
సాక్షి, ఖమ్మం: కన్నతల్లికి ద్రోహం చేసేవారు రాజకీయాల్లో రాణించలేరని టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం, మోసం చేసేవారు ఎక్కువకాలం రాజకీయాల్లో మనలేరని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తుమ్మల నాగేశ్వరరావు అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఆయన ఓడిపోవడం టీఆర్‌ఎస్‌కు షాక్‌నిచ్చింది. సొంత పార్టీలోని నేతలే తనను ఓడించారని తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు, కార్యకర్తల సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఓడించామని తాత్కాలికంగా రాక్షసానందాన్ని పొందేవారు అధోగతి పాలు అవుతారని శపించారు. రాజకీయాల్లో ప్రజాసేవ కోసం కొనసాగేవారిని గౌరవించుకోవాలని, తాత్కాలిక మెరువుల కోసం ఆశించే వారికి భవిష్యత్ ఉండని అన్నారు.