మెగా హెచ్‌ఎండీఏ! | CM Revanth wants to bring areas between ORR and RRR under HMDA | Sakshi
Sakshi News home page

మెగా హెచ్‌ఎండీఏ!

Published Thu, Feb 29 2024 12:29 AM | Last Updated on Thu, Feb 29 2024 9:52 AM

CM Revanth wants to bring areas between ORR and RRR under HMDA - Sakshi

హెచ్‌ఎండీఏపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి

ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ విస్తరణ 

ఓఆర్‌ఆర్‌ – ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలన్న సీఎం

రెండు రింగ్‌ రోడ్లను అనుసంధానిస్తూ రేడియల్‌ రోడ్లు 

ఓఆర్‌ఆర్‌లోపు ప్రాంతం, ఆర్‌ఆర్‌ఆర్‌ లోపు ప్రాంతం రెండు వేర్వేరు యూనిట్లుగా అభివృద్ధి ప్రణాళికలు  

సిటీతో పాటు శివారు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత 

మాస్టర్‌ ప్లాన్‌–2050కి అనుగుణంగా విజన్‌ డాక్యుమెంట్‌కు రూపకల్పన 

అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశం 

ఓఆర్‌ఆర్‌ టోల్‌ టెండర్లలో అవకతవకలపై సీబీఐ లేదా 

తత్సమాన సంస్థతో విచారణ జరిపిస్తామని వెల్లడి 

పురపాలక శాఖ, హెచ్‌ఎండీఏపై ముఖ్యమంత్రి సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ను రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ఏడువేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏ సుమారు పదివేల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో పురపాలక శాఖ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నుంచి కొత్తగా రానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఉండే ప్రాంతాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకుని రావాలని ఆదేశించారు. రెండు రింగ్‌ రోడ్లను అనుసంధానించేలా రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. 

ఓఆర్‌ఆర్‌ లోపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా, ఆర్‌ఆర్‌ఆర్‌ లోపు ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న శివారు మునిసిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌– 2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించాలని ఆదేశించారు.  

ఆమ్రపాలికి ‘టోల్‌ నివేదిక’ బాధ్యత 
ఓఆర్‌ఆర్‌ టోల్‌ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని హెచ్‌ఎండీఏ అధికారులను సీఎం ఆదేశించారు. కనీస రేటు నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని ప్రశ్నించారు. టెండర్లలో ఏయే సంస్థలు పాల్గొన్నాయి? అవకతవకల్లో ఎవరెవరి ప్రమేయముంది? తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని చెప్పారు. టెండర్లకు అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరు, జరిగిన అవకతవకలపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలిని ఆదేశించారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత  కేబినెట్లో చర్చించి, టెండర్ల వ్యవహారంపై సీబీఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

టెండర్‌ విధానంతో రూ.15 వేల కోట్లకు పైగా నష్టం! 
టెండర్లకు ముందు ఓఆర్‌ఆర్‌పై టోల్‌ కింద ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కానీ కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్‌బీ కంపెనీకి ఎలా అప్పగించారని రేవంత్‌ ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ అనుసరించిన టెండర్‌ విధానంతో ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనా వేశారు.

హెచ్‌ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్‌ తయారు చేయించగా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్‌ను ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయని సీఎం పేర్కొన్నారు. టెండర్‌ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.  

చెరువులు, కుంటల్ని పరిరక్షించాలి 
హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలని, అలాగే ల్యాండ్‌ పూలింగ్‌ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్‌ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్‌ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. ల్యాండ్‌ పార్శిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కాకుండా ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.

డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. కాగా హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్‌ పార్శిళ్లు ఉంటే.. అందులో 2,031 ఎకరాల పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.  

‘కమ్యూనిటీ’ స్థలాలపై తక్షణ సర్వే 
హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌ తదితర పట్టణాల లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచి్చన స్థలాలు తమ అ«దీనంలోనే ఉన్నాయా? లేక ఆక్రమణకు గురయ్యాయా? వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పొరేట్‌ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. స్థానికులైన పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా కనీసం 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పారు.  

ప్రపంచ స్థాయి టూరిస్ట్‌ ప్లేస్‌గా హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు 
హుస్సేన్‌సాగర్‌పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన, అందమైన జోన్‌గా తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇటు అంబేడ్కర్‌ విగ్రహం, ఎన్టీఆర్‌ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి నుంచి అటు నెక్లెస్‌ రోడ్డు, ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సూచించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలిగించాలన్నారు.

దుబాయ్‌ తరహాలో స్కై వాక్‌ వే, ఫుడ్‌ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్‌ జోన్, గ్రీనరీ, ల్యాండ్‌ స్కేప్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్‌కు మళ్లించి పర్యాటక జోన్‌గా మార్చాలని చెప్పారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని ఆదేశించారు. సీఎస్‌ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement