నకిలీ వైద్యుడు భరత్‌ను విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
సాక్షి, కర్నూల్ : ఆ యువకుడు చదివింది ఇంటర్మీడియట్. రష్యాలో ఎంబీబీఎస్ చేశానని చెప్పుకుని కర్నూలులోని అమ్మ హాస్పిటల్‌లో చేరాడు. క్యాజువాలిటీకి వచ్చిన రోగులకు అత్యవసర వైద్యం అందిస్తూ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. ఇక్కడే కాదు నగరంలోని మరో కార్పొరేట్ ఆసుపత్రిలోనూ డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం అతన్ని వలపన్ని పట్టుకున్నారు. నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ ఆకుల హుసేనయ్య కుమారుడు ఆకుల భరత్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రి వద్ద వైద్యం గురించి తెలుసుకున్న అతను ఏకంగా ఎంబీబీఎస్ డాక్టర్ అవతారమెత్తాడు.
కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్డులో ఉన్న అమ్మ హాస్పిటల్‌లో 2017 మార్చిలో చేరాడు. అప్పటి నుంచి క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం అతనికి నెలకు రూ.25 వేల జీతం ఇస్తోంది. అతన్ని విధుల్లోకి తీసుకునే ముందు బయోడేటా మాత్రమే చూశామని, ఎలాంటి సర్టిఫికెట్లు తీసుకోలేదని, మళ్లీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. భరత్ ఇక్కడే గాకుండా నగరంలోని మరో కార్పొరేట్ ఆసుపత్రిలోనూ సాయంత్రం పూట క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్‌గా కొనసాగుతున్నాడు.
విజిలెన్స్ అధికారులకు పట్టుబడింది ఇలా...
ఆకుల భరత్‌పై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఆర్‌వీఈవో శివకోటి బాబూరావు ఆదేశాల మేరకు డీఎస్పీ ఎ.దేవదానం మూడురోజులుగా తన సిబ్బందితో ఆసుపత్రిపై నిఘా పెట్టించాడు. సిబ్బందిలో కొందరిని రోగులుగా భరత్ వద్దకు పంపించాడు.
వారికి భరత్ మందులు, పరీక్షలు రాసి దొరికిపోయాడు. ఈ మేరకు సోమవారం అతన్ని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని అర్హతల గురించి ఆరా తీయగా.. తాను విజయవాడలో ఇంటర్ వరకు చదువుకున్నానని, రష్యాలో ఎంబీబీఎస్ చేశానని చెప్పాడు. కానీ భరత్ వద్ద ఎలాంటి విద్యార్హత సర్టిఫికెట్లు లేవు. విషయం తెలుసుకున్న అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సరస్వతీదేవి, డెమో ఎర్రంరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. అలాగే రిజిస్ట్రేషన్ ఒకదానికి చేసి మరొక స్కానింగ్ యంత్రం వాడుతుండడంతో దాన్ని సీజ్ చేశారు. దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ దేవదానం, ఎఫ్‌ఆర్‌వో ఖాన్, ఎంపీడీవో లలితాబాయి, అగ్రికల్చర్ ఏడీ వెంకట్, ఏఏవో గణేష్, కానిస్టేబుళ్లు మునిస్వామి, ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment