సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ రహదారులను 100 కిలోమీటర్ల గరిష్ట వేగానికి వీలుగా నిర్మిస్తున్నా ఆర్‌ఆర్‌ఆర్‌ను మాత్రం ఇంకో 20 కి.మీ. ఎక్కువ వేగంతో వెళ్లేలా నిర్మించనున్నారు.
వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరిగే పరిస్థితి లేకుండా 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు తిరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదుపుతప్పిన వాహనాలు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లకుండా సెంట్రల్ మీడియన్‌కు కూడా క్రాష్ బారియర్లు పెట్టనున్నారు. ఇలా సరికొత్త హంగులతో ఆర్‌ఆర్‌ఆర్ రూపుదిద్దుకోబోతోంది.
మలుపుల ప్రభావం లేకుండా..
సాధారణంగా రోడ్డు మలుపులే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుంటాయి. ఇందుకే చాలా రోడ్లపై వెళ్లాల్సిన వేగం కన్నా తక్కువ వేగానికే పరిమితం చేస్తుంటారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై 80 కి.మీ. వేగ పరిమితి బోర్డులు కనిపిస్తుండటం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ పెట్టి మరీ వాహనదారులను నియంత్రిస్తున్నారు. కానీ ఆ పరిస్థితి రాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ను డిజైన్ చేస్తున్నారు.
జాతీయ రహదారులపై మలుపుల ప్రభావం లేకుండా 700 మీటర్ల ముందు నుంచే రోడ్డు మలుపునకు వీలుగా వాలు ఉండేలా చూడాలని ప్రమాణాలు నిర్ధారించారు. దీని వల్ల ఎక్కడా మలుపు ఉన్న భావన రాదు. ఎక్స్‌ప్రెస్ వేల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌కు 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అంటే మలుపు ఉన్న ప్రాంతానికి 2.5 కి.మీ. ముందు నుంచే రోడ్డు డిజైన్ వాలుగా మారుతుంది. సాధారణంగా మలుపు వద్ద వాహనాలు అదుపు తప్పకుండా రోడ్లపై ఔటర్ లైన్ ఎత్తుగా ఉంటుంది. ఇదీ కొన్ని వాహనాలకు ఇబ్బందిగా ఉంటుంది.
అయితే ఆర్‌ఆర్‌ఆర్‌కు 2.5 కి.మీ. దూరం నుంచే మలుపు డిజైన్ చేస్తున్నందున ఔటర్ లైన్ సమతలంగానే ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పాత అలైన్‌మెంట్ సమయంలో కాళేశ్వరం కాలువలు నిర్మించలేదు. దీంతో కాలువలు, ఇతర జలాశయాలు, చానళ్లను తప్పిస్తూ రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ను ఇటీవల ఖరారు చేశారు. వీటిని తప్పించాల్సి రావడంతో భారీ మలుపులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా, మలుపుల ప్రభావం లేకుండా రెండున్నర కిలోమీటర్ల నుంచి వాహనాలు మలిగేలా రోడ్డు నిర్మిస్తున్నారు.
4 వరుసల క్రాష్ బారియర్లు
కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులకుచివర్లలో ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు చివర్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు వరుసల్లో వీటిని ఆర్‌ఆర్‌ఆర్‌పై ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు చివర్లలో రెండు వైపులా రెండు వరుసలతో పాటు సెంట్రల్ మీడియన్ వైపు మరో వరుస చొప్పున మూడు అడుగుల ఎత్తులో వీటిని పెట్టనున్నారు.
సాధారణంగా సెంట్రల్ మీడియన్‌లో డివైడర్ తరహాలో ఒక అడుగు ఎత్తుతో రాతి వరుస నిర్మించి మధ్యలో మట్టి నింపి మొక్కలుపెడతారు. కానీ చాలా చోట్ల వాహనాలు అదుపు తప్పినప్పుడు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లి ఎదురు వచ్చే వాహనాలను ఢీకొంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌లో సెంట్రల్ మీడియన్‌కు ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రాష్ బారియర్ ఉన్నందున ఎత్తుగా రాతి నిర్మాణం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment