సాక్షి, ముంబై: సైన్-పన్వేల్ జాతీయ రహదారిని 10 లేన్లు (5+5)గా మార్చే పనులు తుది దశకు చేరుకున్నాయి. వర్షాకాలానికి ముందే ఈ రహదారిని ప్రారంభించేందుకు పీడబ్ల్యూడీ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నిత్యం పుణే, కొంకణ్, గోవా దిశగా వెళ్లే లక్షలాది వాహనాలకు ఒక వరంగా పరిణమించనుంది. ముఖ్యంగా ప్రతీ వర్షా కాలంలో ఈ రహదారిపై వాహన చోదకులు పడే ఇబ్బందుల నుంచి శాశ్వతంగా విముక్తి లభించనుంది. ఎక్స్‌ప్రెస్ హై వే మీదుగా పుణే నుంచి పన్వేల్ వరకు 120 కి.మీ. ప్రయాణానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది.
అదే పన్వేల్ నుంచి ముంబై వరకు దాదాపు 50 కి.మీ ప్రయాణానికి మాత్రం రెండున్నర గంటలకు పైనే పడుతోంది. పుణే, ముంబై నగరాలు వాణిజ్యపరంగా దినదినాభివృద్థి చెందుతున్నాయి. దీంతో ఇరు నగరాల మధ్య రోజూ వచ్చిపోయే వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా ఈ రెండు నగరాల్లో ఏ రహదారిపై చూసినా ట్రాఫిక్ జాం కనబడుతోంది. భవిష్యత్తులో ఇది మరింత జటిలమయ్యే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైన్-పన్వేల్‌ల మధ్య (ప్రస్తుతం 2+2 లేన్లు ఉన్నాయి) 10 లేన్ల రహదారి నిర్మిస్తే బాగుంటుందని పీడబ్ల్యూడీ ప్రభుత్వానికి సిపార్సు చేసింది. దీంతో బీఓటీ పద్ధతిలో ఈ రహదారిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు రూ.1,220 కోట్లతో ఈ భారీప్రాజెక్టు పనులు రెండేళ్ల కిందట ప్రారంభించింది.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2014 మే ఆఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే తారు రోడ్డా లేదా సీసీ రోడ్డా అనే అంశంపై ప్రారంభంలో నెలకొన్న వాగ్వాదంవల్ల పనులు తొమ్మిది నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ జూన్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. సైన్-పన్వేల్ రహదారి మధ్యలో ఉన్న ఖార్‌ఘర్ వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే టోల్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఖార్‌ఘర్ వద్ద ఏర్పాటు చేయనున్న టోల్‌ప్లాజాలో ఎంతమేర వసూలు చేయాలనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈ రహదారిపై వివిధ జంక్షన్ల వద్ద చిన్న, పెద్ద ఇలా మొత్తం ఐదు ఫ్లైఓవర్లు ఉన్నాయి. వీటి పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.
తుది దశలో పది లేన్ల రోడ్డు
Published Tue, May 27 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement