జిల్లా వ్యాప్తంగా వైద్యుల కొరత
డీఎంహెచ్‌ఓ భారతీరెడ్డి
చిల్లకూరు : జిల్లా వ్యాప్తంగా వైద్యుల కొరత ఉందని డీఎంహెచ్‌ఓ భారతీరెడ్డి తెలిపారు. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 50 మంది వైద్యుల కొరత ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన నివేదికలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అలాగే ఎక్కువ జనాభా ఉన్న చోట అదనంగా వైద్యులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
చెన్నూరు పీహెచ్‌సీ పరిధిలో సుమారు 70 వేల మంది జనాబా ఉన్నందున మరో ముగ్గురు వైద్యులు అవసరముందని తెలిపారు. దీనిపైనా నివేదికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆరోగ్యకేంద్రాలపైనా స్థానిక ప్రజాప్రతినిధుల ప్రర్యవేక్షణ ఉండాలన్నారు. పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు తమ పరిధిలోని ఆరోగ్యకేంద్రాలను 15రోజులకోసారి తనిఖీ చేయాలన్నారు. అలాగే ఆరోగ్యకేంద్రాల పరిధిలోని సబ్ సెంటర్లను స్థానిక వైద్యులు తనిఖీ చేయాల్సి ఉందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఎన్‌ఎంలకు త్వరలో ట్యాబ్‌లు ఇచ్చేందుకు ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె వెంట వైద్యులు ఏడుకొండలు, సిబ్బంది ఉన్నారు.