వెలుగులో ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు | Sensex up 82 points; FMCG, TECk stocks major gainers | Sakshi
Sakshi News home page

వెలుగులో ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు

Published Thu, Jun 2 2016 1:22 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

వెలుగులో ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు - Sakshi

వెలుగులో ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు

బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ
స్వల్పంగా పెరిగిన స్టాక్ సూచీలు

 ముంబై: ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో తాజా కొనుగోళ్లు జరగడంతో బుధవారం స్టాక్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. క్యూ4లో జీడీపీ వృద్ధి రేటు మార్కెట్ అంచనాల్ని మించి 7.9 శాతం నమోదుకావడంతో ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు వువ్వెత్తున ఎగిసాయి. అటుతర్వాత బ్యాంకింగ్, పీఎస్‌యూ, మెటల్ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్  ప్రారంభంలో 150 పాయింట్ల మేర పెరిగి 25,857 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. కానీ చివరకు 46 పాయింట్ల పెరుగుదలతో 26,714 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోసారి 8,200 పాయింట్ల స్థాయిని దాటిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 20 పాయింట్ల పెరుగుదలతో 8,180 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సమీప భవిష్యత్తులో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని, తీవ్రంగా క్షీణించే ప్రమాదం లేదని విశ్లేషకులు చెప్పారు.

జీడీపీ వేగంగా వృద్ధిచెందడం, కార్పొరేట్ల ఫలితాలు మెరుగ్గా వుండటంతో భారత్ మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారిందని మోర్గాన్‌స్టాన్లీ విశ్లేషకుడు జోనాథన్ గార్నర్ అన్నారు. వర్థమాన మార్కెట్ల నుంచి భారత్ విడివడిందని, ఫెడ్ వడ్డీ రేటు పెంపు ప్రభావం భారత్‌పై పెద్దగా వుండదని ఆయన వివరించారు. సెన్సెక్స్ 30 షేర్లలో 14 షేర్లు లాభపడగా, 16 క్షీణతతో ముగిసాయి. పెరిగిన షేర్లలో ఐటీసీ, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఆదాని పోర్ట్స్, ఆసియన్ పెయింట్స్, భారతి ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, లుపిన్‌లు వున్నాయి. తగ్గిన షేర్లలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్‌ఈఎల్, టాటా మోటార్స్, సిప్లా, వేదాంతలు వున్నాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో తైవాన్ మినహా మిగిలినవన్నీ స్వల్పంగా తగ్గాయి.

మార్చికల్లా 30,000 పాయింట్లకు సెన్సెక్స్: మోర్గాన్‌స్టాన్లీ
ముంబై: రానున్న నెలల్లో ప్రపంచ మార్కెట్లను అధిగమించి భారత్ స్టాక్ మార్కెట్ పెరుగుతుందని, వచ్చే ఏడాది మార్చికల్లా బీఎస్‌ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్ల స్థాయిని తిరిగి చేరుకుంటుందని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. బుల్ మార్కెట్ కొనసాగితే మార్చికి సూచీ 30,000 పాయింట్లకు పెరుగుతుందని, లేదంటే కనీసం 27,500 పాయింట్ల వరకూ చేరవచ్చన్నది అంచనావేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఈక్విటీ హెడ్ రిథిమ్ దేశాయ్ బుధవారంనాడిక్కడ మీడియాకు చెప్పారు. 2015 మార్చిలో 30,028 పాయింట్ల చరిత్రాత్మక గరిష్టస్థాయిని చేరిన సెన్సెక్స్, అప్పటి నుంచి కరెక్షన్‌కు లోనవుతున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ల ఫలితాలు మెరుగుపడటం, వడ్డీ రేట్ల కోతలు, కార్పొరేట్ రుణ పరిస్థితి మరింత హీనమయ్యే అవకాశం లేకపోవడం వంటి అంశాలతో భారత్ మార్కెట్ ఇతర ప్రపంచ మార్కెట్లకంటే జోరు చూపిస్తుందని ఆయన అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement