మార్కెట్లకు చేదు మాత్ర..
ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాలు
♦ సెన్సెక్స్ 253 పాయింట్లు,
♦ నిఫ్టీ 78 పాయింట్లు డౌన్
ముంబై: హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో లాభాల స్వీకరణతో దేశీ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలు చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆరువారాల గరిష్టం నుంచి 253 పాయింట్లు కోల్పోయి 24,551కి పతనమైంది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా కీలకమైన 7,500 పాయింట్ల కన్నా దిగువకు పడిపోయింది. 78 పాయింట్ల నష్టంతో 7,461 వద్ద క్లోజయ్యింది. క్రితం రోజున వెలువడిన సానుకూల ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం మార్కెట్‌కు ఊతమివ్వలేకపోయాయి. గోవా ప్లాంటులో ఔషధాల తయారీలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి నోటీసులతో లుపిన్ షేరు ఏకంగా 7.59 శాతం క్షీణించింది.
ఇక కీలకమైన ఔషధాల విక్రయాలపై నిషేధం కారణంగా ఫైజర్ షేర్లపై ఒత్తిడి కొనసాగింది. కంపెనీ షేర్లు మరో 3.15% తగ్గాయి. ప్రొక్టర్ అండ్ గాంబుల్ షేరు కూడా 2.21% పడింది. ఈ పరిణామాలతో హెల్త్‌కేర్ సూచీ 3%క్షీణించింది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఒక మోస్తరుగానే ట్రేడయ్యాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ తమ దేశ ఆర్థిక వ్యవస్థపై నిరాశాజనక అంచనాలు వెలువరించడంతో ఆసియా మార్కెట్లు బలహీనపడ్డ ప్రభావాలు.. యూరప్ మార్కెట్లపైనా కనిపించాయి.
నేడు హెచ్‌సీజీ పబ్లిక్ ఇష్యూ...
క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్ సంస్థ హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ (హెచ్‌సీజీ) దాదాపు రూ. 650 కోట్ల సమీకరణ కోసం తలపెట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) బుధవారం ప్రారంభం కానుంది. మార్చి 18న ముగిసే ఐపీవోకు సంబంధించి ప్రైస్ బ్యాండ్‌ను రూ. 205-218 శ్రేణిలో కంపెనీ నిర్ణయించింది. గరిష్ట స్థాయిలో కంపెనీ రూ. 650 కోట్లు సమీకరించవచ్చు.