దక్షిణ ‘రింగ్‌’కు మూడు అలైన్‌మెంట్లు | Three Alignments Of Southern Part Regional Ring Road | Sakshi
Sakshi News home page

దక్షిణ ‘రింగ్‌’కు మూడు అలైన్‌మెంట్లు

Published Tue, Oct 18 2022 1:49 AM | Last Updated on Tue, Oct 18 2022 2:04 AM

Three Alignments Of Southern Part Regional Ring Road - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అడ్డుగా వస్తున్న గుట్టలను చీల్చి రోడ్డు నిర్మించాలా? ఖర్చు తగ్గించుకో­వటానికి అలైన్‌మెంటును మళ్లించాలా? ఏయే ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు రాబోతు­న్నాయి? వాటికి కాలువలు ఎక్కడెక్కడ నిర్మాణం కాబోతున్నాయి? అటవీ భూములను తప్పించాలంటే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి?’ రీజనల్‌ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో అధికారులకు ఎదురవుతున్న సవాళ్లు ఇవి.

అంతగా ట్రాఫిక్‌ లేని ఈ మార్గంలో నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే అవసరమా అంటూ కొన్నినెలల పాటు ఈ భాగం విషయంలో తర్జనభర్జన పడ్డ కేంద్రం ఎట్టకేలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణభాగం నిడివి పెద్దగా ఉండటమే కాకుండా, భౌగోళికంగా అలైన్‌మెంట్‌ను రూపొందించే విషయంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తగా అలైన్‌మెంట్‌ ఖరారు చేయాలని నిర్ణయించిన అధికారులు.. కన్సల్టెన్సీ సంస్థకు పలుసూచనలు చేశారు. గతంలో భారీ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీగా సేవలందించిన అనుభవమున్న ఢిల్లీ సంస్థ ‘ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’.. అధికారుల సూచనలకు అనుగుణంగా సర్వే చేస్తోంది.

గుట్టలు, చెరువులు, ఊళ్ల మధ్య.
కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు నాలుగైదు చోట్ల 20 మీటర్ల వరకు ఎత్తున్న చిన్న గుట్టలు అడ్డుగా ఉన్నట్టు గుర్తిం­చారు. ‘వాటిని తొలిచి రోడ్డు నిర్మించే అవకాశం ఉందా? లేదా అలైన్‌మెంట్‌ను మళ్లించాలా.. మళ్లించదల్చుకుంటే వాటికి దగ్గర గా ఉన్న జనావాసాల పరిస్థితి ఏమిటి? కొన్ని ప్రాంతాల్లో ఉన్న చెరువులకు, ఊళ్లకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే అలైన్‌మెంట్‌ను మళ్లించాలి. దానివల్ల దూరం, నిర్మాణ ఖర్చు పెరు­గుతాయ’ని అంచనా వేస్తున్నారు.

ఈ అంశాలపై ఢిల్లీలోని జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు వివ­రాల ను కన్సల్టెన్సీ సంస్థ అధికా రులకు అందజేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడు వేర్వేరు అలైన్‌మెంట్లను రూపొందించాలని.. నిర్మాణ వ్యయం, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యోగ్యమైన దాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

నీటిపారుదల శాఖ, అటవీ శాఖలతో సంప్రదింపులు
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో కాలువలు నిర్మించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో వాటి స్థలాలను ఖరారు చేయలేదు. దీనితో ‘దక్షిణ రింగ్‌’ అలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తే.. భవిష్యత్తులో మళ్లీ మార్పుచేర్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల భవిష్యత్తు పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించి తదనుగుణంగా అలైన్‌మెంటు రూపొందించాలని నిర్ణయించారు.

ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో నీటి పారుదల శాఖ నిర్మాణాలు రాబోతున్నాయనే వివరాలు, ప్రణాళికలు అందించాల్సిందిగా కోరారు. కాలువలు ఉన్న చోట అలైన్‌మెంటులో ఎలాంటి స్ట్రక్చర్లను నిర్మించాలో తేల్చుకోవటానికి ముందస్తు అవకాశం చిక్కనుంది. ఇక ఏయే ప్రాంతాల్లో అటవీ భూములు ఉన్నాయో గుర్తించిన కన్సల్టెన్సీ సంస్థ ప్రతి­నిధులు.. అటవీ శాఖ అధికారులతో కూడా చర్చి­స్తున్నారు.

రాజకీయ నేతలు, పలుకుబడి ఉన్న వారి ఒత్తిళ్లకు తలొగ్గి వారికి అనుకూలంగా అలైన్‌­మెంటు రూపొందించారన్న విమర్శలు రాకుండా పకడ్బందీగా వ్యవహరించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా చర్యలు చేపడతామని అంటున్నారు. అలైన్‌మెంట్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని, ఈ నెలాఖరులోగానీ వచ్చే నెల మొదటి వారంలోగానీ అలైన్‌మెంట్‌లో స్పష్టత వస్తుందని అధికారులు సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement