జిల్లాకు మణిహారమే.. | New Ring Road Work Rangareddy | Sakshi
Sakshi News home page

జిల్లాకు మణిహారమే..

Published Thu, Jan 24 2019 1:18 PM | Last Updated on Thu, Jan 24 2019 1:18 PM

New Ring Road Work Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర రాజధానికి సగటున 50–60 కిలోమీటర్ల దూరం నుంచి 334 కి.మీ పొడవు మేర నిర్మించనున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు ఎక్కువ భాగం మన జిల్లా గుండా వెళ్లనుంది. జిల్లా పరిధిలో సుమారు 150 కి.మీ మేర ఈ హైవే ఉండనుంది. సంగారెడ్డి జిల్లా కంది నుంచి చౌటుప్పల్‌ వరకు వెళ్లే ఈ అలైన్‌మెంట్‌లో (180 కి.మీ) 30 కి.మీలు మినహా మిగతా అంతా జిల్లా భూ భాగంలో నిర్మించాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఆరు లేన్ల రహదారికి కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపింది.

కిలోమీటరుకు రూ.33 కోట్లు 
కేంద్రం ఆర్థిక చేయూతతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.11వేల కోట్లు. దీంట్లో రూ.3,032 కోట్లు భూసేకరణకు అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు రోడ్డు వేయడానికి సుమారు 4,922 హెక్టార్లను సేకరించాలని ఆర్‌అండ్‌బీ ప్రాథమికంగా గుర్తించగా.. ఇందులో సగం మన జిల్లాలోనే సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుండగా, ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌రోడ్డు కిలోమీటరు మేర నిర్మించడానికి రూ.33 కోట్లు అవసరమని అంచనా వేసింది. కాగా, రెండో దశలో కంది–చౌటుప్పల్‌ మార్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో సంగారెడ్డి–చౌటుప్పల్‌ వరకు రీజినల్‌ రింగ్‌రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది.
 
స్థిరాస్తి వ్యాపారానికి రెక్కలు! 
ఔటర్‌ రింగ్‌రోడ్డుతో జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. జిల్లా నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ రహదారి రాకతో సంపన్నులు శివారుబాట పట్టారు. ట్రాఫిక్‌ నుంచి ఊరట లభించడంతో ఓఆర్‌ఆర్‌కు చేరువలో నివాసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేసమయంలో బహుళ జాతి సంస్థల తాకిడితో పట్టణీకరణ జరిగింది. దీంతో ప్రస్తుతం ఔటర్‌రింగ్‌రోడ్డు నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోతోంది. దీనికితోడు అంతరాష్ట్ర వాహనాలు, సరుకు రవాణ లారీలు నగరంలోకి రాకుండా ఈ రోడ్డుగుండానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ‘ట్రిపుల్‌ ఆర్‌’ను ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదట కందుకూరు మీదుగానే ఈ రహదారిని నిర్మించాలని భావించినా.. ఫార్మాసిటీ వెలుపలి నుంచి వేయాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించడంతో అలైన్‌మెంట్‌ను మార్చి రీ–అలైన్‌మెంట్‌ చేసింది.

ప్రతిపాదిత ఫార్మాసిటీకి దూరంగా కొత్త ప్రతిపాదనలు తయారు చేసింది. ఇదిలావుండగా, రీజినల్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌పై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా రియల్టర్లు మాత్రం రోజుకో ప్రచారం సాగిస్తూ స్థిరాస్తి వ్యాపారం పుంజుకునేందుకు వాడుకుంటున్నారు. మరోవైపు ఈ మార్గం వేసేందుకు వేలాది ఎకరాలను సేకరిస్తారనే ప్రచారం రైతాంగంలో గుబులు రేకెత్తిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు రూ.లక్షలు పలుకుతుండగా.. కారుచౌకగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement