ఫోర్త్‌సిటీ ఉద్యోగుల కుటుంబాల వసతికి ఉపయోగపడాలి: సీఎం రేవంత్
నిర్వాసితుల విషయంలో సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచన
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఫోర్త్ సిటీలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఇతర వసతులు కల్పించేందుకు వీలుగా ఆ అలైన్‌మెంట్ ఉండాలని సూచించారు.
బుధవారం రాత్రి తన నివాసంలో రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్టును సీపోర్టుతో అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రీజనల్‌రింగు రోడ్డుకు సంబంధించి గతవారం సూచించిన మార్పుల ఆధారంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ను సీఎం పరిశీలించారు. అందులో కొన్ని మార్పులను సూ చించారు.
అలైన్‌మెంట్ ఖరారుకాగానే.. వెంటనే తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్–ఓఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్ల కోసం ముందుగానే భూసమీకరణ, భూసేకరణ చేపట్టాలని పేర్కొన్నారు. నిర్వాసితుల విషయంలో సానుభూతితో వ్యవహరించి సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందించేలా చూడాలని.. ప్రభుత్వపరంగా మరేదైనా అదనపు సాయం చేయగలమేమో ఆలోచించాలని సూచించారు.
డ్రైపోర్టుపై పరిశీలన చేయండి
డ్రైపోర్టు ఏర్పాటుకు సంబంధించి కాకినాడ, మచి లీపట్నం రేవులను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. రేవులకు ఉండే దూరంతోపాటు ఏపీ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉన్నదీ, తెలంగాణకు దేనిద్వారా ఎక్కువ ఉపయోగం కలుగుతుందనే విషయాలను గమనంలో ఉంచుకోవాలని సూచించారు. ఈ అధ్యయనం తర్వాతే గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్–ఓఆర్‌ఆర్ మధ్య రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బెంగళూరులో ఉన్న జిందాల్ నేచర్‌కేర్ వంటివి మనవద్ద కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
రాచకొండ ప్రాంత ప్రకృతి రమణీయత సినీ పరిశ్రమను ఆకర్షించేందుకు ఉన్న అవకాశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment