ఫీజు కోటి.. జీతం పాతిక వేలు! | Poor salaries For Junior Doctors In Private Hospitals | Sakshi
Sakshi News home page

ఫీజు కోటి.. జీతం పాతిక వేలు!

Published Mon, Feb 11 2019 1:26 AM | Last Updated on Mon, Feb 11 2019 4:46 AM

Poor salaries For Junior Doctors In Private Hospitals - Sakshi

డాక్టర్‌ నరేందర్‌. 2017లో ఎంబీబీఎస్‌ చేశారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో దాదాపు రూ.60 లక్షల వరకు డొనేషన్‌ చెల్లించి మరీ వైద్యవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇంత కష్టపడి ఎంబీబీఎస్‌ పూర్తిచేసినా.. ఆసుపత్రిలో ఇస్తున్న వేతనం రూ.25 వేలు మాత్రమేనని ఆవేదన చెందుతున్నారు.

డాక్టర్‌ నరేష్‌. 2016లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. రెండుసార్లు పీజీ రాసినా రాలేదు. తాజాగా మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. ఎంబీబీఎస్‌ డిగ్రీతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇందుకు ఆయన పొందుతున్న వేతనం రూ.30 వేలు. లక్షల రూపాయల బ్యాంకు రుణం తీసుకొని ప్రైవేటులో పీజీ చేసినా తర్వాత ఆ రుణం చెల్లించే స్థాయిలో వేతనం వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. 

డాక్టర్‌ అబ్దుల్లా 2015లో ఎంబీబీఎస్‌ చదివారు. ఎండీ కోసం చదువుతున్నారు. రెండుసార్లు పరీక్ష రాసినా రాలేదు. ప్రభుత్వం వైద్యుల నియామకాలు చేపట్టకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. తనకు ఎంసెట్‌లో 2వేల ర్యాంకు వచ్చి కన్వీనర్‌ కోటాలో సీటు పొందినా.. ఇప్పుడు పెద్దగా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఇదీ ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్థుల ఆవేదన. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసినా.. బతుకుదెరువు సమస్యగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్‌ అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప వేతనాలు కనీస స్థాయిలో కూడా లేవంటూ ఆందోళన చెందుతున్నారు. కొందరు రూ.50–60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎంబీబీఎస్‌ కోసం డొనేషన్‌ చెల్లించారు. ఫలితం ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇస్తున్న వేతనం ఈ స్థాయిలో దారుణంగా ఉండటంతో.. ఎందుకు వైద్యరంగాన్ని ఎంచుకున్నామా? అని అని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో డిమాండ్‌కు సరిపడినన్ని ఉద్యోగాలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతుందంటున్నారు. మండలాలు, గ్రామాల్లో ప్రాక్టీస్‌ పెట్టినా స్థానికంగా ఉండే సమస్యలతో సతమతం అవుతున్నామని అంటున్నారు. ఎంబీబీఎస్‌ చదువు కోసం, డొనేషన్లు కట్టేందుకు అనేకమంది తల్లిదండ్రులు వడ్డీలకు డబ్బులు తెచ్చారు. వాటిని తిరిగి వడ్డీలతో కలిపి చెల్లించేందుకు కూడా ఎంబీబీఎస్‌ చదువు పనికిరావడం లేదంటున్నారు. ఇక విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసిన విద్యార్థులు అనేకమంది ఎంసీఐ అర్హత పరీక్ష పాసు కాకపోవడంతో వారికి ఇస్తున్న వేతనాలు రూ.20 వేలకు కూడా మించడంలేదు. దీంతో వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. 
 
పీజీ సీట్లు రాక ఇబ్బందులు 
రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో 3,500 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. కానీ పీజీ సీట్లు మాత్రం సగం కూడా లేవు. ఇప్పుడు నీట్‌ ద్వారా నింపుతుండటంతో దేశవ్యాప్తంగా 32 వేల పీజీ మెడికల్‌ సీట్లున్నాయి. వీటికోసం గత నెల జరిగిన నీట్‌–2019 పరీక్షకు ఏకంగా 1.40 లక్షల మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు రాశారు. ఇంత పోటీని తట్టుకుని పీజీ సీటు కొట్టడం ఆషామాషీ కాదు. రాష్ట్రంలోని ఎంబీబీఎస్, పీజీ సీట్లను పోలిస్తే.. ప్రతీ ఏడాది దాదాపుగా 2వేల మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు పీజీ చేయలేకపోతున్నారు. వీరికితోడు చైనా, ఉక్రెయిన్, పిలిప్పీన్స్‌ తదితర దేశాల్లో చదివిన వారూ పోటీలో ఉంటున్నారు. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ చదవకుంటే మార్కెట్‌లో కనీస గుర్తింపు ఉండడంలేదు. కేవలం ఎంబీబీఎస్‌తో వృత్తిలో ఎదిగే పరిస్థితి లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రైవేటులో పీజీ చేయాలన్నా కోట్లలో డొనేషన్లు చెల్లించాల్సి వస్తుంది. పీజీలో సీటు రాక, ఎంబీబీఎస్‌ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రిలో తక్కువ వేతనాలకు పనిచేయక తప్పని దుస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. 
 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవకాశాలు లేవు 
ప్రైవేటులో పరిస్థితి ఇలాగుంటే ప్రభుత్వ రంగంలో పనిచేద్దామంటే భర్తీలు లేవని ఎంబీబీఎస్‌ డాక్టర్లు అంటున్నారు. తెలంగాణలో 2017లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) 500 మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం 5వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 1,150 పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కొరకు 6,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అటు పీజీ సీటు రాక, ఇటు ప్రభుత్వ ఉద్యోగం రాక తాము చేసేదేమీ లేదంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇచ్చే రూ.25 వేలు.. ఇంటి అద్దె, తిండికి కూడా సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ‘ప్రతి పల్లెలో అంగన్‌వాడీ కేంద్రం ఉంది. పంచాయతీ కార్యాలయం ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. కానీ ఎంబీబీఎస్‌ డాక్టర్‌ ఉన్న క్లీనిక్‌ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10వేలకు పైగా గ్రామాలుంటే.. కేవలం దాదాపు 700 పీహెచ్‌సీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీలను పెంచాల్సిన అవసరం ఉందని వైద్యులంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్‌ ఉండాలి. ఆ లెక్కలను ప్రభుత్వాలు మరిచిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. 
 
ఎంబీబీఎస్‌తో బతికేదెలా? 
ఎంబీబీఎస్‌ డాక్టర్లకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేతనాలు ఘోరంగా ఉంటున్నాయి. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు కాలేజీలో చదివినా ప్రయోజనం కనిపించడంలేదు.  
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోటి రూపాయల వరకు డొనేషన్‌ కట్టి ఎంబీబీఎస్‌ చదివించారు. చాలామంది కట్టిన ఫీజుకు వడ్డీలు కట్టుకోలేక.. బతకడానికి డబ్బులు లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఎలా పోషించుకోవాలి? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ, ఆరోగ్య ఖర్చులు ఎలా భరించాలి? ఒకవేళ గ్రామాల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేయాలన్నా అనేకమంది అర్హత లేనివాళ్లు స్థానికంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వారిని నియంత్రించడంలేదు. ఎంబీబీఎస్‌ డాక్టర్లకు వంద నిబంధనలున్నాయి. అర్హత లేని వైద్యులకు అలాంటివేమీ లేదు. తప్పు చేస్తే శిక్ష విధించడం లేదు. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఎంబీబీఎస్‌ వైద్యులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. – డాక్టర్‌ పీఎస్‌ విజయేందర్, అధ్యక్షుడు, టీఎస్‌ జూడా 
 
అవకాశాలు తక్కువ! 
కేవలం ఎంబీబీఎస్‌తో బయట అవకాశాల్లేని మాట వాస్తవమే. పైగా పీజీ మెడికల్‌ సీట్లు కూడా ఎంబీబీఎస్‌తో సమానంగా ఉండవు. కాబట్టి ఉన్న ఎంబీబీఎస్‌తోనే ముందుకు సాగాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్కువ వేతనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అందరూ హైదరాబాద్‌లోనే ఉండాలన్న భావనే. దీంతో డిమాండ్‌ తగ్గి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తయినవారు గ్రామాలకు వెళ్లి ప్రాక్టీసు చేస్తే ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది. కానీ చాలామంది తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవడంలేదు. అందరూ నగరానికే పరిమితమైతే అవకాశాలు ఎలా వస్తాయి?  – డాక్టర్‌ రమేష్‌రెడ్డి, వైద్య విద్యా సంచాలకులు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement