సాక్షి, హైదరాబాద్: కొత్తగా రూపుదిద్దుకోనున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దాదాపు 5 మీటర్ల ఎత్తుతో నిర్మిం చనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ కానప్పటికీ దాదాపు అంత ఎత్తులో నిర్మితమయ్యేలా డిజైన్లు రూపొందుతున్నాయి. అనూహ్యంగా రికార్డు స్థాయి వర్షాలు కురిసి భారీగా వరద పోటెత్తినా రోడ్డుపైకి నీరు చేరని విధంగా, అదే సమయంలో రింగ్‌రోడ్డు లోపల ఉన్న జలవనరుల్లో వరద చేరికకు ఎలాం టి ఆటంకం కలగకుండా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
గతేడాది నగరంలో అనూహ్యంగా భారీ వర్షాలు కురిసి కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు కానిచోట్ల కూడా భారీగా నీళ్లు చేరి ఇళ్లను ముంచెత్తాయి. ఇలాంటి మెరుపు వరదలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌ఆర్‌ఆర్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ రహదారి ఉత్తర భాగానికి సంబంధించి ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ కే అండ్ జే కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ అలైన్‌మెంట్ ఖరారు ప్రక్రియలో బిజీగా ఉండగా, మరోవైపు ఇంజనీర్లు రోడ్డు ఎలా ఉండాలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రికార్డు స్థాయి ఎత్తులో..!
ఎక్స్‌ప్రెస్ వేలను సాధారణంగా భూమి నుంచి ఒక మాదిరి ఎత్తుగా ఉండేలా నిర్మిస్తారు. వేరే రహదారులు దాన్ని క్రాస్ చేసే చోట ఎత్తును మరింత పెంచుతారు. దిగువనుంచి అండర్‌పాస్ రూపంలోనో, మరో రూపంలోనే ఆ రోడ్డు క్రాస్ చేసేలా చూస్తారు. మిగతా ప్రాంతాల్లో రోడ్డు ఎత్తు తక్కువగానే ఉంటుంది. కానీ ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం చాలా ఎత్తులో నిర్మించబోతున్నారు. దేశంలోనే పొడవైనదిగా ఇప్పటికే రికార్డు సొంతం చేసుకున్న ఈ రింగ్‌రోడ్డు ప్రతిపాదన, ఎత్తులో కూడా ఘనతను సాధించే అవకాశం ఉంది.
వరద కోసం ప్రత్యేక కల్వర్టులు
రింగు రోడ్డు అంటే.. వృత్తాకారంలో నిర్మితమై అవతలి ప్రాంతంతో అంతర్భాగాన్ని వేరు చేస్తుంది. కోటగోడలా మారి నీటి ప్రవాహానికి పెద్ద ఆటంకంలా ఉంటుంది. వర్షాలు కురిసినప్పుడు సహజసిద్ధంగా ఉండే పల్లాన్ని ఆధారంగా చేసుకుని ప్రవహించే వరదను అడ్డుకుంటుంది. రింగ్‌రోడ్డు లోపల ఉండే జలవనరులకు విఘాతం కలిగిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఆర్‌ఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది దాదాపు 370 కి.మీ. చట్టు కొలత (అలైన్‌మెంటు ఖరారయ్యాక అసలు పరిధి తెలుస్తుంది)తో రింగులాగా రూపొందనుంది.
లోపలి వైపు వేల సంఖ్యలో చెరువులు, కుంటలున్నాయి. వీటికి వాన నీటి వరద ఏయే ప్రాంతాల్లో ఎటువైపు నుంచి ప్రవహిస్తుందో గుర్తించి, ఆ వరద రింగురోడ్డుకు తగిలే చోట ప్రత్యేక కల్వర్టులు ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో భారీ పైపులను ఏర్పాటు చేస్తారు. కానీ దీనికి పైపు పద్ధతి కల్వర్టులు కాకుండా బాక్సు (డబ్బా) మోడల్ కల్వర్టులు నిర్మించాలని నిర్ణయించారు.
వరద ప్రవాహ అంచనా మేరకు గరిష్టంగా పది అడుగుల ఎత్తు కల్వర్టులు ఉండేలా ప్లాన్ చేస్తుండటం విశేషం. పదడుగుల ప్రవాహ ద్వారం ఉండటంతో, ఎంత పరిమాణంలో వరద వచ్చినా సులభంగా రోడ్డు దిగువ నుంచి జలవనరులను చేరుకునే వీలుంటుంది.
అలైన్‌మెంటు ప్రతిపాదనల్లోనూ ఈ వివరాలు
కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే నాలుగు అలైన్‌మెంటు ప్రతిపాదనలు రూపొందించి ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించింది. ఆయా ప్రతిపాదనల్లో.. ఎన్ని జలవనరులున్నాయి? వాటి నీటి ప్రవాహ పల్లం, వాటికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పొందుపరిచింది.
ఈ ప్రణాళికలు ఎలా ఉన్నాయో పరిశీలించాల్సిందిగా అధికారులకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆదేశాలందాయి. జనవరి నాటికి అంతా సమీక్షించి తుది అలైన్‌మెంటును ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు విస్తరించేలా భూమిని సమీకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment