3 కిలోమీటర్ల పొడవుతో లూప్ రోడ్లు.. 150 ఎకరాల్లో కూడలి
రీజినల్ రింగ్ రోడ్డులోమొత్తంగా 11 చోట్ల కూడళ్లకు డిజైన్లు ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డుపై రెండు ప్రాంతాల్లో భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించబోతున్నారు. హైదరాబాద్–పుణె జాతీయ రహదారిని క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని క్రాస్ చేసే చౌటుప్పల్ వద్ద ఈ కూడళ్లు ఉంటాయి. వీటికోసం ఢిల్లీ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ‘ఎక్స్‌టెండెడ్ డంబెల్’డిజైన్‌ను ఎంపిక చేశారు. ఎనిమిది వరసల (తొలి దశలో నాలుగు వరసలు)తో రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్‌చేంజ్‌లను విశాలంగా రూపొందిస్తున్నారు.
ఆ డిజైనే ఎందుకు?
ఇప్పటికే ఉన్న భారీ రహదారులను ఎక్స్‌ప్రెస్ వేలు క్రాస్ ప్రాంతాల్లో.. వాహనాలు ఆ రోడ్ల నుంచి రింగ్‌రోడ్డు మీదకు, రింగురోడ్డు నుంచి ఆ రోడ్ల మీదకు సులువుగా మారేందుకు వీలుగా ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మిస్తారు. ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా లూప్ డిజైన్లను ఎంపిక చేస్తారు. ఉత్తర–దక్షిణ భాగాలు కలిసే సంగారెడ్డి, చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే చాలా నిర్మాణాలున్నా యి.
అలాంటి చోట కూడళ్ల వద్ద భారీ లూప్‌లు నిర్మిస్తే భూసేకరణ పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ క్రమంలో ‘ఎక్స్‌టెండెడ్ డంబెల్’నమూనాను ఎంపిక చేశారు. ఈ డిజైన్‌లో వాహనాలు రోడ్లను మారే లూప్‌లు ఎక్కువశాతం రింగురోడ్డును అనుకునే ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన భూమిలో 70% వరకు రింగురోడ్ భూమినే వినియోగిస్తారు. మిగతా 30 శాతం భూమిని సేకరిస్తే సరిపోతుంది.
ఒక్కోటి 150 ఎకరాల్లో.. 3 కిలోమీటర్ల నిడివితో..
‘ఎక్స్‌టెండెడ్ డంబెల్’నమూనాలో నిర్మించే ఇంటర్ చేంజ్‌లలో.. లూప్ రోడ్లు చాలా దూరం నుంచే మొదలవుతాయి. ప్రస్తుతం రీజనల్ రోడ్డులో కూడా.. ప్రధాన కూడలికి ఇరువైపులా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం చొప్పున మూడు కిలోమీటర్ల నిడివితో ఈ లూప్ రోడ్లు ఉండనున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ఇంటర్ చేంజ్‌ల కంటే ఇది దాదాపు రెట్టింపు సైజు కావడం విశేషం.
మొత్తంగా పదకొండు కూడళ్లు..
రీజనల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో.. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఐఏ) రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ మొదలయ్యే చాన్స్ ఉంది. ఈ మేరకు అధికారులు రోడ్డు డిజైన్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి ఉత్తర భాగం (162 కిలోమీటర్లు.. సంగారెడ్డి నుంచి గజ్వేల్ మీదుగా చౌటు ప్పల్ వరకు) నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రోడ్డు దక్షిణభాగంతో కలిసే చోట్ల ఉండే రెండు ఇంటర్ చేంజ్‌లు సహా ఉత్తరభాగంలో మొత్తం 11 కూడళ్లు ఉంటాయి. వాటి డిజైన్లు సిద్ధమయ్యాయి.
» సంగారెడ్డి వద్ద భారీ ‘ఎక్స్‌టెండెడ్ డంబెల్’డిజైన్‌తో కూడలి నిర్మిస్తారు. ళీ సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 నంబర్ జాతీయ రహదారిని క్రాస్‌చేసే శివంపేట వద్ద ఉంది. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్‌లో ఉంటుంది.
» మూడో కూడలి నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్ ఎంపిక చేశారు. ళీ నాలుగో కూడలి హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లోవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు.
» ఐదో కూడలి తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్‌పల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఖరారు చేశారు.
» ఆరో కూడలి రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో వస్తుంది. ఇక్కడ పాక్షిక క్లోవర్ లీఫ్ (మూడు లూప్‌లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు.
» ఏడో కూడలి జగదేవ్‌పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఎంపిక చేశారు.
» ఎనిమిదో కూడలి తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద వస్తుంది. ఇక్కడ కూడా రోటరీ డిజైన్‌లో నిర్మిస్తారు.
» తొమ్మిదో కూడలి హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ డిజైన్‌లో ఉంటుంది.
» పదో కూడలి భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద వస్తుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఖరారు చేశారు.
» పదకొండో కూడలిని చౌటుప్పల్ వద్ద భారీ ‘ఎక్స్‌టెండెడ్ డంబెల్’డిజైన్‌తో నిర్మిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment