vehcles
-
‘ఫిష్ ఆంధ్రా’తో ఇంటి ముంగిటకే మత్స్య ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: వినియోగదారుల ముంగిటకే చేపలు, రొయ్యల విక్రయ వాహనాలు (ఫిష్ వెండింగ్ వెహికల్స్) రానున్నాయి. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు ఫిష్ ఆంధ్రా పేరిట ఆక్వా హబ్‌లు, వాటికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై వాటిని ప్రజల ముంగిటకే చేర్చే ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు 40 నుంచి 60 శాతం సబ్సిడీపై మొబైల్ త్రీ వీలర్ ఫిష్ వెండింగ్ కార్ట్స్, ఫోర్ వీలర్ మొబైల్ ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ వెహికల్స్ అందజేస్తోంది. మూడు చక్రాల వాహనం ధర రూ.4 లక్షలు కాగా.. నాలుగు చక్రాల వాహనం ధర సైజును బట్టి రూ.12 లక్షల నుంచి రూ.23 లక్షలుగా నిర్ణయించారు. వీటిపై ఎస్సీ, ఎస్టీతోపాటు మహిళా లబ్ధిదారులకు 60 శాతం చొప్పున, ఇతరులకు 40 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారులు చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా సమకూరుస్తారు. తొలి విడతగా 450 వాహనాలు ఈ వాహనాలను సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేస్తుండగా.. తొలి విడతలో 300 త్రీ వీలర్, 150 ఫోర్ వీలర్ వాహనాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. తొలి వాహనాన్ని మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన ఉప్పుల సుందరరావు అనే ఎస్సీ లబ్ధిదారునికి సోమవారం అందజేశారు. వాహనాల్లో ప్రత్యేకతలివే.. మూడు చక్రాల వాహనంలో 200 కేజీల మత్స్య ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. 20 లీటర్ల సామర్థ్యం గల రెండు ఐస్ బాక్స్‌లు, వేయింగ్ మెషిన్, మైక్ సౌకర్యం, మత్స్య ఉత్పత్తులను డ్రెస్సింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. నాలుగు చక్రాల వాహనంలో అయితే.. వాహన రకాన్ని బట్టి 2 నుంచి 8 టన్నుల వరకు నిల్వ ఉండేలా డిజైన్ చేశారు. అత్యాధునిక డ్రెస్సింగ్, రెడీ టూ ఈట్ కుకింగ్ చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటిద్వారా లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటెడ్ అండ్ కుక్డ్ ప్రొడక్టŠస్ను రిటైల్, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా అమ్ముతారు. స్నాక్స్, ఇన్స్టెంట్ కుకింగ్ ఫుడ్స్ కూడా వీటిలో ఉంటాయి. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
ఆర్ఆర్ఆర్పై వాహనాల వేగం 120 కి.మీ. మలుపే లేకుండా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ రహదారులను 100 కిలోమీటర్ల గరిష్ట వేగానికి వీలుగా నిర్మిస్తున్నా ఆర్ఆర్ఆర్ను మాత్రం ఇంకో 20 కి.మీ. ఎక్కువ వేగంతో వెళ్లేలా నిర్మించనున్నారు. వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరిగే పరిస్థితి లేకుండా 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు తిరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదుపుతప్పిన వాహనాలు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లకుండా సెంట్రల్ మీడియన్‌కు కూడా క్రాష్ బారియర్లు పెట్టనున్నారు. ఇలా సరికొత్త హంగులతో ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకోబోతోంది. మలుపుల ప్రభావం లేకుండా.. సాధారణంగా రోడ్డు మలుపులే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుంటాయి. ఇందుకే చాలా రోడ్లపై వెళ్లాల్సిన వేగం కన్నా తక్కువ వేగానికే పరిమితం చేస్తుంటారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై 80 కి.మీ. వేగ పరిమితి బోర్డులు కనిపిస్తుండటం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ పెట్టి మరీ వాహనదారులను నియంత్రిస్తున్నారు. కానీ ఆ పరిస్థితి రాకుండా ఆర్ఆర్ఆర్ను డిజైన్ చేస్తున్నారు. జాతీయ రహదారులపై మలుపుల ప్రభావం లేకుండా 700 మీటర్ల ముందు నుంచే రోడ్డు మలుపునకు వీలుగా వాలు ఉండేలా చూడాలని ప్రమాణాలు నిర్ధారించారు. దీని వల్ల ఎక్కడా మలుపు ఉన్న భావన రాదు. ఎక్స్‌ప్రెస్ వేల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్కు 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అంటే మలుపు ఉన్న ప్రాంతానికి 2.5 కి.మీ. ముందు నుంచే రోడ్డు డిజైన్ వాలుగా మారుతుంది. సాధారణంగా మలుపు వద్ద వాహనాలు అదుపు తప్పకుండా రోడ్లపై ఔటర్ లైన్ ఎత్తుగా ఉంటుంది. ఇదీ కొన్ని వాహనాలకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆర్ఆర్ఆర్కు 2.5 కి.మీ. దూరం నుంచే మలుపు డిజైన్ చేస్తున్నందున ఔటర్ లైన్ సమతలంగానే ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పాత అలైన్మెంట్ సమయంలో కాళేశ్వరం కాలువలు నిర్మించలేదు. దీంతో కాలువలు, ఇతర జలాశయాలు, చానళ్లను తప్పిస్తూ రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ను ఇటీవల ఖరారు చేశారు. వీటిని తప్పించాల్సి రావడంతో భారీ మలుపులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా, మలుపుల ప్రభావం లేకుండా రెండున్నర కిలోమీటర్ల నుంచి వాహనాలు మలిగేలా రోడ్డు నిర్మిస్తున్నారు. 4 వరుసల క్రాష్ బారియర్లు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులకుచివర్లలో ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు చివర్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు వరుసల్లో వీటిని ఆర్ఆర్ఆర్పై ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు చివర్లలో రెండు వైపులా రెండు వరుసలతో పాటు సెంట్రల్ మీడియన్ వైపు మరో వరుస చొప్పున మూడు అడుగుల ఎత్తులో వీటిని పెట్టనున్నారు. సాధారణంగా సెంట్రల్ మీడియన్‌లో డివైడర్ తరహాలో ఒక అడుగు ఎత్తుతో రాతి వరుస నిర్మించి మధ్యలో మట్టి నింపి మొక్కలుపెడతారు. కానీ చాలా చోట్ల వాహనాలు అదుపు తప్పినప్పుడు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లి ఎదురు వచ్చే వాహనాలను ఢీకొంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఆర్ఆర్ఆర్లో సెంట్రల్ మీడియన్‌కు ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రాష్ బారియర్ ఉన్నందున ఎత్తుగా రాతి నిర్మాణం ఉండదు. -
నల్లగొండ సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కార్లు, ద్విచక్రవాహనాల పై వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గురువారం నల్లగొండ జిల్లాలో ఏపీతో సరిహద్దులు ఉన్న రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌వాసులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. ఒకేసారి వేల సం ఖ్యలో ప్రజలు రావడంతో దామచర్ల మండలం వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టు, నాగార్జునసాగర్ చెక్‌పోస్టుల వద్ద ఏపీ పోలీసులు వారిని కొద్దిసేపు అడ్డుకుని అనంతరం షరతులతో రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతించారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన దామరచర్ల మండలం వాడపల్లి వంతెన వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామునుంచే ద్విచక్రవాహనాలు, కార్లల్లో ఏపీకి వెళ్లేందుకు జనం వచ్చారు. చెక్‌పోస్టు వద్ద నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) చూసిన అనంతరం తెలంగాణ పోలీసులు వారు ముందుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణానది ఆవలి ఒడ్డున గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వీరిని కొద్దిసేపు అడ్డుకున్నారు. సమస్య తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీలతో కలసి వాడపల్లి చెక్ పోస్టును సందర్శించారు. పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడంతో ప్రజలు వచ్చేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారని, ఇకపై సరిహద్దును మూసివేస్తామని మంత్రి పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇకపై ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోవద్దని మంత్రి సూచించారు. క్వారంటైన్‌కు వెళతామంటేనే అనుమతి ఏపీకి సరిహద్దుగా ఉన్న నాగార్జునసాగర్‌పై వంతెన దాటగానే గుంటూరు పోలీసులు ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టళ్లు, మెస్సులు మూతపడడంతో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) తీసుకుని బుధవారం రాత్రే ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు చొప్పున బయలుదేరి తెల్లారే సరికల్లా నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. మరికొంతమంది అద్దెకార్లు, టాటా సుమోల్లో ఆంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేందుకు ఇక్కడికి చేరుకున్నారు. అయితే నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వారి వాహనాలను మొదట నిలిపివేశారు. దీనిపై జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో గుంటూరు జిల్లా ఎస్పీ విజయారావు సరిహద్దుకు చేరుకుని 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళతామంటే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. అయితే, ఈ షరతు నచ్చని చాలామంది తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మరికొంత మంది దామరచర్ల మండలం వాడపల్లి సరిహద్దు నుంచి ఏపీలోకి వెళ్లొచ్చని వాడపల్లికి వచ్చారు. -
ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాలపై రాళ్ల వర్షం
పుణె: ప్రసిద్ధ ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిపై వెళుతున్న వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్ల వాన కురిసింది. రహదారిలోని అదోషి టన్నెల్ వద్ద ఆదివారం మద్యాహ్నం కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా బండరాళ్లు కూలి ఓ కారు, మరో రెండు వాహనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మరణించినట్లు తెలిసింది. చిత్రంలో కినిపిస్తున్న కారుపై పెద్ద బండరాళ్లు నేరుగా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. రహదారిపై రాళ్లు గుట్టలా పేరుకుపోవడంతో ఇరువైపులా భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. యంత్రాలతో రాళ్లను తొలిగిస్తున్న పోలీసులు మరికొద్ది గంటల్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తామని చెప్పారు. ముంబై- పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఇలాంటివి ఐదారు టన్నెల్స్ ఉన్నాయి. దీంతో అధికారులు అన్నిచోట్ల ముందస్తు రక్షణచర్యలు చేపట్టారు.