Ring Roads
-
నీరు చేరదు.. వరద ఆగదు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగా రూపుదిద్దుకోనున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దాదాపు 5 మీటర్ల ఎత్తుతో నిర్మిం చనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ కానప్పటికీ దాదాపు అంత ఎత్తులో నిర్మితమయ్యేలా డిజైన్లు రూపొందుతున్నాయి. అనూహ్యంగా రికార్డు స్థాయి వర్షాలు కురిసి భారీగా వరద పోటెత్తినా రోడ్డుపైకి నీరు చేరని విధంగా, అదే సమయంలో రింగ్‌రోడ్డు లోపల ఉన్న జలవనరుల్లో వరద చేరికకు ఎలాం టి ఆటంకం కలగకుండా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతేడాది నగరంలో అనూహ్యంగా భారీ వర్షాలు కురిసి కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు కానిచోట్ల కూడా భారీగా నీళ్లు చేరి ఇళ్లను ముంచెత్తాయి. ఇలాంటి మెరుపు వరదలను దృష్టిలో పెట్టుకుని ఆర్ఆర్ఆర్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ రహదారి ఉత్తర భాగానికి సంబంధించి ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ కే అండ్ జే కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో బిజీగా ఉండగా, మరోవైపు ఇంజనీర్లు రోడ్డు ఎలా ఉండాలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రికార్డు స్థాయి ఎత్తులో..! ఎక్స్‌ప్రెస్ వేలను సాధారణంగా భూమి నుంచి ఒక మాదిరి ఎత్తుగా ఉండేలా నిర్మిస్తారు. వేరే రహదారులు దాన్ని క్రాస్ చేసే చోట ఎత్తును మరింత పెంచుతారు. దిగువనుంచి అండర్‌పాస్ రూపంలోనో, మరో రూపంలోనే ఆ రోడ్డు క్రాస్ చేసేలా చూస్తారు. మిగతా ప్రాంతాల్లో రోడ్డు ఎత్తు తక్కువగానే ఉంటుంది. కానీ ఆర్ఆర్ఆర్ మొత్తం చాలా ఎత్తులో నిర్మించబోతున్నారు. దేశంలోనే పొడవైనదిగా ఇప్పటికే రికార్డు సొంతం చేసుకున్న ఈ రింగ్‌రోడ్డు ప్రతిపాదన, ఎత్తులో కూడా ఘనతను సాధించే అవకాశం ఉంది. వరద కోసం ప్రత్యేక కల్వర్టులు రింగు రోడ్డు అంటే.. వృత్తాకారంలో నిర్మితమై అవతలి ప్రాంతంతో అంతర్భాగాన్ని వేరు చేస్తుంది. కోటగోడలా మారి నీటి ప్రవాహానికి పెద్ద ఆటంకంలా ఉంటుంది. వర్షాలు కురిసినప్పుడు సహజసిద్ధంగా ఉండే పల్లాన్ని ఆధారంగా చేసుకుని ప్రవహించే వరదను అడ్డుకుంటుంది. రింగ్‌రోడ్డు లోపల ఉండే జలవనరులకు విఘాతం కలిగిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్ఆర్ఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది దాదాపు 370 కి.మీ. చట్టు కొలత (అలైన్‌మెంటు ఖరారయ్యాక అసలు పరిధి తెలుస్తుంది)తో రింగులాగా రూపొందనుంది. లోపలి వైపు వేల సంఖ్యలో చెరువులు, కుంటలున్నాయి. వీటికి వాన నీటి వరద ఏయే ప్రాంతాల్లో ఎటువైపు నుంచి ప్రవహిస్తుందో గుర్తించి, ఆ వరద రింగురోడ్డుకు తగిలే చోట ప్రత్యేక కల్వర్టులు ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో భారీ పైపులను ఏర్పాటు చేస్తారు. కానీ దీనికి పైపు పద్ధతి కల్వర్టులు కాకుండా బాక్సు (డబ్బా) మోడల్ కల్వర్టులు నిర్మించాలని నిర్ణయించారు. వరద ప్రవాహ అంచనా మేరకు గరిష్టంగా పది అడుగుల ఎత్తు కల్వర్టులు ఉండేలా ప్లాన్ చేస్తుండటం విశేషం. పదడుగుల ప్రవాహ ద్వారం ఉండటంతో, ఎంత పరిమాణంలో వరద వచ్చినా సులభంగా రోడ్డు దిగువ నుంచి జలవనరులను చేరుకునే వీలుంటుంది. అలైన్‌మెంటు ప్రతిపాదనల్లోనూ ఈ వివరాలు కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే నాలుగు అలైన్‌మెంటు ప్రతిపాదనలు రూపొందించి ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. ఆయా ప్రతిపాదనల్లో.. ఎన్ని జలవనరులున్నాయి? వాటి నీటి ప్రవాహ పల్లం, వాటికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పొందుపరిచింది. ఈ ప్రణాళికలు ఎలా ఉన్నాయో పరిశీలించాల్సిందిగా అధికారులకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆదేశాలందాయి. జనవరి నాటికి అంతా సమీక్షించి తుది అలైన్‌మెంటును ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు విస్తరించేలా భూమిని సమీకరిస్తారు. -
జిల్లాకు మణిహారమే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర రాజధానికి సగటున 50–60 కిలోమీటర్ల దూరం నుంచి 334 కి.మీ పొడవు మేర నిర్మించనున్న రీజినల్ రింగ్‌రోడ్డు ఎక్కువ భాగం మన జిల్లా గుండా వెళ్లనుంది. జిల్లా పరిధిలో సుమారు 150 కి.మీ మేర ఈ హైవే ఉండనుంది. సంగారెడ్డి జిల్లా కంది నుంచి చౌటుప్పల్ వరకు వెళ్లే ఈ అలైన్మెంట్లో (180 కి.మీ) 30 కి.మీలు మినహా మిగతా అంతా జిల్లా భూ భాగంలో నిర్మించాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఆరు లేన్ల రహదారికి కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపింది. కిలోమీటరుకు రూ.33 కోట్లు కేంద్రం ఆర్థిక చేయూతతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.11వేల కోట్లు. దీంట్లో రూ.3,032 కోట్లు భూసేకరణకు అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు రోడ్డు వేయడానికి సుమారు 4,922 హెక్టార్లను సేకరించాలని ఆర్అండ్బీ ప్రాథమికంగా గుర్తించగా.. ఇందులో సగం మన జిల్లాలోనే సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుండగా, ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు కిలోమీటరు మేర నిర్మించడానికి రూ.33 కోట్లు అవసరమని అంచనా వేసింది. కాగా, రెండో దశలో కంది–చౌటుప్పల్ మార్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో సంగారెడ్డి–చౌటుప్పల్ వరకు రీజినల్ రింగ్‌రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది. స్థిరాస్తి వ్యాపారానికి రెక్కలు! ఔటర్ రింగ్‌రోడ్డుతో జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. జిల్లా నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ రహదారి రాకతో సంపన్నులు శివారుబాట పట్టారు. ట్రాఫిక్ నుంచి ఊరట లభించడంతో ఓఆర్ఆర్కు చేరువలో నివాసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేసమయంలో బహుళ జాతి సంస్థల తాకిడితో పట్టణీకరణ జరిగింది. దీంతో ప్రస్తుతం ఔటర్‌రింగ్‌రోడ్డు నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోతోంది. దీనికితోడు అంతరాష్ట్ర వాహనాలు, సరుకు రవాణ లారీలు నగరంలోకి రాకుండా ఈ రోడ్డుగుండానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ‘ట్రిపుల్ ఆర్’ను ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదట కందుకూరు మీదుగానే ఈ రహదారిని నిర్మించాలని భావించినా.. ఫార్మాసిటీ వెలుపలి నుంచి వేయాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించడంతో అలైన్‌మెంట్‌ను మార్చి రీ–అలైన్మెంట్ చేసింది. ప్రతిపాదిత ఫార్మాసిటీకి దూరంగా కొత్త ప్రతిపాదనలు తయారు చేసింది. ఇదిలావుండగా, రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌పై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా రియల్టర్లు మాత్రం రోజుకో ప్రచారం సాగిస్తూ స్థిరాస్తి వ్యాపారం పుంజుకునేందుకు వాడుకుంటున్నారు. మరోవైపు ఈ మార్గం వేసేందుకు వేలాది ఎకరాలను సేకరిస్తారనే ప్రచారం రైతాంగంలో గుబులు రేకెత్తిస్తోంది. బహిరంగ మార్కెట్లో భూముల ధరలు రూ.లక్షలు పలుకుతుండగా.. కారుచౌకగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
రోడ్డుప్రమాదంలో రిటైర్డ్ ఎస్ఐ దుర్మరణం
కీసర : రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఎస్.ఐ మృతిచెందిన సంఘటన మంగళవారం కీసర రింగ్‌రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటకు చెందిన రిటైర్డ్ ఎస్.ఐ నర్సింహ్మారావు(62) మంగళవారం యాదాద్రిజిల్లా చికడిమామిడి గ్రామానికి వెళ్లి బైక్‌పై తిరిగివస్తుండగా కీసర అవుటర్ రింగ్‌రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కీసర సీఐ సురేందర్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు నర్సింహ్మారావు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్.ఐ పనిచేస్తూ ఇటివలై రిటైరైనట్లు తెలిపారు. -
రహదారులకు ‘బంగారు రింగులు’!
రాష్ట్రంలో కొత్తగా మరో రెండు రింగు రోడ్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తాన్ని రహదా రులతో అనుసంధానించే బృహత్తర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఏ రోడ్డు నుంచి ఏ రోడ్డుకైనా సులభంగా, వీలైనంత తొందరగా చేరుకునేలా చేయడమే ఈ ప్రణాళిక ఉద్దేశం. జాతీయ రహదారుల స్థాయిలో ఈ అనుసంధానం ఉండనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 4 వరుసల రోడ్డు అందుబాటులోకి రానుంది. ఇందుకు తాజాగా ప్రతిపాదించిన రీజనల్ రింగు రోడ్డు ఆవల మరో రెండు రింగు రోడ్లు నిర్మించనున్నారు. చివరిది రాష్ట్ర సరిహద్దుకు చేరువలో ఉంటుంది. ఈ రెండు రింగు రోడ్లతోపాటు కొత్తగా జాతీయ రహదారిగా రూపొందే రీజినల్ రింగు రోడ్డు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు మొత్తం 4 రింగురోడ్లను 4 దిక్కులా అనుసంధానిస్తూ రెండు కారిడార్లు నిర్మిస్తారు. ఈ మొత్తం రహదారులు దాదాపు 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉండనున్నాయి. ఇందులో దాదాపు 900 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుండటంతో ఈ వ్యయాన్ని కేంద్రమే భరించనున్నందున, మిగిలిన 4,100 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఆర్డీసీ) ద్వారా ఈ పనులు జరుగుతాయి. ఇందుకు దాదాపు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. ఇందులో దాదాపు రూ.5 వేల కోట్లు భూసేకరణకు ఖర్చు అవుతాయి. ఈ మొత్తాన్ని హడ్కో నుంచి రుణం రూపంలో టీఎస్ఆర్డీసీ సమకూర్చుకుంటుంది. అంతర్జాతీయ కన్సల్టెంట్ నివేదికతో.. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రస్తుతం చేపడుతున్న రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించే పనిని ప్రభుత్వం కెనడాకు చెందిన ఎల్ఈఏ అసోసియేట్స్‌కు అప్పగించింది. ఆ కంపెనీయే ఈ రింగురోడ్ల సూచన ఇచ్చింది. దీన్ని ‘తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (టీఆర్ఏకే)గా రోడ్లు భవనాల శాఖ అధికారులు నామకరణం చేశారు. శనివారం ఈ ప్రణాళికను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు అధికారులు వివరించారు. ప్రాథమిక దశలో ఉన్న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదించాల్సి ఉంది. భారీ వ్యయంతో కూడుకున్న పథకం కావడంతో ఇది పూర్తయ్యేందుకు కనీసం 10 సంవత్సరాలు పడుతుందని అంచనా. సీఎం అనుమతి వచ్చాక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తారు. ప్రస్తుతం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానితో అనుసంధానించే రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అనుకున్నంత వేగంలో పూర్తి చేయటం అంత సులభం కాదు. ఇప్పటికిప్పుడుకాకున్నా భవిష్యత్తులో పూర్తి చేస్తే బాగుంటుందన్న కోణంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశం ఉత్తరదక్షిణాలు, తూర్పుపడమరలను అనుసంధానించేలా రెండు భారీ కారిడార్ల నిర్మాణం చేపట్టిన తరహాలో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. బంగారు తెలంగాణ వలయం.. నెహ్రూ ఔటర్ రింగురోడ్డు అవతల దాదాపు 300 కి.మీ. మేర విస్తరించేలా జాతీయ రహదారుల విభాగం రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానికి అవతల కొత్తగా ఇప్పుడు 886 కి.మీ. మేర విస్తరించే కొత్త వలయాన్ని ప్రతిపాదించారు. దానికి ‘బంగారు తెలంగాణ రింగ్‌రోడ్డు’అని పేరు పెట్టారు. దానికి అవతల రాష్ట్ర సరిహద్దును ఆనుకొని 1,534 కి.మీ. మేర ‘బంగారు మాల కారిడార్’పేరుతో రిండురోడ్డును నిర్మిస్తారు. ఈ 4 రింగురోడ్లను అనుసంధానిస్తూ ఉత్తర–దక్షిణ కారిడార్ 558 కి.మీ. మేర విస్తరించి ఉంటుంది. తూర్పు–పశ్చిమ కారిడార్ 511 కి.మీ. మేర నిర్మిస్తారు. మళ్లీ వీటిని ఇతర రోడ్లకు అనుసంధానిస్తూ 1,618 కి.మీ. రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తారు. 30 జిల్లాలతో ఈ రోడ్లు అనుసంధానమవుతాయి. ముఖ్యంగా పారిశ్రామిక మండళ్లు, ప్రధాన వ్యవసాయ మార్కెట్లు, కీలక పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తారు.