దక్షిణ భాగానికి కూడా రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ | Central Govt Gives Green Signal For Entire Regional Ring Road | Sakshi
Sakshi News home page

దక్షిణ భాగానికి కూడా రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Published Fri, Sep 2 2022 3:28 AM | Last Updated on Fri, Sep 2 2022 2:41 PM

Central Govt Gives Green Signal For Entire Regional Ring Road - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌కు చుట్టూ 60, 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతోపాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి.

తాజాగా దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డులోని ప్రతిపాదిత 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపాందించాల్సిందిగా తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఆ సంస్థను ఆదేశించింది. త్వరలో కన్సల్టెన్సీ సంస్థ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి, అలైన్‌మెంట్‌ తయారీ కసరత్తు ప్రారంభించబోతోంది. దీనితో మొత్తంగా ప్రతిష్టాత్మక రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించేందుకు మార్గం సుగమమైంది. 

రెండు భాగాలుగా రోడ్డుతో.. 
హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపగా గతంలో ఓ కన్సల్టెన్సీతో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను రూపొందించారు. మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్‌ రోడ్డు ఉంటుందని అందులో ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం తొలుత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

దానికి నాగ్‌పూర్‌ కేంద్రంగా పనిచేసే కే అండ్‌ జే సంస్థను కన్సల్టెన్సీగా నియమించగా.. ఆ సంస్థ సర్వే చేసి ఉత్తర భాగం పొడవును 158.62 కిలోమీటర్లుగా ఖరారు చేసింది. భూసేకరణలో భాగంగా 3ఏ గెజిట్ల విడుదల వరకు కసరత్తు పూర్తి చేసింది. భూసేకరణ అధీకృత అధికారులుగా ఉన్న ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు సంబంధించి ఇటీవలే విడతల వారీగా ఎనిమిది గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి కూడా.  

నిరీక్షణ, అనుమానాల మధ్య.. 
మొదట రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి మాత్రమే అనుమతి ఇచ్చిన కేంద్రం.. దక్షిణ భాగం విషయంలో మౌనం వహించటంతో ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దక్షిణ భాగంలో రోడ్డును ప్రతిపాదించిన ప్రాంతాల మధ్య ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో.. ఈ వైపు ఎక్స్‌ప్రెస్‌ వే అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అభిప్రాయపడినట్టు వార్తలు వచ్చాయి.

దీనితో పూర్తి రింగ్‌గా కాకుండా ఒకవైపు మాత్రమే ఈ రోడ్డు నిర్మితమవుతుందని భావించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. రీజనల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగం విషయంతో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది గడిచి నాలుగు నెలలైనా అనుమతి రాకపోవటంతో.. దక్షిణభాగం ఉంటుందా, లేదా అన్న ప్రశ్నలు వినిపించాయి. కానీ తాజాగా కేంద్రం అనుమతి వచ్చింది. 

భారీ నిధులతో.. 
రీజనల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణభాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని ప్రాథమిక అలైన్‌మెంటులో పేర్కొనగా.. ఇప్పుడు పూర్తి స్థాయి కన్సల్టెన్సీ తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనుంది. ఉత్తర భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. పూర్తి స్థాయి డీపీఆర్‌ రూపొందితే వ్యయంపై స్పష్టత రానుంది. ఇక దక్షిణ భాగానికి సంబంధించి డీపీఆర్‌ తయారీకి రెండేళ్లకుపైగా సమయం పట్టే అవకాశం ఉందని.. దీనితో భూసేకరణ భారం పెరిగే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అప్పటికి నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుందని.. దక్షిణ భాగం వ్యయం రూ.15 వేల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు పేర్కొంటున్నాయి. 

ఉత్తర భాగం ఇదీ.. 
సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, యాదాద్రి మీదుగా చౌటుప్పల్‌ వరకు.. సుమారు 160 కిలోమీటర్లు. 
భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్‌–1లో గుర్తింపు. 
ఈ రోడ్డుకు తాత్కాలిక జాతీయ రహదారి నంబర్‌గా ఎన్‌హెచ్‌ 166ఏఏ కేటాయింపు. 
నాగ్‌పూర్‌కు చెందిన కే అండ్‌ జే ప్రాజెక్ట్స్‌ సంస్థ ఈ భాగానికి కన్సల్టెన్సీ సంస్థగా ఉంది. 
గతేడాది సెప్టెంబర్‌లో టెండర్‌ ద్వారాసంస్థను ఎంపిక చేశారు. ఏడాదిలోగా అలైన్‌మెంట్‌ పూర్తి చేసి, భూసేకరణకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు డీపీఆర్‌ తయారీ కసరత్తు మొదలు. 
నిర్మాణానికి మొత్తంగా రూ.9,500 కోట్లకుపైగా ఖర్చవుతాయని అంచనా 

దక్షిణ భాగం ఇదీ.. 
సంగారెడ్డి నుంచి కంది,నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్‌ నారాయణపూర్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు.. దాదాపు 182 కిలోమీటర్ల పొడవు 
భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్‌2 కింద గుర్తింపు 
ఢిల్లీకి చెందిన ‘ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగింత. 
నిర్మాణానికి మొత్తంగా రూ.15 వేల కోట్లకుపైగా ఖర్చవుతాయని అంచనా  

ఉత్తరాదిలో పెద్ద ప్రాజెక్టులు చేసిన సంస్థ..! 
ఢిల్లీలోని గ్రీన్‌పార్కు ప్రాంతానికి చెందిన ఇంటర్‌కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ సంస్థకు.. బిహార్, యూపీ రాష్ట్రాల్లో పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే (పాట్నా రింగ్‌ రోడ్డు), గంగా బ్రిడ్జి కనెక్టివిటీ ప్రాజెక్టులను కేంద్రం కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డు దక్షిణ భాగానికి డీపీఆర్‌ రూపొందించే బాధ్యతనూ ఇచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement