సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంగ్లండ్‌లోని థేమ్స్ నది మాదిరిగా మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్‌లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం కలిసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రికి అందచేసింది. భట్టిని కలిసిన వారిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధులు మేకా విజయసాయి, కె.శ్రీధర్‌రెడ్డి, కాళీ ప్రసాద్, దశరథ్‌రెడ్డి, చలపతిరావు, భూపాల్‌రెడ్డి, మారోజు శ్రీధర్‌రావు, అశోక్, రామిరెడ్డి వెంకట్ రెడ్డి, కె.కె.రెడ్డి తదితరులు ఉన్నారు.
రియల్ ఎస్టేట్ బృందం ప్రతిపాదనలివీ..
♦ భవన నిర్మాణ అనుమతులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం మార్ట్‌గేజ్ విధానాన్ని ఎత్తేయాలి.
♦ అధికంగా ఉన్న రిజి్రస్టేషన్ చార్జీలను తగ్గించాలి. జీఓ 50ని ఎత్తేయాలి.
♦ పెండింగ్‌లో ఉన్న లక్షలాది ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.
♦ రంగారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న టీఎస్ బీ–పాస్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలి.
♦ రాష్ట్రంలో గత 6 నెలలు ఖాళీగా ఉన్న పర్యావరణ కమిటీని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలి.
♦ భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లపై యూనిట్‌కు వసూలు చేస్తున్న రూ. రూ. 14ను తగ్గించేలి.
వెల్త్ క్రియేటర్లను ఇబ్బంది పెట్టం..
రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చే వెల్త్ క్రియేటర్లను ఇబ్బందిపెట్టబోమని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రియల్ ఎస్టేట్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. మూసీ నది శుద్ధితో సుందరీకరణ జరిగి పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందన్నారు.
హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండ్రస్టియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని భట్టి చెప్పారు. ‘ధరణి’పై చేసే సూచనలను తాను పరిశీలించడంతోపాటు ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీకి అందిస్తానని తెలిపారు. పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment