హైదరాబాద్: ప్రతిష్టాత్మక రీజినల్ రింగు రోడ్డు నిర్మాణ దిశగా యంత్రాంగం కదులుతోంది. రింగులో సగానికి కేంద్రం ఇప్పటికే పచ్చజెండా ఊపిన క్రమంలో, తుది అలైన్‌మెంటు ఖరారుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కి.మీ. తొలి సగభాగానికి భూసేకరణ చేపట్టేందుకూ సమాంతర ఏర్పాట్లు మొదలయ్యాయి.ఈ తొలి సగభాగానికి రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇటు భూసేకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాకు ఓ యూనిట్ చొప్పున ఏర్పాటు కానుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఓ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వ ర్యంలో ఒక్కో యూనిట్ పనిచేయనుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో యూనిట్ భూసేకరణ వ్యవహారం చూస్తుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి జిల్లాలకు సంబంధించి ఇవి పనిచేస్తాయి.
పదిరోజుల్లో ఫీల్డ్‌కు..
ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి పంపే సమయంలో గూగుల్ మ్యాప్ ఆధారంగా రోడ్డు అలైన్ మెంటును రూపొందించారు. ఇందులో ఏయే ఊళ్ల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుందో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ప్రతిపాదిత అలైన్‌మెం టును ఖరారు చేశారు. కానీ, ఫీల్డ్ సర్వే నిర్వహిం చలేదు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెన్సీ బాధ్యతలు చూసే ఫీడ్‌బ్యాక్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీస్ సంస్థ వారం, పది రోజుల్లో ఫీల్డ్ సర్వే ప్రారంభించనుంది. గ్రామాల నక్షాలు, సర్వేనంబర్ల ఆధారంగా మార్కింగ్ చేయనుంది. మూడు వారాల్లో తుది అలైన్‌మెంటు ఖరారవుతుంది. వీలైనంత వరకు గుట్టలు, జలాశయాలను తప్పించి అలైన్‌మెంటు ఖరారు చేయనున్నారు.
అంతా గోప్యం..
ఇప్పటికే రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన ఆధా రంగా రియల్ ఎస్టేట్ సంస్థలు వేగం పెంచాయి. ఎలాంటి అలైన్‌మెంట్ రూపొందకుండానే ఫలానా సర్వే నంబర్ల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుం దంటూ బోగస్ మ్యాపులు సృష్టించి రైతుల్లో భయాందోళనలు రేకెత్తించి తక్కువ ధరకే భూము లను తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తుందని భావిస్తున్న భూముల్లో సాగు దాదాపు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వారి ఆగడాలకు కళ్లెం వేసేలా అధికారులు ఏ విషయాన్నీ బయటకు పొక్కనీయటం లేదు. పక్కాగా సర్వే జరిగి తుది అలైన్‌మెంటు సిద్ధమయ్యాకనే అధికారికంగా దాన్ని ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
రెండో భాగంపై ట్రాఫిక్ స్టడీ..
రీజినల్ రింగురోడ్డులో మొదటిదశకు సంబంధించి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అనుమతించిన కేంద్రం, రెండోదశకు సంబంధించి ఇప్పటివరకు గెజిట్ విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టు దాదాపు రూ.18 వేల కోట్ల వ్యయంతో కూడుకున్నది కావటం విశేషం. దీంతో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన మొదటి సగంలో సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఓ రోడ్డు కొనసాగుతోంది. ఆయా పట్టణాల మీదుగా ఉన్న ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు భారీగా ఉండటంతో ఇది పూర్తిస్థాయి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి యోగ్యమైందని కేంద్రం ఇప్పటికే నిర్ధారించింది.
రెండో సగంలో వాహనాల రాకపోకలు లేవని కేంద్రం గుర్తించింది. కానీ, రోడ్డు నిర్మాణంతో భారీగా వాహనాల రాకపోకలుంటాయని అధికారులు కేంద్రం దృష్టికి తెచ్చారు. అధికారులు టోల్‌ప్లాజాలు, ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్టడీ నిర్వహిస్తున్నారు. ఈ వివరాలు పరిశీలించాక కేంద్రం అనుమతి మంజూరు చేయనుందని సమాచారం. త్వరలో దానికి కూడా పచ్చజెండా ఊపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment