
సోమవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో డీకే అరుణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కిషన్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ కలసి రీజినల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించడంతో పాటు, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని కోరారు. గడ్కరీతో భేటీ అయిన తర్వాత కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా ఈ రోడ్డు ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో 338 కిలోమీటర్ల మేర తెలంగాణకు మణిహారంలా ‘రీజనల్’రోడ్డు ఉంటుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో హైదరాబాద్‌కు ట్రాఫిక్ తగ్గుతుందని, అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 40 శాతం మంది రాష్ట్ర ప్రజలు ఆర్‌ఆర్‌ఆర్ కనెక్టివిటీలో ఉంటారని చెప్పారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రమంత్రిని కోరామని.. రాష్ట్రం భూసేకరణ త్వరితగతిన చేపడితే కేంద్రం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారని కిషన్‌రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.17 వేల కోట్లలో భూసేకరణకు రూ.4 వేల కోట్లు అవుతుందని, అందులో రాష్ట్ర వాటా కింద రూ.1,905 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని వెల్లడించారు.
రెండు దశల్లో నిర్మాణ పనులు...
సంగారెడ్డి నుంచి తూప్రాన్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించబోయే మొదటి దశకు 2017లోనే జాతీయ రహదారి 161ఏఏగా కేంద్రం గుర్తించిందన్న విషయాన్ని కిషన్‌రెడ్డి బృందం గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. చౌటుప్పల్–షాద్‌నగర్ మీదుగా కంది వరకు ఉన్న రెండో దశకు జాతీయ రహదారి నంబర్ కేటాయించాలని కోరారు. రూ.10వేల కోట్లతో మొదటిదశ రహదారి నిర్మాణ పనులు జరుగుతాయని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాగపూర్–హైదరాబాద్–బెంగళూరు కారిడార్, పుణే–హైదరాబాద్–విజయవాడ కారిడార్‌లో జాతీయ రహదారి కనెక్టివిటీకి ప్రాముఖ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మూడేళ్లలోగా ఆర్‌ఆర్‌ఆర్‌ను పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment