southern part
-
దక్షిణ ‘రింగ్’కు మూడు అలైన్మెంట్లు
సాక్షి, హైదరాబాద్: ‘అడ్డుగా వస్తున్న గుట్టలను చీల్చి రోడ్డు నిర్మించాలా? ఖర్చు తగ్గించుకోవటానికి అలైన్మెంటును మళ్లించాలా? ఏయే ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు రాబోతున్నాయి? వాటికి కాలువలు ఎక్కడెక్కడ నిర్మాణం కాబోతున్నాయి? అటవీ భూములను తప్పించాలంటే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి?’ రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో అధికారులకు ఎదురవుతున్న సవాళ్లు ఇవి. అంతగా ట్రాఫిక్ లేని ఈ మార్గంలో నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్వే అవసరమా అంటూ కొన్నినెలల పాటు ఈ భాగం విషయంలో తర్జనభర్జన పడ్డ కేంద్రం ఎట్టకేలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణభాగం నిడివి పెద్దగా ఉండటమే కాకుండా, భౌగోళికంగా అలైన్మెంట్ను రూపొందించే విషయంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తగా అలైన్మెంట్ ఖరారు చేయాలని నిర్ణయించిన అధికారులు.. కన్సల్టెన్సీ సంస్థకు పలుసూచనలు చేశారు. గతంలో భారీ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీగా సేవలందించిన అనుభవమున్న ఢిల్లీ సంస్థ ‘ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్’.. అధికారుల సూచనలకు అనుగుణంగా సర్వే చేస్తోంది. గుట్టలు, చెరువులు, ఊళ్ల మధ్య. కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు నాలుగైదు చోట్ల 20 మీటర్ల వరకు ఎత్తున్న చిన్న గుట్టలు అడ్డుగా ఉన్నట్టు గుర్తించారు. ‘వాటిని తొలిచి రోడ్డు నిర్మించే అవకాశం ఉందా? లేదా అలైన్మెంట్ను మళ్లించాలా.. మళ్లించదల్చుకుంటే వాటికి దగ్గర గా ఉన్న జనావాసాల పరిస్థితి ఏమిటి? కొన్ని ప్రాంతాల్లో ఉన్న చెరువులకు, ఊళ్లకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే అలైన్మెంట్ను మళ్లించాలి. దానివల్ల దూరం, నిర్మాణ ఖర్చు పెరుగుతాయ’ని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలపై ఢిల్లీలోని జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు వివరాల ను కన్సల్టెన్సీ సంస్థ అధికా రులకు అందజేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించాలని.. నిర్మాణ వ్యయం, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యోగ్యమైన దాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ, అటవీ శాఖలతో సంప్రదింపులు పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో కాలువలు నిర్మించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో వాటి స్థలాలను ఖరారు చేయలేదు. దీనితో ‘దక్షిణ రింగ్’ అలైన్మెంట్ను ఖరారు చేస్తే.. భవిష్యత్తులో మళ్లీ మార్పుచేర్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల భవిష్యత్తు పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించి తదనుగుణంగా అలైన్మెంటు రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో నీటి పారుదల శాఖ నిర్మాణాలు రాబోతున్నాయనే వివరాలు, ప్రణాళికలు అందించాల్సిందిగా కోరారు. కాలువలు ఉన్న చోట అలైన్మెంటులో ఎలాంటి స్ట్రక్చర్లను నిర్మించాలో తేల్చుకోవటానికి ముందస్తు అవకాశం చిక్కనుంది. ఇక ఏయే ప్రాంతాల్లో అటవీ భూములు ఉన్నాయో గుర్తించిన కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు.. అటవీ శాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నారు. రాజకీయ నేతలు, పలుకుబడి ఉన్న వారి ఒత్తిళ్లకు తలొగ్గి వారికి అనుకూలంగా అలైన్మెంటు రూపొందించారన్న విమర్శలు రాకుండా పకడ్బందీగా వ్యవహరించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా చర్యలు చేపడతామని అంటున్నారు. అలైన్మెంట్కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని, ఈ నెలాఖరులోగానీ వచ్చే నెల మొదటి వారంలోగానీ అలైన్మెంట్లో స్పష్టత వస్తుందని అధికారులు సూచించారు. -
దక్షిణ ‘రింగు’కు 5 వేల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగానికి సంబంధించి 182 కి.మీ. రోడ్డు నిర్మాణానికి దాదాపు 5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కన్సల్టెంట్గా ఎంపికైన ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నో క్రాట్స్ సంస్థ మరో రెండు నెలల్లో తుది అలైన్ మెంట్ను రూపొందించనుంది. దాని ప్రకారం రోడ్డు అసలు నిడివి తేలనుంది. ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం దాదాపు 5 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఉత్తర భాగంలో ఇది 4,200 ఎకరాలుగా ఉంది. అయితే, నిడివి ఎక్కువగా ఉన్నా.. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగం భూసేకరణ ఖర్చు (దామాషా ప్రకారం) తక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భాగంలో ఎక్కువగా అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాణిజ్యపరమైన స్థలాలు కూడా తక్కువగా ఉన్నాయి. దీంతో భూ పరిహారం తక్కువగా ఉండనుంది. ఇంటర్చేంజర్స్ సంఖ్యా తక్కువే.. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగంలో ఇంటర్చేంజర్ల సంఖ్య కూడా తక్కువే ఉండనుంది. ఉత్తర భాగంలో 11 చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులను రీజినల్ రింగు రోడ్డు క్రాస్ చేస్తుండటంతో, ఆయా ప్రాంతాల్లో సింగిల్ ట్రంపెట్, డబుల్ ట్రంపెట్, రోటరీ ఇంటర్చేంజ్.. ఇలా వివిధ ఆకృతుల్లో జంక్షన్లను నిర్మించబోతున్నారు. కానీ దక్షిణ భాగంలో అవి ఏడెనిమిది చోట్ల మాత్రమే అవసరం ఉంటాయని భావిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే ప్రాంతాలు ఈ వైపు తక్కువగా ఉండటమే కారణం. పని ప్రారంభించిన కన్సల్టెన్సీ సంస్థ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం కన్సల్టెన్సీ బాధ్యతలు పొందిన ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ సంస్థ శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించింది. అలైన్మెంటుకు సంబంధించి పాత కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంటును నలుగురు సభ్యుల బృందం పరిశీలిస్తోంది. ఇది గూగుల్ మ్యాప్ ఆధారంగా రూపొందించిన తాత్కాలిక అలైన్మెంటు. క్షేత్రస్థాయిలో పర్యటించటం ద్వారా, ఇందులో చేయాల్సిన మార్పులు, వీలైనంతమేర దగ్గరి దారిగా మార్గాన్ని అనుసంధానించటం, జలవనరులు, జనావాసాలు, గుట్టలను తప్పించటం తదితరాల ద్వారా కొత్త అలైన్మెంటు తయారు చేస్తారు. -
జపాన్లో భారీ భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ ప్రాంతంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రాకారం రాత్రి 9.26 గంటలకు కమమొటో పరిధిలోని మషికి పట్టణంలో సంభవించిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.4గా నమోదైనట్లు జపాన్ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. అయితే ఈ భూకంపంతో సునామీ ప్రమాదమేమీ లేదని వెల్లడించింది. భూకంపం దాటికి 30 సెకన్ల పాటు ప్రకంపనలు గుర్తించామని, ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయని స్థానికులు వెల్లడించారు. భూకంపంపై జపాన్ ప్రధానమంత్రి షింజో అబే స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు చేపడుతామని తెలిపారు. భూకంప కేంద్రం భూమిలోపల 23 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది.