గజ్వేల్: ట్రిపుల్‌ఆర్ భూసేకరణ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ప్రజాభిప్రాయసేకరణ పూర్తి కాగా, త్వరలోనే సంగారెడ్డి జిల్లాలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గత రెండు సభల్లో బాధితుల నుంచి వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, పరిహారం లెక్కలు కూడా తేల్చనున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో ట్రిపుల్‌ఆర్ 110 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండనుంది. 14 మండలాల్లోని 73కిపైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. జగదేవ్‌పూర్ – గజ్వేల్ – తూప్రాన్ –నర్సాపూర్ –సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. ఈ క్రమంలోనే భూసేకరణను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో, మెదక్ జిల్లాకు సంబంధించి నర్సాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. భూముల విలువ పెరిగిన తరుణంలో వాస్తవ విలువకు, ప్రభుత్వమిచ్చే పరిహారానికి పొంతన ఉండదని, ఈ నేపథ్యంలో భూమికి బదులు భూమి ఇవ్వాలనే డిమాండ్‌ను అధికారుల ముందుంచారు. త్వరలోనే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనున్న సంగారెడ్డి జిల్లాలో పకడ్బందీగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
980 ఎకరాలు..
ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఇక త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగ తలమునలై ఉన్నది. ఈ నోటిఫికేషన్‌లో సర్వే నంబర్లవారీగా రైతుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలిరాజపేట, మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాములపర్తి, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్, మక్తమాసాన్‌పల్లి, బంగ్లావెంకటాపూర్, వర్గల్ మండలం మైలారం, జబ్బాపూర్, నెంటూర్, రాయపోల్ మండలం బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ జరగనుంది. ఆ గ్రామాలకు సంబంధించిన త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ 15 రోజుల్లో విడుదల కానుంది.
మరో రెండు నెలల్లో..
మెదక్ జిల్లాకు సంబంధించి తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల నోటిఫికేషన్ సైతం త్వరలో రానుంది. రైతుల నుంచి అభిప్రాయసేకరణ ఎలా ఉన్నా.. ఈ త్రీడీ నోటిఫికేషన్ తర్వాత పరిహారం లెక్కలు తేల్చి భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టనున్నారు. పరిహారం పంపిణీకి గతంలో అవలంబించిన విధానాలలు అనుసరిస్తారా? మార్పులు చేస్తారా...? అనేది వేచి చూడాల్సి ఉంది. పరిహారం లెక్కలు తేలిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు వెంటనే పరిహారం అందిస్తారు. ముందుకురాని రైతులకు సంబంధించిన పరిహారాన్ని కోర్టుల్లో జమచేసి పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ముందుకుసాగుతోంది.
త్వరలో గెజిట్ నోటిఫికేషన్
గజ్వేల్ డివిజన్ పరిధిలో ట్రిపుల్‌ఆర్ భూసేకరణ ప్రక్రియను తుది దశకు చేరుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం. దీని తర్వాత భూముల విలువ ఆధారంగా పరిహారం లెక్కలు కూడా తేలనున్నాయి. ఆ తర్వాత ప్రక్రియను రెండు నెలల్లోపు పూర్తి చేసే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం.
–విజయేందర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గజ్వేల్
Comments
Please login to add a commentAdd a comment