సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను తాము అడ్డుకోవడంలేదని క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.
బీజేపీ ఎంపీ ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు. మూసీ కంపును కడగమని మేమే చెబుతున్నాం. నల్లగొండ ప్రజలు మూసీలో స్వచ్చమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్లగొండకు మూసీ కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్‌సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్, పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసీ బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి.
ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు. ఐదు కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా?. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి?. గజ్వేల్‌లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా.
భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు.. రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదు. ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కొని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment