రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.8,100 కోట్లు... పరిహారానికి రూ.5,400 కోట్లు
తాజాగా అంచనా వేసిన ఎన్‌హెచ్‌ఏఐ
నిర్మాణ సమయం నాటికి అంచనాలు మరింత పెరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి దాదాపు రూ.16,800 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా ఈ భాగం రోడ్డు నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ప్రైవేట్ సంస్థ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్‌ను ఇటీవలే ఎన్‌హెచ్‌ఏఐకి అందజేయగా, దాని ఆధారంగా ఈ లెక్క తేల్చారు. దీని ఆధారంగా త్వరలో ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. నిర్మాణ పనులు ప్రారంభం కావటానికి ఇంకా ఆరేడునెలల సమయం ఉన్నందున, అప్పటికి ఉండే మార్కెట్ ధరల ఆధారంగా ఈ అంచనాలు మరికాస్త పెరగొచ్చు.
రోడ్డు నిర్మాణం ఇలా...
దాదాపు 162 కి.మీ. నిడివితో ఉండే రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణ పనుల(సివిల్ కాస్ట్)కు రూ.8,100 కోట్లు ఖర్చు అవుతుందని ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా రూపొందించిన అంచనా స్పష్టం చేస్తోంది. మొదట నాలుగు వరుసలకు.. ఒక్కో కి.మీ.కు దాదాపు రూ.50 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంది. ఈ రోడ్డు 5 మీటర్ల ఎత్తుతో ఉండేలా డిజైన్ చేయడంతో నిర్మాణ వ్యయం అధికంగా ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. ప్రతి కి.మీ. నిడివికి ఒకటి చొప్పున కల్వర్టు, అండర్‌పాస్, ఫ్లైఓవర్.. ఇలా ఏదో ఓ నిర్మాణం ఉంటుంది. దీంతో ఖర్చు భారీగా అవుతుంది. కనీసం 10 అడుగుల ఎత్తు అప్రోచ్‌తో అండర్‌పాస్‌లను నిర్మిస్తారు.
భూసేకరణకు....
ఈ భాగం రోడ్డుకు సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. దీనికి పరిహారంగా దాదాపు రూ.5,400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించనుంది. ప్రస్తుతానికి నాలుగు వరు సల రోడ్డే నిర్మిస్తున్నా, భవిష్యత్‌లో దానిని 8 లేన్లకు విస్తరిస్తారు. అందుకు వీలుగా ఇప్పుడే భూసేకరణ చేపట్టారు.
⇒ ఈ అలైన్‌మెంటులో సేకరించాల్సిన భూముల్లో దాదాపు 80 హెక్టార్ల అటవీ భూములున్నాయి. అటవీశాఖకు పరిహారంగా మరోచోట భూమిని కేటాయించటంతోపాటు, ఆ భూమిలో మొక్కల పెంపకానికి అయ్యే వ్యయం కూడా చెల్లిస్తారు. సేకరించిన భూమిలో తొలగించే చెట్లకు విలువ కట్టి చెల్లిస్తారు. ఈ అటవీ భూముల్లో దాదాపు 20 హెక్టార్ల భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. వారిలో నిరుపేదలున్నందున వారిపేరిట గతంలో పట్టాలు కూడా జారీ అయ్యాయి. అలా పట్టాలు పొందిన వారికి లెక్క ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తుందని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment