రూ. 22 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం
దీంతో నెక్ట్స్ లెవల్‌లో తెలంగాణ అభివృద్ధి
క్రెడాయ్ స్టేట్‌కాన్ సదస్సులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) హైదరాబాద్‌కు ఎలాగైతే గేమ్ చేంజర్‌గా మారిందో, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌ఆర్) కూడా తెలంగాణకు సూపర్ గేమ్‌చేంజర్‌గా మారుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రూ.22 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఆధ్వర్యంలో మంగళవారం హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ థీమ్‌తో స్టేట్‌కాన్ సదస్సు జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ్ మాట్లాడుతూ మూసీ రివర్‌ఫ్రంట్, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, ముచ్చర్ల ఫోర్త్ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ వంటి బృహత్తర కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, వీటితో రాష్ట్ర అభివృద్ధి నెక్ట్స్ లెవల్‌కు దూసుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడంతోపాటు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికులను తయారు చేసేందుకు స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.
రాష్ట్రంలో భూముల విలువలు పెంచడంతో పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు.. అంతర్జాతీయ నగరాలతో పోటీ పడేస్థాయికి భాగ్యనగరం ఎదిగిందని కొనియాడారు. రాష్ట్ర ప్రగతిలో డెవలపర్లు కూడా భాగస్వాములేనని, నిర్మాణ రంగ సమస్యలను లిఖిత పూర్వకంగా ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్సార్ దూరదృష్టితోనే : మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కాల పరిమితి పెట్టుకొని, ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. 24 నెలల డెడ్‌లైన్‌లోనే ఔటర్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు భూసేకరణ, నిర్మాణ పనులు పూర్తి చేశారని, వీటికి సమాంతరంగా పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారని చెప్పారు. దీంతో మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ రంగం వైఎస్సార్ దూరదృష్టితో కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరించిందన్నారు.
ఔటర్ చుట్టూ 16 రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని, రహదారుల డిజైన్లు డీపీఆర్ దశలో ఉన్నాయని తెలిపారు. ఫోర్త్ సిటీలో అహ్మదాబాద్ తరహాలో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ఈమేరకు బీసీసీఐ ప్రతినిధులతో సమావేశమయ్యారని చెప్పారు. అనంతరం సీబీఆర్‌ఈ, సీఆర్‌ఈడీఏఐ సంయుక్తంగా రూపొందిన ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ నివేదికను మంత్రులు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ప్రెసిడెంట్(ఎలెక్ట్) ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment