సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులు దారుణ స్థితిలో ఉన్నాయి. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు రహదార్ల అనుసంధానానికి రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నామని హడావుడి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్క ప్రతిష్టాత్మక రోడ్డు ప్రాజెక్టునూ చేపట్టలేదు. రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం నుంచి అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే వరకు అన్నీ ప్రకటనలుగానే మిగిలిపోయాయి. నెలకోమారు సమీక్షలు నిర్వహించడం మినహా ఇంతవరకు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. రహదార్ల విస్తరణను పట్టించుకోకుండా మద్యం ఆదాయం కోసం ఏకంగా వాటి స్థాయిని తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా వచ్చే సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్‌ఎఫ్) దక్కడం లేదు. కృష్ణా, గోదావరి పుష్కరాలప్పుడు రోడ్ల నిర్మాణ పనులంటూ రూ.2 వేల కోట్ల వరకు కేటాయించారు. అయితే ఈ నిధులు అధిక శాతం అధికార పార్టీ నేతల జేబుల్లోకే వెళ్లాయి. నాసిరకంగా రోడ్లు వేయడంతో నెలల వ్యవధిలోనే పూర్తిగా పాడయ్యాయి. దీనిపై ఆర్‌అండ్‌బీలో క్వాలిటీ కంట్రోల్ విభాగం పనిచేస్తోందా? లేదా? అనే అనుమానాలు ఆర్‌అండ్‌బీ వర్గాలే వ్యక్తం చేశాయి.
టెండర్లు లేకుండా..
వివిధ నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు పర్యటించినప్పుడు ఇచ్చిన రోడ్ల మరమ్మతులు, విస్తరణ హామీల పనుల విలువ రూ.1,250 కోట్ల వరకు ఉందని ఆర్‌అండ్‌బీ అంచనా వేసింది. టెండర్ విధానం ద్వారా కాకుండా నామినేషన్ విధానంలో పనుల్ని అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రహదార్ల నిర్వహణ, మరమ్మతుల పనులు విభజించి మొదటి విడతగా రూ.250 కోట్లను సర్కార్ కేటాయించింది. నిబంధనల ప్రకారం.. రూ.కోట్ల విలువైన పనుల్ని నామినేషన్ విధానంలో అప్పగించకూడదు. దీంతో రూ.10 లక్షల చొప్పున మరమ్మతుల పనులు విభజించి అయినవారికి అప్పగించేందుకు నిర్ణయించారు. తొలి విడతలో కేటాయించిన రూ.250 కోట్లను అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు మంజూరు చేయాలని ఉన్నత స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పుష్కరాలప్పుడు కూడా ఇదేవిధంగా నామినేషన్ విధానంలో రూ.700 కోట్ల రోడ్ల విస్తరణ, మరమ్మత్తుల పనులను తమవారికి అప్పగించారు.
ముందుగానే తెలుసుకుని..
ప్రకాశం జిల్లాలో కనిగిరి–పొదిలి రహదారి విస్తరణకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు ఇచ్చింది. ఈ రహదారిని జాతీయ రహదారిగా విస్తరిస్తారని ముందుగానే తెలుసుకుని అప్పటి ఆర్‌అండ్‌బీ మంత్రి శిద్ధా రాఘవరావు నిధులు విడుదల చేయించుకున్నారని ఆరోపణలున్నాయి. తూతూమంత్రంగా ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. జాతీయ రహదారి– 565ని ప్రకటించింది. ఈ రహదారి తెలంగాణ పరిధిలోని నకిరేకిల్ (ఎన్‌హెచ్–65) నుంచి నల్గొండ, ఏపీలోని మాచర్ల, కనిగిరి, వెంకటగిరి మీదుగా ఏర్పేడు రోడ్డు వరకు వెళుతుంది. ఎన్‌హెచ్–565 ప్రకటించిన తర్వాత రూ.13 కోట్లతో విస్తరించిన కనిగిరి–పొదిలి రహదారిని పగులగొట్టి పది మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. దీంతో ఈ రహదారి విస్తరణకు వెచ్చించిన రూ.13 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి పామూరు మీదుగా వైఎస్సార్ జిల్లా కడప, బద్వేలుకు వెళ్లే కందుకూరు–వలేటివారిపాలెం రోడ్డు విస్తరణకు మంత్రి శిద్ధా నిధులు మంజూరు చేయించుకున్నారు. 18 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.20 కోట్ల నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు దాన్ని ఎన్‌హెచ్–167బిగా గుర్తించింది. దీంతో మైదుకూరు నుంచి టేకూరుపేట, కోవిలంపాడు, పామూరు, వలేటివారిపాలెం, బడేవారిపాలెం, కందుకూరు, ఓగూరుల మీదుగా సింగరాయకొండ (ఎన్‌హెచ్–16) వద్ద ఈ రహదారి కలుస్తుంది. ఈ జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వమే పది మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేసింది. రాష్ట్రప్రభుత్వం హడావుడిగా రూ.20 కోట్లతో చేపట్టిన పనుల నాణ్యత తీసికట్టులా తయారైంది.
పైన తారు పూత.. లోపల కాసుల వేట
రాష్ట్రంలో రహదార్ల మరమ్మతుల్లోనూ మతలబులు చోటు చేసుకున్నాయి. పై పైన తారు పూతతోనే కాంట్రాక్టర్లు రూ.కోట్లు దండుకున్నారు. నాలుగేళ్లలో రూ.1,422 కోట్లు ఖర్చు చేసి 16,280 కిలోమీటర్ల రహదార్లను మరమ్మతులు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. రోడ్ల మరమ్మతులకు ఆర్‌అండ్‌బీ ఏటా రూ.350 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. వీటికి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తోంది. అయితే మరమ్మతులు చేసిన రోజుల వ్యవధిలోనే రహదార్లపై మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి.
రూ.6,500 కోట్ల ప్రాజెక్టుపైనా కన్ను
ఆర్ అండ్ బీ శాఖ ఇటీవలే 2 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించింది. ఏపీ మండల కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు, ఏపీ రోడ్లు, వంతెనల రీ కనస్ట్రక్షన్ ప్రాజెక్టు (ఏపీఆర్‌బీఆర్‌పీ)లకు రూ.6,500 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులపైనా కన్నేసిన సర్కారు పెద్దలు అస్మదీయులకు ఎన్నికల తాయిలాలుగా ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులకు కనీసం రూ.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
రోడ్ గ్రిడ్ అంటే..
రోడ్ గ్రిడ్ అంటే.. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి జాతీయ రహదార్లకు అనుసంధానం పెంచడం. రోడ్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూ.3,184 కోట్లు కేటాయిస్తున్నామని 2016లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పట్నుంచీ పైసా కూడా కేటాయించకుండా ఇప్పుడు రూ.6,500 కోట్లు అంటూ కొత్త పల్లవి అందుకుంది.
అతీగతీ లేని ఔటర్‌రింగ్ రోడ్డు
నూతన రాజధాని ప్రాంతం చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణం అంటూ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించింది. రూ.20 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 189 కిలోమీటర్ల మేర కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఓఆర్‌ఆర్‌కు నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా నేటికీ అతీగతీ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 84 గ్రామాల్లో 8,510 ఎకరాలు సేకరిస్తున్నామని హడావుడి చేయడం మినహా ఒక్క అంగుళం ముందుకు పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment