సిటీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదాశివపేటలో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్ చేసింది. ఇది నిమ్జ్‌కు అతి సమీపంలో ఉండడంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆశపడ్డాడు. గజానికి రూ. 8 వేలు చెల్లించి 150 గజాల ప్లాట్ కొన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు సదరు ఉద్యోగి తన కొడుకు చదువుకని ప్లాట్ అమ్మకానికి పెట్టాడు.. రెట్టింపు ధర సంగతి దేవుడెరుగు.. కనీసం బ్యాంకు వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదు.
గ్రేటర్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఐదు మాసాల్లో సుమారు 3.5 లక్షల దస్తావేజులు నమోదు కాగా, ఈసారి మాత్రం 2.2 లక్షలకు డాక్యుమెంట్లు కూడా దాటలేదు. రియల్ వ్యాపారం పూర్తిగా మందగించడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: ఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు..? పిల్లల చదువుకోసమో.. అమ్మాయి పెళ్లి కోసమో.. ఇతరత్రా భవిష్యత్ అవసరాలకు అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్ ప్లాట్లకు అస్సలు గిరాకీ లేదు. కుప్పలుతెప్పలుగా వెంచర్లు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవటం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ఎన్నికల వాతావరణం కావడంతో రీసేల్ ప్లాట్లకు గిరాకీ లేకుండా పోయింది.
నగరం చుట్టూ ఇదే పరిస్థితి
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్‌టైల్స్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ హబ్‌లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్టులు వచ్చేస్తున్నా యంటూ హైదరాబాద్ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు.
యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్‌నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల తదితర ప్రాంతాలలో ఫామ్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్ హోమ్స్ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. స్థలం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతోంది. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లు విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
రెరాలో నమోదు లేకుండానే
నిబంధనల ప్రకారం స్థిరాస్తి సంస్థల ఏజెంట్లు కూడా టీఎస్–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లు విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíసియా, దుబా య్, బ్యాంకాక్ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూ టివ్‌లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తు న్నాయి. ప్రతి ఆదివారం బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నారు.
రెండు మూడేళ్లుగా..
జనరద్దీ లేని చోట... అటవీ ప్రాంతాలకు సమీపంగా కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరమైతే అమ్ముకోలేక అగచాట్లు పడుతు న్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్‌ను తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్లాట్‌పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలు చేశారు. వారంతా రెండుమూడేళ్లుగా విక్రయించడానికి ప్రయత్నించినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు.
అభివృద్ధి జరిగే ప్రాంతంలోనే కొనాలి
అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు ఉంటేనే భవిష్యత్‌లో విక్రయించినా మంచి ధర వస్తుంది. అనుమతులు ఉన్న వెంచర్లలో కొనడమే ఉత్తమం.– సీహెచ్ వెంకట సుబ్రహ్మణ్యం, సీఎండీ, భువన్‌తేజ ఇన్‌ఫ్రా
Comments
Please login to add a commentAdd a comment