సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ బాధితుల ఆరోగ్య సంరక్షణలో నిమగ్నమైన వైద్య సిబ్బందికి తోడుగా మరింత మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకునేందుకు అవసరమైన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి మోదీ సోమవారం ఓకే చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నీట్–పీజీ పరీక్షకు సిద్ధమవుతున్న డాక్టర్లను కోవిడ్ విధుల్లోకి తీసుకొనేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. నిర్ణయాలను పేర్కొంటూ ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదలచేసింది.
పీజీ రాయబోయే వారిని కోవిడ్ విధుల్లో వినియోగించుకునేందుకు నీట్ పీజీ–2021 పరీక్షను కనీసం నాలుగు నెలల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్ట్ 31లోపు నీట్–పీజీ ఉండదని, పరీక్ష తేదీ ప్రకటించాక వారు ప్రిపేర్‌కావడానికి కనీసం నెలరోజుల సమయం ఇస్తారని ప్రకటన తెలిపింది. దీంతో కోవిడ్ విధులకు పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన వైద్యులు అందుబాటులోకి రాగలరని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
విశిష్ట కోవిడ్ జాతీయ సర్వీస్ సమ్మాన్..
కోవిడ్ మేనేజ్‌మెంట్‌లో సేవలను అందించే వ్యక్తులు కనీసం 100 రోజులపాటు కోవిడ్ డ్యూటీని పూర్తి చేసిన తర్వాత రాబోయే సాధారణ ప్రభుత్వ నియామకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. కనీసం 100 రోజుల కోవిడ్ డ్యూటీ పూర్తిచేసిన వారికి కేంద్రప్రభుత్వం తరపున ‘ప్రధానమంత్రి విశిష్ట కోవిడ్ నేషనల్ సర్వీస్ సమ్మన్’ ఇవ్వాలని నిర్ణయించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన మెడికల్ ఇంటర్న్‌లను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కోవిడ్ మేనేజ్‌మెంట్ విధుల్లోకి తీసుకొనేందుకు అనుమతించాలని నిర్ణయించారు.
వీరితో పాటు ఎంబీబీఎస్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థుల సేవలను టెలి కన్సల్టేషన్స్‌తో పాటు కోవిడ్ వ్యాధి తీవ్రత ఉన్న రోగుల పర్యవేక్షణ బాధ్యతలను వీరికి ఫ్యాకల్టీ పర్యవేక్షణలో అప్పగించనున్నారు. దీంతో కోవిడ్ డ్యూటీలో ఉన్న సీనియర్ వైద్యులపై పనిభారం తగ్గుతుంది. పీజీలో కొత్త బ్యాచ్ విద్యార్థులు చేరే వరకు ఫైనల్ ఇయర్ పీజీ విద్యార్థుల సేవలనూ వాడుకుంటారు. బీఎస్సీ లేదా జీఎన్‌ఎం అర్హత ఉన్న నర్సులను సీనియర్ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో పూర్తి సమయం కోవిడ్ నర్సింగ్ విధుల్లో ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment