
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)ను అభివృద్ధి ప్రణాళికలో భాగంగా తామే ఏర్పాటు చేస్తున్నట్టు టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రీజినల్ రింగు రోడ్డు ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదని అన్నారు.
వైఎస్ హయాంలోనే సంగారెడ్డి–షాద్‌నగర్, షాద్‌నగర్–చౌటుప్పల్, చౌటుప్పల్–భువనగిరి, భువనగిరి–తూప్రాన్, తూప్రాన్–సంగారెడ్డి వరకు జైకా నిధులతో ఐదు దశల్లో ఈ రోడ్డుకు అనుమతులు వచ్చాయన్నారు. సంగారెడ్డి–షాద్‌నగర్ వరకు రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల జరిగితే, తామేదో ఉద్ధరిస్తున్నట్టు ప్రభుత్వం బడాయికి పోవడం విడ్డూరమన్నారు.