రీసేల్‌ ఫ్లాట్‌ కొంటున్నారా?! | Are you buying a resale flat? | Sakshi
Sakshi News home page

రీసేల్‌ ఫ్లాట్‌ కొంటున్నారా?!

Published Fri, Feb 2 2018 11:35 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

Are you buying a resale flat? - Sakshi

ప్రతితాత్మక చిత్రం

నిడమర్రు : కొత్త ఫ్లాట్‌ అందుబాటు ధరలో లేకపోవడం, పెట్టుబడి తగ్గించుకుని తిరిగి అమ్మే ఉద్దేశం ఉన్న సమయంలో, తక్షణం గృహ ప్రవేశం చేయలనుకున్నప్పుడు లేదా మార్కెట్‌ విలువలో తక్కువ ధరకు లభిస్తున్నపుడు కారణం ఏదైనా రీసేల్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారా..? అయితే రీసేల్‌ ఫ్లాట్‌ విషయంలో ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. ఆ వివరాలు తెలుసుకుందాం.

’రీసేల్‌ అంటే పాతదే కాదు
రీసేల్‌ యూనిట్స్‌ అంటే పాతవే కాకుండా, కొత్తగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ను ఓ వ్మక్తి కొనుగోలు చేసి అది పూర్తయిన తర్వాత విక్రయానికి పెట్టినా అది రీసేల్‌ ప్లాటే అవుతుంది. అలాగే నిర్మాణంలో ఉన్నవీ కావచ్చు. బిల్డర్‌ వద్ద ఒకరు కొని తిరిగి ఫ్లాట్‌ నిర్మాణం పూర్తవకపోయినా, విక్రయానికి పెట్టినా అది రీసేల్‌ ప్లాటే అవుతుంది.

చట్టబద్ధత, పత్రాలు
కొనుగోలు చేస్తున్న ఫ్లాట్‌/ఇంటికి సంబంధించి చట్టబద్ధమైన హక్కుల విషయంలో ముందుగా అన్ని వివరాలు తెలుసుకోవాలి. న్యాయ నిపుణులను సంప్రదించాలి. పాత అపార్ట్‌మెంట్‌ కొనేముందు చట్టపరమైన ప్రక్రియలను కూడా పూర్తి చేసుకోవాలి. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో సరిగ్గా నమోదు చేశారా, పేరు, ఇతర వివరాలు సరిగానే ఉన్నాయా? అన్నవి పరిశీలించాలి. రీసేల్‌ ఫ్లాట్‌ టైటిల్‌ డీడ్‌ను చాలా స్పష్టంగా రాసుకోవాలి. కొనుగోలు ఒప్పందం, సేల్‌డీడ్, అపార్ట్‌మెంట్‌ సొసైటీ నుంచి నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ), బిల్డర్‌–బయ్యర్‌ అగ్రిమెంట్‌ కాపీ అప్పటివరకు ఆ ఫ్లాట్‌కు యజమానులుగా వ్యవహరించిన వారి వివరాలు తెలియజేసే డాక్యుమెంట్లు అన్ని అవసరం అవుతాయి.

ఎందుకు అమ్ముతున్నారో ఆరా తీయాలి
ఆ ఫ్లాట్‌ను యజమాని ఎందుకు విక్రయిస్తున్నారన్న అంశాన్ని విచారించుకోవాలి. చట్టపరమైన సమస్యలేవైనా ఉంటే వదిలించుకునేందుకు ఆ ఫ్లాట్‌ను విక్రయిస్తున్నారా..? దానిపై మరెవరికైనా ఉమ్మడి హక్కులున్నాయా..? అన్నవి చూడాలి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో ఫ్లాట్‌ బుక్‌ చేసుకుని అది పూర్తి కాకముందే విక్రయిస్తుంటే కారణాలు అన్వేషించాలి.

ఫ్లాట్‌పై రుణ బకాయిలు
కొనుగోలు చేయబోతున్న ఫ్లాట్‌ లేదా ఇంటిపైన రుణాలు ఏవైనా ఉన్నాయా, లేదా..? అన్న అంశం కూడా చూడాలి. బ్యాంకు నుంచి తీసుకున్న ఎన్వోసీ పత్రాన్ని తీసుకోవాలి. ఒకవేళ కొనుగోలు చేస్తున్న ఫ్లాట్‌ బ్యాంకు తనఖాలో ఉంటే మాత్రం.. దానిపై ఉన్న రుణం మొత్తాన్ని తీర్చేసిన తర్వాత ఫ్లాట్‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసేందుకు సమ్మతేనని బ్యాంకు నుంచి ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది.

కొనుగోలుకు రుణం..
రీసేల్‌ ఫ్లాట్‌/ఇంటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిస్తున్నాయి. రుణాన్ని ఇచ్చే ముందు సాంకేతికపరంగా ఆ భవనం నాణ్యతను పరిశీలిస్తారు. భవనం స్థితిగతులను పరిశీలించిన తర్వాత సంబంధిత ఆస్తి కొనుగోలుకు ఎంత ఇవ్వాలన్నది బ్యాంక్‌ అధికారులు నిర్ణయిస్తారు. ఈ రుణం సేల్‌ డీడ్‌ విలువ కంటే మించకుండా ఉంటుంది.

ఏ అంతస్తు నయం..?
0–15 ఏళ్ల వయసున్న రీసేల్‌ ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నట్టయితే పై అంతస్తునే ఎంచుకోవడమే నయం. అపార్ట్‌మెంట్‌ను నిర్మించి కొన్నేళ్లయితే డ్రైనేజీపరంగా లీకేజీలు చోటు చేసుకోవచ్చు. కింద ఫ్లోర్‌ నిర్మాణంలో మార్పులు జరగవచ్చు. పై అంతస్తులో కింద అంతస్తు మీద వెలుతురు వచ్చే అవకాశం ఉంది. ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న ఫ్లాట్‌ను కొనడం వల్ల ధర, విలువపరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గరిష్టంగా పదేళ్ల వయస్సు ఫ్లాట్‌ వరకూ లాభసాటిగా ఉంటుంది.

నిర్వహణ
రీసేల్‌ ఫ్లాట్‌ విషయంలో మెయింటెనెన్స్‌ చార్జీలు గురించి వాకబు చేయాలి. నిర్మాణపరమైన నాణ్యత కూడా కీలకమే. ఎక్కడైనా నిర్మాణంలో నెర్రులు బారి ఉన్నాయేమో చూడాలి. రిజిస్టర్‌ డాక్యుమెంట్లలో ఉన్న ప్లాన్‌ ప్రకారమే ఫ్లాట్‌ నిర్మించారా లేదా..? అన్నది చెక్‌ చేయాలి. పాతది అయితే ఎలక్ట్రికల్‌ వైరింగ్, ప్లంబింగ్‌ వంటి అంశాలు పరిశీలించుకోవాలి. నిర్మాణపరమైన మార్పులు చేయించాల్సి ఉంటే ఆ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక అపార్ట్‌మెంట్‌ సొసైటీ నిబంధనలు ఏంటన్నదీ తెలుసుకోవాలి.

పన్ను ప్రయోజనాలు
రీసేల్‌ ఫ్లాట్‌పైనా పన్నుపరమైన ప్రయోజనా లున్నాయి. రుణం తీసుకుని రీసేల్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే (మొదటిసారి సొంతింటి కొనుగోలు), తిరిగి చేసే వాయిదాల చెల్లింపులో సెక్షన్‌ 80సీ కింద ఏడాదిలో రూ.లక్ష మినహాయింపు, వడ్డీ రూపంలో చెల్లింపులపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ ఆదాయ పన్ను చెల్లించే పనిలేదు.

రీసేల్‌ వల్ల ప్రయోజనాలు
మొదటిసారి విక్రయమవుతున్న ఫ్లాట్‌తో పాలిస్తే ధర తక్కువగా ఉంటుంది. వెంటనే ఇంట్లోకి చేరిపోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. నెలనెలా అద్దె ఇంటికి చేసే చెల్లింపులు మిగులుతాయి. కనిపించని చార్జీల భారం ఉండదు. వెంటనే ఇంట్లో చేరిపోతాం గనుక అప్పటి నుంచే పన్ను ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. నిర్మాణంలో ఉన్నది కొనుగోలు చేస్తే  లేబర్, మెయింటెనెన్స్‌ పన్ను, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్, ఇంటి పన్ను ఇతరత్రా చార్జీలపై స్పష్టత ఉండదు. రీసేల్‌ ఫ్లాట్‌కు సంబంధించి అన్ని చార్జీలు ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement