాదాద్రి–భువనగిరి, చౌటుప్పల్, ఆందోల్–జోగిపేట కాలాలకు సంబంధించి ఇటీవలే ఎన్‌హెచ్‌ఏఐ 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూడు ప్రాంతాల్లోని రైతులకు పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా అవార్డ్ పాస్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రి ప్రాంతంలో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ జరక్కుండా రైతులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో రీజినల్ రింగ్‌రోడ్డుకు భూములు ఇవ్వబోమంటూ వారు భీషి్మంచుకుని కూర్చున్నారు. నిరసన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఇటీవల కొందరు రైతులపై కేసులు పెట్టిన పోలీసులు, వారికి బేడీలు వేసి మరీ కోర్టుకు తీసుకురావటం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో సర్వేను అలాగే పెండింగులో ఉంచిన అధికారులు, మిగతా రెండు కాలాల్లో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సేకరించాల్సిన భూముల్లో ఉన్న ఇళ్లు, దుకాణ సముదాయాలు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాల లెక్కలు తీస్తున్నారు. పొలాల్లో ఉన్న తోటలు, సాధారణ చెట్ల లెక్కలు కూడా సిద్ధం చేస్తున్నారు. వాటి నిర్ధారిత విలువ ఆధారంగా నష్టపరిహారాన్ని అందిస్తారు. ప్రైవేటు వ్యక్తులతోపాటు, కొన్ని ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు కూడా ఉన్నాయి. వాటి లెక్కలను కూడా సంబంధించి విభాగాల అధికారులతో కలిసి సర్వే చేసి సిద్ధం చేస్తున్నారు.
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..
ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో రింగురోడ్డుకు అడ్డుగా ఉన్న స్తంభాలు, నీటి పైపులైన్లను తర లించేందుకు కూడా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్‌టీ లైన్లకు సంబంధించిన చిన్న స్తంభాలను తొలగించనున్నారు. అదే హైటెన్షన్, పవర్ గ్రిడ్ స్తంభాలను తొలగించకుండా, లైన్లు మరింత ఎత్తుగా ఉండేలా స్తంభాల ఎత్తును పెంచాలని నిర్ణయించారు.
ఈమేరకు ట్రాన్స్‌కో, పవర్‌గ్రిడ్ అధికారులతో కలిసి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైను కూడా అడ్డుగా ఉన్నందున, ఏయే ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలో, వాటి పొడవు, ఎత్తు ఎంత ఉండాలో తేల్చేందుకు రైల్వే అధికారులతో కలిసి సర్వే చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్న చోట్ల ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. మరో నెల రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. సంగారెడ్డి–తూప్రాన్ మధ్య 30 కి.మీ.లు చొప్పున రెండు ప్యాకేజీలుగా 60 కి.మీ. నిడివి గల రింగు రోడ్డు పనులు తొలుత ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్యాకేజీలకు ఈ సంవత్సరమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా అవార్డు పాస్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment