National Highway Authority of India
-
సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి
ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించిన 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI).. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు కేవైసీ చేసుకోవాల్సిందే అంటూ ఆదేశాలను జారీ చేస్తూ ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయించింది. జనవరి 31 నాటికి కేవైసీ పూర్తి చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లు డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వినియోగదారుడు నిర్దిష్ట సమయంలోనే కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా? 👉వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. 👉ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ చేయడం ఎలా? 👉ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు తెలిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. 👉దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో కావాల్సి ఉంటుంది. 👉ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. 👉తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. -
Express Highway: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రం గుండా మరో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. కర్నూలును మహారాష్ట్రలోని షోలాపూర్‌ను అనుసంధానిస్తూ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర గుండా పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తూ 318 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి ఉంటుంది. దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించడం కోసం ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. చదవండి: ఏపీలో ఉత్తమ పోలీస్‌స్టేషన్ ఇదే.. భారతమాల ప్రాజెక్టు రెండో దశ కింద దాదాపు రూ.12 వేల కోట్లతో ఈ రహదారి నిర్మిస్తారు. 2025 నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ హైవేతో రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి పశ్చిమ భారతంతో రోడ్ కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ప్రస్తుతం కర్నూలు నుంచి నల్గొండ, హైదరాబాద్ మీదుగా షోలాపూర్ వెళ్లాల్సి వస్తోంది. నూతన రహదారి నిర్మాణం పూర్తయితే కర్నూలు నుంచి షోలాపూర్‌కు దాదాపు 100 కి.మీ. తగ్గుతుంది. కర్నూలు నుంచి మహబూబ్‌నగర్, కర్ణాటకలోకి కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్ వరకు ఈ ఆరులేన్ల రోడ్డు నిర్మిస్తారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను చెన్నై – బెంగళూరు, బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేలతో అనుసంధానించాలని కూడా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై ఎన్హెచ్ఏఐ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. -
జాతీయ రహదారులతో భూముల ధరల వృద్ధి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, రిటైల్ ఔట్లెట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు, వేర్‌హౌస్‌లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్హెచ్ఏఐ ప్రాపర్టీ ల కోసం జేఎల్‌ఎల్‌ను అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఎన్హెచ్ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్ మానిటైజేషన్ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్ఎల్ పని. 3 వేల హెక్టార్ల అభివృద్ధి.. జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్‌లు, వేసైడ్ అమెనిటీస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్ హైవే/ఎక్స్‌ప్రెస్‌లను నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లక్షించింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 15–30 శాతం ఆదాయం.. ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్ఎల్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ అంచనా వేశారు. క్లియర్ ల్యాండ్ టైటిల్, ఉచిత ఎన్కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్ సైట్‌తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్మెంట్తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు. -
ఆర్ఆర్ఆర్: భూసేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థ!
హైదరాబాద్: ప్రతిష్టాత్మక రీజినల్ రింగు రోడ్డు నిర్మాణ దిశగా యంత్రాంగం కదులుతోంది. రింగులో సగానికి కేంద్రం ఇప్పటికే పచ్చజెండా ఊపిన క్రమంలో, తుది అలైన్‌మెంటు ఖరారుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కి.మీ. తొలి సగభాగానికి భూసేకరణ చేపట్టేందుకూ సమాంతర ఏర్పాట్లు మొదలయ్యాయి.ఈ తొలి సగభాగానికి రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఇటు భూసేకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాకు ఓ యూనిట్ చొప్పున ఏర్పాటు కానుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఓ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వ ర్యంలో ఒక్కో యూనిట్ పనిచేయనుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో యూనిట్ భూసేకరణ వ్యవహారం చూస్తుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి జిల్లాలకు సంబంధించి ఇవి పనిచేస్తాయి. పదిరోజుల్లో ఫీల్డ్‌కు.. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి పంపే సమయంలో గూగుల్ మ్యాప్ ఆధారంగా రోడ్డు అలైన్ మెంటును రూపొందించారు. ఇందులో ఏయే ఊళ్ల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుందో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ప్రతిపాదిత అలైన్మెం టును ఖరారు చేశారు. కానీ, ఫీల్డ్ సర్వే నిర్వహిం చలేదు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెన్సీ బాధ్యతలు చూసే ఫీడ్‌బ్యాక్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీస్ సంస్థ వారం, పది రోజుల్లో ఫీల్డ్ సర్వే ప్రారంభించనుంది. గ్రామాల నక్షాలు, సర్వేనంబర్ల ఆధారంగా మార్కింగ్ చేయనుంది. మూడు వారాల్లో తుది అలైన్‌మెంటు ఖరారవుతుంది. వీలైనంత వరకు గుట్టలు, జలాశయాలను తప్పించి అలైన్‌మెంటు ఖరారు చేయనున్నారు. అంతా గోప్యం.. ఇప్పటికే రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన ఆధా రంగా రియల్ ఎస్టేట్ సంస్థలు వేగం పెంచాయి. ఎలాంటి అలైన్మెంట్ రూపొందకుండానే ఫలానా సర్వే నంబర్ల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుం దంటూ బోగస్ మ్యాపులు సృష్టించి రైతుల్లో భయాందోళనలు రేకెత్తించి తక్కువ ధరకే భూము లను తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తుందని భావిస్తున్న భూముల్లో సాగు దాదాపు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వారి ఆగడాలకు కళ్లెం వేసేలా అధికారులు ఏ విషయాన్నీ బయటకు పొక్కనీయటం లేదు. పక్కాగా సర్వే జరిగి తుది అలైన్‌మెంటు సిద్ధమయ్యాకనే అధికారికంగా దాన్ని ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రెండో భాగంపై ట్రాఫిక్ స్టడీ.. రీజినల్ రింగురోడ్డులో మొదటిదశకు సంబంధించి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అనుమతించిన కేంద్రం, రెండోదశకు సంబంధించి ఇప్పటివరకు గెజిట్ విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టు దాదాపు రూ.18 వేల కోట్ల వ్యయంతో కూడుకున్నది కావటం విశేషం. దీంతో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన మొదటి సగంలో సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఓ రోడ్డు కొనసాగుతోంది. ఆయా పట్టణాల మీదుగా ఉన్న ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు భారీగా ఉండటంతో ఇది పూర్తిస్థాయి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి యోగ్యమైందని కేంద్రం ఇప్పటికే నిర్ధారించింది. రెండో సగంలో వాహనాల రాకపోకలు లేవని కేంద్రం గుర్తించింది. కానీ, రోడ్డు నిర్మాణంతో భారీగా వాహనాల రాకపోకలుంటాయని అధికారులు కేంద్రం దృష్టికి తెచ్చారు. అధికారులు టోల్‌ప్లాజాలు, ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్టడీ నిర్వహిస్తున్నారు. ఈ వివరాలు పరిశీలించాక కేంద్రం అనుమతి మంజూరు చేయనుందని సమాచారం. త్వరలో దానికి కూడా పచ్చజెండా ఊపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు
ముంబై: గత కొన్నాళ్లుగా పలు రహదారి ప్రాజెక్టులు అమ్మకానికి వస్తున్నాయి. నిధుల కొరత తదితర కారణాలతో ప్రమోటర్లు లేదా వాటి నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) వీటిని విక్రయిస్తున్నాయి. 2015–18 మధ్యకాలంలో ఏకంగా 52 రహదారి ప్రాజెక్టులను ప్రమోటర్లు విక్రయించారు. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం వీటి విలువ సుమారు రూ. 37,019 కోట్లుగా ఉంటుంది. 52 ప్రాజెక్టుల్లో ఆరు డిస్కౌంటుకే అమ్ముడు కాగా.. మిగతా ప్రాజెక్టులు 2–21 శాతం ప్రీమియంకి అమ్ముడయ్యాయి. ‘చాలా మటుకు రహదారి ప్రాజెక్టులు..ప్రమోటర్లకు చాలా తక్కువ రాబడులే ఇచ్చాయి. ఆర్థికంగా బలంగా లేని డెవలపర్లు నిధుల సంక్షోభం కారణంగా నష్టానికే తమ అసెట్స్‌ను అమ్ముకున్నారు‘ అని ఇక్రా పేర్కొంది. మెరుగుపడిన ప్రాజెక్టుల రేటింగ్.. యాజమాన్యం చేతులు మారడంతో ఆయా ప్రాజెక్టులకు నిధుల లభ్యత మెరుగుపడిందని ఇక్రా వివరించింది. చాలా ప్రాజెక్టులకు మరింత తక్కువ వడ్డీ రేటుపై, మరింత దీర్ఘకాలానికి రుణాల రీఫైనాన్సింగ్ సదుపాయం లభించిందని పేర్కొంది. మూడో వంతు ప్రాజెక్టుల రేటింగ్స్ గణనీయంగా పెరిగాయి. 2014 – 2018 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ప్రాజెక్టుల అమలు వృద్ధి రేటు వార్షికంగా 23 శాతం మేర నమోదైందని ఇక్రా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో 6,715 కి.మీ. మేర రహదారుల నిర్మాణం జరిగినట్లు పేర్కొంది. నిల్చిపోయిన ప్రాజెక్టుల సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించడం, క్లియరెన్సుల కోసం ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి తేవడం, దాదాపు 80% స్థల సమీకరణ పూర్తయ్యాకే కేటాయించడం వంటి విధానపరమైన చర్యలతో ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమైనట్లు ఇక్రా తెలిపింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 3,621 కి.మీ. ప్రాజెక్టులను కేటాయించగా.. 2018 ఆర్థిక సంవత్సరానికి ఇది 47% వృద్ధితో 17,055 కి.మీ.కు చేరినట్లు వివరించింది. ఇందులో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 7,397 కి.మీ. ప్రాజెక్టులను గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. రహదారుల రంగంపై స్థిరమైన అంచనాలు.. త్వరలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టుల కేటాయింపులతో రహదారి డెవలపర్లు, ఈపీసీ కాంట్రాక్టర్లకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రాగలవని ఇక్రా అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం భవిష్యత్ స్థిరంగా ఉండగలదని పేర్కొంది. ఇక లాభదాయకత విషయానికొస్తే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉండటం.. ఈపీసీ కాంట్రాక్టర్లకు సానుకూలమని వివరించింది. మొత్తం మీద చూస్తే 2020 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూళ్లు కనిష్టంగానైనా రెండంకెల స్థాయిలో ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. అయితే, భారీ రుణాలపై అధిక వడ్డీ వ్యయాల కారణంగా కాంట్రాక్టర్ల నికర లాభాలపై ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. -
రోడ్డు లేదు..గ్రిడ్డూ లేదు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులు దారుణ స్థితిలో ఉన్నాయి. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు రహదార్ల అనుసంధానానికి రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నామని హడావుడి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్క ప్రతిష్టాత్మక రోడ్డు ప్రాజెక్టునూ చేపట్టలేదు. రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం నుంచి అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే వరకు అన్నీ ప్రకటనలుగానే మిగిలిపోయాయి. నెలకోమారు సమీక్షలు నిర్వహించడం మినహా ఇంతవరకు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. రహదార్ల విస్తరణను పట్టించుకోకుండా మద్యం ఆదాయం కోసం ఏకంగా వాటి స్థాయిని తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా వచ్చే సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్ఎఫ్) దక్కడం లేదు. కృష్ణా, గోదావరి పుష్కరాలప్పుడు రోడ్ల నిర్మాణ పనులంటూ రూ.2 వేల కోట్ల వరకు కేటాయించారు. అయితే ఈ నిధులు అధిక శాతం అధికార పార్టీ నేతల జేబుల్లోకే వెళ్లాయి. నాసిరకంగా రోడ్లు వేయడంతో నెలల వ్యవధిలోనే పూర్తిగా పాడయ్యాయి. దీనిపై ఆర్‌అండ్‌బీలో క్వాలిటీ కంట్రోల్ విభాగం పనిచేస్తోందా? లేదా? అనే అనుమానాలు ఆర్అండ్బీ వర్గాలే వ్యక్తం చేశాయి. టెండర్లు లేకుండా.. వివిధ నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు పర్యటించినప్పుడు ఇచ్చిన రోడ్ల మరమ్మతులు, విస్తరణ హామీల పనుల విలువ రూ.1,250 కోట్ల వరకు ఉందని ఆర్అండ్బీ అంచనా వేసింది. టెండర్ విధానం ద్వారా కాకుండా నామినేషన్ విధానంలో పనుల్ని అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రహదార్ల నిర్వహణ, మరమ్మతుల పనులు విభజించి మొదటి విడతగా రూ.250 కోట్లను సర్కార్ కేటాయించింది. నిబంధనల ప్రకారం.. రూ.కోట్ల విలువైన పనుల్ని నామినేషన్ విధానంలో అప్పగించకూడదు. దీంతో రూ.10 లక్షల చొప్పున మరమ్మతుల పనులు విభజించి అయినవారికి అప్పగించేందుకు నిర్ణయించారు. తొలి విడతలో కేటాయించిన రూ.250 కోట్లను అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు మంజూరు చేయాలని ఉన్నత స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పుష్కరాలప్పుడు కూడా ఇదేవిధంగా నామినేషన్ విధానంలో రూ.700 కోట్ల రోడ్ల విస్తరణ, మరమ్మత్తుల పనులను తమవారికి అప్పగించారు. ముందుగానే తెలుసుకుని.. ప్రకాశం జిల్లాలో కనిగిరి–పొదిలి రహదారి విస్తరణకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు ఇచ్చింది. ఈ రహదారిని జాతీయ రహదారిగా విస్తరిస్తారని ముందుగానే తెలుసుకుని అప్పటి ఆర్అండ్బీ మంత్రి శిద్ధా రాఘవరావు నిధులు విడుదల చేయించుకున్నారని ఆరోపణలున్నాయి. తూతూమంత్రంగా ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. జాతీయ రహదారి– 565ని ప్రకటించింది. ఈ రహదారి తెలంగాణ పరిధిలోని నకిరేకిల్ (ఎన్‌హెచ్–65) నుంచి నల్గొండ, ఏపీలోని మాచర్ల, కనిగిరి, వెంకటగిరి మీదుగా ఏర్పేడు రోడ్డు వరకు వెళుతుంది. ఎన్‌హెచ్–565 ప్రకటించిన తర్వాత రూ.13 కోట్లతో విస్తరించిన కనిగిరి–పొదిలి రహదారిని పగులగొట్టి పది మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. దీంతో ఈ రహదారి విస్తరణకు వెచ్చించిన రూ.13 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి పామూరు మీదుగా వైఎస్సార్ జిల్లా కడప, బద్వేలుకు వెళ్లే కందుకూరు–వలేటివారిపాలెం రోడ్డు విస్తరణకు మంత్రి శిద్ధా నిధులు మంజూరు చేయించుకున్నారు. 18 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.20 కోట్ల నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు దాన్ని ఎన్‌హెచ్–167బిగా గుర్తించింది. దీంతో మైదుకూరు నుంచి టేకూరుపేట, కోవిలంపాడు, పామూరు, వలేటివారిపాలెం, బడేవారిపాలెం, కందుకూరు, ఓగూరుల మీదుగా సింగరాయకొండ (ఎన్‌హెచ్–16) వద్ద ఈ రహదారి కలుస్తుంది. ఈ జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వమే పది మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేసింది. రాష్ట్రప్రభుత్వం హడావుడిగా రూ.20 కోట్లతో చేపట్టిన పనుల నాణ్యత తీసికట్టులా తయారైంది. పైన తారు పూత.. లోపల కాసుల వేట రాష్ట్రంలో రహదార్ల మరమ్మతుల్లోనూ మతలబులు చోటు చేసుకున్నాయి. పై పైన తారు పూతతోనే కాంట్రాక్టర్లు రూ.కోట్లు దండుకున్నారు. నాలుగేళ్లలో రూ.1,422 కోట్లు ఖర్చు చేసి 16,280 కిలోమీటర్ల రహదార్లను మరమ్మతులు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. రోడ్ల మరమ్మతులకు ఆర్అండ్బీ ఏటా రూ.350 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. వీటికి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తోంది. అయితే మరమ్మతులు చేసిన రోజుల వ్యవధిలోనే రహదార్లపై మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి. రూ.6,500 కోట్ల ప్రాజెక్టుపైనా కన్ను ఆర్ అండ్ బీ శాఖ ఇటీవలే 2 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించింది. ఏపీ మండల కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు, ఏపీ రోడ్లు, వంతెనల రీ కనస్ట్రక్షన్ ప్రాజెక్టు (ఏపీఆర్‌బీఆర్‌పీ)లకు రూ.6,500 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులపైనా కన్నేసిన సర్కారు పెద్దలు అస్మదీయులకు ఎన్నికల తాయిలాలుగా ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులకు కనీసం రూ.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోడ్ గ్రిడ్ అంటే.. రోడ్ గ్రిడ్ అంటే.. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి జాతీయ రహదార్లకు అనుసంధానం పెంచడం. రోడ్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూ.3,184 కోట్లు కేటాయిస్తున్నామని 2016లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పట్నుంచీ పైసా కూడా కేటాయించకుండా ఇప్పుడు రూ.6,500 కోట్లు అంటూ కొత్త పల్లవి అందుకుంది. అతీగతీ లేని ఔటర్‌రింగ్ రోడ్డు నూతన రాజధాని ప్రాంతం చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణం అంటూ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించింది. రూ.20 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 189 కిలోమీటర్ల మేర కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఓఆర్ఆర్కు నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా నేటికీ అతీగతీ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 84 గ్రామాల్లో 8,510 ఎకరాలు సేకరిస్తున్నామని హడావుడి చేయడం మినహా ఒక్క అంగుళం ముందుకు పడలేదు. -
తుది దశలో పది లేన్ల రోడ్డు
సాక్షి, ముంబై: సైన్-పన్వేల్ జాతీయ రహదారిని 10 లేన్లు (5+5)గా మార్చే పనులు తుది దశకు చేరుకున్నాయి. వర్షాకాలానికి ముందే ఈ రహదారిని ప్రారంభించేందుకు పీడబ్ల్యూడీ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నిత్యం పుణే, కొంకణ్, గోవా దిశగా వెళ్లే లక్షలాది వాహనాలకు ఒక వరంగా పరిణమించనుంది. ముఖ్యంగా ప్రతీ వర్షా కాలంలో ఈ రహదారిపై వాహన చోదకులు పడే ఇబ్బందుల నుంచి శాశ్వతంగా విముక్తి లభించనుంది. ఎక్స్‌ప్రెస్ హై వే మీదుగా పుణే నుంచి పన్వేల్ వరకు 120 కి.మీ. ప్రయాణానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది. అదే పన్వేల్ నుంచి ముంబై వరకు దాదాపు 50 కి.మీ ప్రయాణానికి మాత్రం రెండున్నర గంటలకు పైనే పడుతోంది. పుణే, ముంబై నగరాలు వాణిజ్యపరంగా దినదినాభివృద్థి చెందుతున్నాయి. దీంతో ఇరు నగరాల మధ్య రోజూ వచ్చిపోయే వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా ఈ రెండు నగరాల్లో ఏ రహదారిపై చూసినా ట్రాఫిక్ జాం కనబడుతోంది. భవిష్యత్తులో ఇది మరింత జటిలమయ్యే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైన్-పన్వేల్ల మధ్య (ప్రస్తుతం 2+2 లేన్లు ఉన్నాయి) 10 లేన్ల రహదారి నిర్మిస్తే బాగుంటుందని పీడబ్ల్యూడీ ప్రభుత్వానికి సిపార్సు చేసింది. దీంతో బీఓటీ పద్ధతిలో ఈ రహదారిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు రూ.1,220 కోట్లతో ఈ భారీప్రాజెక్టు పనులు రెండేళ్ల కిందట ప్రారంభించింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2014 మే ఆఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే తారు రోడ్డా లేదా సీసీ రోడ్డా అనే అంశంపై ప్రారంభంలో నెలకొన్న వాగ్వాదంవల్ల పనులు తొమ్మిది నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ జూన్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. సైన్-పన్వేల్ రహదారి మధ్యలో ఉన్న ఖార్ఘర్ వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే టోల్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఖార్ఘర్ వద్ద ఏర్పాటు చేయనున్న టోల్‌ప్లాజాలో ఎంతమేర వసూలు చేయాలనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈ రహదారిపై వివిధ జంక్షన్ల వద్ద చిన్న, పెద్ద ఇలా మొత్తం ఐదు ఫ్లైఓవర్లు ఉన్నాయి. వీటి పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.