
మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఇష్టంగా దగ్గరయ్యారు.. మాకు జన్మనిచ్చారు. చిటికన వేలి అందజేసి లోకమంతా చూపించాల్సిన మీరు.. మాపై లింగత్వ పరీక్ష పెట్టి కక్ష పెంచుకోవడం తగునా ‘నాన్నా’.. మీరు కోరుకుంటేనే కదా భూమి మీదకు వచ్చాం.. ఇప్పుడు ప్రాణమే లేకుండా చేశారంటూ చిన్నారి ఆత్మఘోషిస్తోంది. సాలూరు మండలం జోడుమామిడివలసలో శుక్రవారం రాత్రి నిద్రపోతున్న రెండేళ్ల చిన్నారిని సొంత తండ్రే కర్కశంగా హతమార్చడం మానవ బంధాలను ప్రశ్నిస్తోంది.
సాక్షి,విజయనగరం(సాలూరు): ముద్దులొలికే ఇద్దరు ఆడపిల్లలను చూసి మురిసిపోవాల్సిన తండ్రి.. వారిపై కక్ష పెట్టుకున్నాడు. మద్యానికి బానిసై భార్య, పిల్లలను వేధించడం మొదలెట్టాడు. భర్త రాక్షసత్వాన్ని గమనించిన భార్య.. ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లలను తీసుకుని కన్నవారింటికి వెళ్లినా విడిచిపెట్టలేదు. భార్యతో పాటు ఇద్దరి పిల్లలను హతమార్చే ప్రయ త్నం చేశాడు. చివరకు ఒక కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడు. మరో కుమార్తెను తీవ్రంగా గాయపరిచిన విషాదకర ఘటన సాలూరు మండలం తుండ పంచాయతీ జోడుమామిడివలసలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
కొమరాడ మండలం ఉలిపిరికి చెందిన కొలికి ప్రసాద్ తొలిభార్య మరణించింది. సాలూరు మండలం జోడుమామిడివలసకు చెందిన లక్ష్మిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న సిరి, ప్రణవి కుమార్తెలు ఉన్నారు.
ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, మగ పిల్లలకు జన్మనివ్వలేదంటూ భార్య లక్ష్మిని నిత్యం వేధించేవాడు. కుమార్తెలను అసహ్యించుకునేవాడు. భర్త వక్రబుద్ధిని గమనించిన లక్ష్మి పిల్లలను తీసుకుని కన్నవారు నివసిస్తున్న జోడుమామిడివలసకు వారం రోజుల కిందట వచ్చేసింది. అప్పటికీ భర్త వేధింపులు ఆపలేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లక్ష్మివద్దకు వచ్చాడు. గొడవ పడ్డాడు. పూటుగా మద్యం సేవించి రాత్రి పది గంటల సమయంలో దాడికి తెగబడ్డాడు. మంచంపై నిద్రపోతున్న ప్రణవి కాళ్లుచేతులు పట్టుకుని రోడ్డుకు కొట్టేశాడు. అంతే చిన్నారి అక్కడికక్కడే విగతజీవిగా మారింది. పెద్దపాప సిరిని సైతం తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అడ్డుకోవడంతో కొన ఊపిరితో బయటపడింది.
పాపను 108లో ముందుగా సాలూరు సీహెచ్‌సీకి, అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి అక్క డి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. భర్త దాడికి భయపడి లక్ష్మి దూరంగా పారిపోవడంతో ప్రాణాలతో బయటపడింది. చిన్నారిని బలితీసుకున్న ప్రసాద్‌ను స్థానికులు తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. ప్రసాద్ మొదటి భార్య మరణంపైనా స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేశారు.