కంపెనీ సంచులు.. నకిలీ విత్తులు
సాక్షి, కర్నూలు: నకిలీ పత్తి విత్తనాలకు జిల్లా అడ్డాగా మారుతోంది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిఘా పెరగడంతో అక్రమార్కులు మూడు రాష్ట్రాల సరిహద్దు కేంద్రమైన కర్నూలుకు మకాం మార్చారు. అసలుకు ఏమాత్రం తీసిపోని ప్యాకింగ్‌తో రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కై తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లా నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ప్రకాశం, విజయనగరం జిల్లాలకు పార్శిల్ సర్వీసుల్లో పెద్ద ఎత్తున విత్తన రవాణా జరుగుతోంది. గత నెలలో అధికారులు గుంటూరులో పత్తి విత్తనాల ఖాళీ సంచులు, ప్యాకింగ్ సామగ్రి, వివిధ కంపెనీల పేర్లతో కూడిన లేబుళ్లను స్వాధీనం చేసుకోవడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది.
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు 3,49,469 హెక్టార్లలో పంటు సాగయ్యాయి. ఇందులో పత్తి సాధారణ సాగు 1,08,983 హెక్టార్లు కావడంతో అక్రమార్కులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతూ వారి ఆశలతో చెలగాటం ఆడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల నుంచి ఆయిల్ తయారీ పేరిట పత్తి విత్తనాలను నకిలీ విత్తన తయారీ ముఠా సేకరిస్తోంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో గుంటూరు, కర్నూలుకు తరలిస్తున్నారు. వ్యవసాయాధికారుల కన్నుగప్పేందుకు మహిళల ద్వారా రవాణా చేయిస్తుండటం గమనార్హం. ఈ విత్తనాలను గుంటూరు, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల్లో గ్రేడింగ్ అనంతరం రంగులు వేసి మార్కెట్‌లో విక్రయానికి ఉంచుతున్నారు.
పముఖ విత్తన కంపెనీలన్నీ గుంటూరు కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తుండటంతో అసలును పోలిన సంచులు, లేబుళ్లతో బురిడీ కొట్టిస్తున్నారు. గుంటూరులో తయారైన ఖాళీ విత్తన సంచులు, సామగ్రి పార్శిల్‌లో కర్నూలుకు తరలిస్తుండగా.. వీటిలో నకిలీ విత్తనాలు నింపి వ్యాపారం చేస్తున్నారు. కంపెనీ విత్తనాలు తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు ఆకర్శితులై మోసపోతున్నారు. ఇప్పటికైనా జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి నకిలీల పనిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నకిలీల నియంత్రణకు చర్యలు
నకిలీ బీటీ పత్తి విత్తనాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఈ ఏడాది విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. 10 పైగా కేసులు నమోదయ్యాయి. కర్నూలు నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పత్తి విత్తనాలు రవాణా అవుతున్నందున ప్రత్యేక నిఘా ఉంచాం. ట్రాన్స్‌పోర్టు కంపెనీలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నాం.
- జేడీఏ ఠాగూర్‌నాయక్