రహదారులకు ‘బంగారు రింగులు’!
రాష్ట్రంలో కొత్తగా మరో రెండు రింగు రోడ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తాన్ని రహదా రులతో అనుసంధానించే బృహత్తర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఏ రోడ్డు నుంచి ఏ రోడ్డుకైనా సులభంగా, వీలైనంత తొందరగా చేరుకునేలా చేయడమే ఈ ప్రణాళిక ఉద్దేశం. జాతీయ రహదారుల స్థాయిలో ఈ అనుసంధానం ఉండనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 4 వరుసల రోడ్డు అందుబాటులోకి రానుంది. ఇందుకు తాజాగా ప్రతిపాదించిన రీజనల్ రింగు రోడ్డు ఆవల మరో రెండు రింగు రోడ్లు నిర్మించనున్నారు. చివరిది రాష్ట్ర సరిహద్దుకు చేరువలో ఉంటుంది. ఈ రెండు రింగు రోడ్లతోపాటు కొత్తగా జాతీయ రహదారిగా రూపొందే రీజినల్ రింగు రోడ్డు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు మొత్తం 4 రింగురోడ్లను 4 దిక్కులా అనుసంధానిస్తూ రెండు కారిడార్లు నిర్మిస్తారు.
ఈ మొత్తం రహదారులు దాదాపు 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉండనున్నాయి. ఇందులో దాదాపు 900 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుండటంతో ఈ వ్యయాన్ని కేంద్రమే భరించనున్నందున, మిగిలిన 4,100 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఆర్డీసీ) ద్వారా ఈ పనులు జరుగుతాయి. ఇందుకు దాదాపు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. ఇందులో దాదాపు రూ.5 వేల కోట్లు భూసేకరణకు ఖర్చు అవుతాయి. ఈ మొత్తాన్ని హడ్కో నుంచి రుణం రూపంలో టీఎస్‌ఆర్డీసీ సమకూర్చుకుంటుంది.
అంతర్జాతీయ కన్సల్టెంట్ నివేదికతో..
ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రస్తుతం చేపడుతున్న రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించే పనిని ప్రభుత్వం కెనడాకు చెందిన ఎల్‌ఈఏ అసోసియేట్స్‌కు అప్పగించింది. ఆ కంపెనీయే ఈ రింగురోడ్ల సూచన ఇచ్చింది. దీన్ని ‘తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (టీఆర్‌ఏకే)గా రోడ్లు భవనాల శాఖ అధికారులు నామకరణం చేశారు. శనివారం ఈ ప్రణాళికను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు అధికారులు వివరించారు.
ప్రాథమిక దశలో ఉన్న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదించాల్సి ఉంది. భారీ వ్యయంతో కూడుకున్న పథకం కావడంతో ఇది పూర్తయ్యేందుకు కనీసం 10 సంవత్సరాలు పడుతుందని అంచనా. సీఎం అనుమతి వచ్చాక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తారు. ప్రస్తుతం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానితో అనుసంధానించే రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అనుకున్నంత వేగంలో పూర్తి చేయటం అంత సులభం కాదు. ఇప్పటికిప్పుడుకాకున్నా భవిష్యత్తులో పూర్తి చేస్తే బాగుంటుందన్న కోణంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశం ఉత్తరదక్షిణాలు, తూర్పుపడమరలను అనుసంధానించేలా రెండు భారీ కారిడార్ల నిర్మాణం చేపట్టిన తరహాలో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది.
బంగారు తెలంగాణ వలయం..
నెహ్రూ ఔటర్ రింగురోడ్డు అవతల దాదాపు 300 కి.మీ. మేర విస్తరించేలా జాతీయ రహదారుల విభాగం రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానికి అవతల కొత్తగా ఇప్పుడు 886 కి.మీ. మేర విస్తరించే కొత్త వలయాన్ని ప్రతిపాదించారు. దానికి ‘బంగారు తెలంగాణ రింగ్‌రోడ్డు’అని పేరు పెట్టారు. దానికి అవతల రాష్ట్ర సరిహద్దును ఆనుకొని 1,534 కి.మీ. మేర ‘బంగారు మాల కారిడార్’పేరుతో రిండురోడ్డును నిర్మిస్తారు.
ఈ 4 రింగురోడ్లను అనుసంధానిస్తూ ఉత్తర–దక్షిణ కారిడార్ 558 కి.మీ. మేర విస్తరించి ఉంటుంది. తూర్పు–పశ్చిమ కారిడార్ 511 కి.మీ. మేర నిర్మిస్తారు. మళ్లీ వీటిని ఇతర రోడ్లకు అనుసంధానిస్తూ 1,618 కి.మీ. రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తారు. 30 జిల్లాలతో ఈ రోడ్లు అనుసంధానమవుతాయి. ముఖ్యంగా పారిశ్రామిక మండళ్లు, ప్రధాన వ్యవసాయ మార్కెట్లు, కీలక పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తారు.