సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగానికి సంబంధించి 182 కి.మీ. రోడ్డు నిర్మాణానికి దాదాపు 5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కన్సల్టెంట్‌గా ఎంపికైన ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నో క్రాట్స్ సంస్థ మరో రెండు నెలల్లో తుది అలైన్ మెంట్‌ను రూపొందించనుంది.
దాని ప్రకారం రోడ్డు అసలు నిడివి తేలనుంది. ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం దాదాపు 5 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఉత్తర భాగంలో ఇది 4,200 ఎకరాలుగా ఉంది. అయితే, నిడివి ఎక్కువగా ఉన్నా.. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగం భూసేకరణ ఖర్చు (దామాషా ప్రకారం) తక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భాగంలో ఎక్కువగా అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాణిజ్యపరమైన స్థలాలు కూడా తక్కువగా ఉన్నాయి. దీంతో భూ పరిహారం తక్కువగా ఉండనుంది.
ఇంటర్‌చేంజర్స్ సంఖ్యా తక్కువే..
ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగంలో ఇంటర్‌చేంజర్ల సంఖ్య కూడా తక్కువే ఉండనుంది. ఉత్తర భాగంలో 11 చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులను రీజినల్ రింగు రోడ్డు క్రాస్ చేస్తుండటంతో, ఆయా ప్రాంతాల్లో సింగిల్ ట్రంపెట్, డబుల్ ట్రంపెట్, రోటరీ ఇంటర్‌చేంజ్.. ఇలా వివిధ ఆకృతుల్లో జంక్షన్లను నిర్మించబోతున్నారు. కానీ దక్షిణ భాగంలో అవి ఏడెనిమిది చోట్ల మాత్రమే అవసరం ఉంటాయని భావిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే ప్రాంతాలు ఈ వైపు తక్కువగా ఉండటమే కారణం.
పని ప్రారంభించిన కన్సల్టెన్సీ సంస్థ
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం కన్సల్టెన్సీ బాధ్యతలు పొందిన ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ సంస్థ శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించింది. అలైన్‌మెంటుకు సంబంధించి పాత కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్‌మెంటును నలుగురు సభ్యుల బృందం పరిశీలిస్తోంది. ఇది గూగుల్ మ్యాప్ ఆధారంగా రూపొందించిన తాత్కాలిక అలైన్‌మెంటు. క్షేత్రస్థాయిలో పర్యటించటం ద్వారా, ఇందులో చేయాల్సిన మార్పులు, వీలైనంతమేర దగ్గరి దారిగా మార్గాన్ని అనుసంధానించటం, జలవనరులు, జనావాసాలు, గుట్టలను తప్పించటం తదితరాల ద్వారా కొత్త అలైన్‌మెంటు తయారు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment