vijaynagaram
-
పర్యావరణ నేస్తాలు.. సముద్ర తాబేళ్లు..
సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది. నీటిని శుద్ధి చేస్తాయి. ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. మత్స్య సంపద వృద్ధికి తోడ్పడతాయి. తీర ప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండటంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వేళ అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టారు. పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. తాబేళ్లు మానవాళికి, చేపల వృద్ధికి కలిగించే ప్రయోజనాలపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. సాక్షి, విజయనగరం: జిల్లా తీర ప్రాంతం సుమారు 28 కిలోమీటరు. భోగాపురం, పూసపాటి రేగ మండలాల్లో విస్తరించి ఉన్న తీరం తాబేళ్ల పునరుత్పత్తికి ఆలవాలం. అందుకే ఏటా పెద్ద ఎత్తున ఇక్కడి తీరానికి సముద్ర తాబేళ్లు చేరుకుంటాయి. గుడ్లు పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. వీటి సంరక్షణకు 2014 సంవత్సరంలో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం వారు తీరంలో 10 ఆలివ్‌రిడ్లి తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెంపకం ఎలా ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని తల్లి తాబేళ్లు తీరం అంచుకు చేరుకుని గుడ్లు పెడతాయి. వీటిని నక్కలు, అడవి పందులు ధ్వంసం చేయకుండా అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్లు పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో అధికారులు ముందుగా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో మిని హేచరీలు ఏర్పాటుచేసి అందులో రెండు నుంచి మూడు అడుగులు సైజు గుంతలు తవ్వి గుడ్లును ఉంచుతారు. గుంతల్లో పొదిగిన గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 రోజుల నుంచి 60 రోజుల సమ యం పడుతుంది. డిసెంబర్–జూన్ వరకు ఈ ఉత్పత్తికేంద్రాల ద్వారా తాబేళ్లు అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. చంపినా, తిన్నా నేరమే.. తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. మూడు సంవత్సరాల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. భారత ప్రభుత్వం ఈ తాబేళ్ల చట్టం పరిధిలో షెడ్యూల్–1 లో చేర్చింది. మానవాళికి తాబేళ్లు చేసే మేలు ఇలా... తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీరప్రాంతాల్లో నివసించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో ఆక్సిజన్ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్ బెడ్ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తిని చేస్తాయి. దీంతో మత్స్య సంపద వృద్ధిచెందుతుంది. ప్రత్యేకతలు... ఆలివ్‌రిడ్లి తాబేలు సుమారు 45 కిలోల బరువు, మూడు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్లు పొడవు, అరంగులం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 గుడ్లు వరకు గుడ్లు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రతీరంలోకి వెళతాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెట్టడం వీటి ప్రత్యేకత. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తాయి. -
మేమేమి పాపం చేశాం ...నాన్న!
మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఇష్టంగా దగ్గరయ్యారు.. మాకు జన్మనిచ్చారు. చిటికన వేలి అందజేసి లోకమంతా చూపించాల్సిన మీరు.. మాపై లింగత్వ పరీక్ష పెట్టి కక్ష పెంచుకోవడం తగునా ‘నాన్నా’.. మీరు కోరుకుంటేనే కదా భూమి మీదకు వచ్చాం.. ఇప్పుడు ప్రాణమే లేకుండా చేశారంటూ చిన్నారి ఆత్మఘోషిస్తోంది. సాలూరు మండలం జోడుమామిడివలసలో శుక్రవారం రాత్రి నిద్రపోతున్న రెండేళ్ల చిన్నారిని సొంత తండ్రే కర్కశంగా హతమార్చడం మానవ బంధాలను ప్రశ్నిస్తోంది. సాక్షి,విజయనగరం(సాలూరు): ముద్దులొలికే ఇద్దరు ఆడపిల్లలను చూసి మురిసిపోవాల్సిన తండ్రి.. వారిపై కక్ష పెట్టుకున్నాడు. మద్యానికి బానిసై భార్య, పిల్లలను వేధించడం మొదలెట్టాడు. భర్త రాక్షసత్వాన్ని గమనించిన భార్య.. ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లలను తీసుకుని కన్నవారింటికి వెళ్లినా విడిచిపెట్టలేదు. భార్యతో పాటు ఇద్దరి పిల్లలను హతమార్చే ప్రయ త్నం చేశాడు. చివరకు ఒక కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడు. మరో కుమార్తెను తీవ్రంగా గాయపరిచిన విషాదకర ఘటన సాలూరు మండలం తుండ పంచాయతీ జోడుమామిడివలసలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొమరాడ మండలం ఉలిపిరికి చెందిన కొలికి ప్రసాద్ తొలిభార్య మరణించింది. సాలూరు మండలం జోడుమామిడివలసకు చెందిన లక్ష్మిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న సిరి, ప్రణవి కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, మగ పిల్లలకు జన్మనివ్వలేదంటూ భార్య లక్ష్మిని నిత్యం వేధించేవాడు. కుమార్తెలను అసహ్యించుకునేవాడు. భర్త వక్రబుద్ధిని గమనించిన లక్ష్మి పిల్లలను తీసుకుని కన్నవారు నివసిస్తున్న జోడుమామిడివలసకు వారం రోజుల కిందట వచ్చేసింది. అప్పటికీ భర్త వేధింపులు ఆపలేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లక్ష్మివద్దకు వచ్చాడు. గొడవ పడ్డాడు. పూటుగా మద్యం సేవించి రాత్రి పది గంటల సమయంలో దాడికి తెగబడ్డాడు. మంచంపై నిద్రపోతున్న ప్రణవి కాళ్లుచేతులు పట్టుకుని రోడ్డుకు కొట్టేశాడు. అంతే చిన్నారి అక్కడికక్కడే విగతజీవిగా మారింది. పెద్దపాప సిరిని సైతం తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అడ్డుకోవడంతో కొన ఊపిరితో బయటపడింది. పాపను 108లో ముందుగా సాలూరు సీహెచ్‌సీకి, అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి అక్క డి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. భర్త దాడికి భయపడి లక్ష్మి దూరంగా పారిపోవడంతో ప్రాణాలతో బయటపడింది. చిన్నారిని బలితీసుకున్న ప్రసాద్‌ను స్థానికులు తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. ప్రసాద్ మొదటి భార్య మరణంపైనా స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేశారు. -
కంపెనీ సంచులు.. నకిలీ విత్తులు
సాక్షి, కర్నూలు: నకిలీ పత్తి విత్తనాలకు జిల్లా అడ్డాగా మారుతోంది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిఘా పెరగడంతో అక్రమార్కులు మూడు రాష్ట్రాల సరిహద్దు కేంద్రమైన కర్నూలుకు మకాం మార్చారు. అసలుకు ఏమాత్రం తీసిపోని ప్యాకింగ్‌తో రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కై తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లా నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ప్రకాశం, విజయనగరం జిల్లాలకు పార్శిల్ సర్వీసుల్లో పెద్ద ఎత్తున విత్తన రవాణా జరుగుతోంది. గత నెలలో అధికారులు గుంటూరులో పత్తి విత్తనాల ఖాళీ సంచులు, ప్యాకింగ్ సామగ్రి, వివిధ కంపెనీల పేర్లతో కూడిన లేబుళ్లను స్వాధీనం చేసుకోవడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు 3,49,469 హెక్టార్లలో పంటు సాగయ్యాయి. ఇందులో పత్తి సాధారణ సాగు 1,08,983 హెక్టార్లు కావడంతో అక్రమార్కులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతూ వారి ఆశలతో చెలగాటం ఆడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల నుంచి ఆయిల్ తయారీ పేరిట పత్తి విత్తనాలను నకిలీ విత్తన తయారీ ముఠా సేకరిస్తోంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో గుంటూరు, కర్నూలుకు తరలిస్తున్నారు. వ్యవసాయాధికారుల కన్నుగప్పేందుకు మహిళల ద్వారా రవాణా చేయిస్తుండటం గమనార్హం. ఈ విత్తనాలను గుంటూరు, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల్లో గ్రేడింగ్ అనంతరం రంగులు వేసి మార్కెట్లో విక్రయానికి ఉంచుతున్నారు. పముఖ విత్తన కంపెనీలన్నీ గుంటూరు కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తుండటంతో అసలును పోలిన సంచులు, లేబుళ్లతో బురిడీ కొట్టిస్తున్నారు. గుంటూరులో తయారైన ఖాళీ విత్తన సంచులు, సామగ్రి పార్శిల్లో కర్నూలుకు తరలిస్తుండగా.. వీటిలో నకిలీ విత్తనాలు నింపి వ్యాపారం చేస్తున్నారు. కంపెనీ విత్తనాలు తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు ఆకర్శితులై మోసపోతున్నారు. ఇప్పటికైనా జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి నకిలీల పనిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నకిలీల నియంత్రణకు చర్యలు నకిలీ బీటీ పత్తి విత్తనాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఈ ఏడాది విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. 10 పైగా కేసులు నమోదయ్యాయి. కర్నూలు నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పత్తి విత్తనాలు రవాణా అవుతున్నందున ప్రత్యేక నిఘా ఉంచాం. ట్రాన్స్‌పోర్టు కంపెనీలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నాం. - జేడీఏ ఠాగూర్‌నాయక్