లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వండి
రీజనల్ రింగ్ రోడ్డు బాధితుల డిమాండ్
అవార్డు ఎంక్వైరీ బహిష్కరణ
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు ‘అవార్డు ఎంక్వైరీ’ని బహిష్కరించారు. మూడు రోజుల పాటు రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహించతలపెట్టిన అవార్డు ఎంక్వైరీని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోమన్నారు. బుధవారం మొదటి రోజు విచారణను బహిష్కరించిన నిర్వాసితులు, జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భాగంలో పాటిస్తున్న విధంగానే 40 కిలోమీటర్ల నిబంధన ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం పలుమార్లు అలైన్‌మెంట్‌ను మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేసే హక్కు పాలకులు, అధికారులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే అలైన్‌మెంట్‌ను మార్చాలని, లేదంటే బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నిర్వాసితులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, మారుపాక రామలింగం, చింతల ప్రభాకర్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్, సుర్కంటి రాజిరెడ్డి, బోరెం ప్రకాష్‌రెడ్డి, చింతల సుధాకర్‌రెడ్డి, దబ్బటి రాములు, ఏనుగు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment