పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ! | Hyderabad: Shortage Of Doctors At Gandhi Hospital | Sakshi
Sakshi News home page

పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!

Published Fri, Feb 25 2022 10:23 AM | Last Updated on Fri, Feb 25 2022 5:27 PM

Hyderabad: Shortage Of Doctors At Gandhi Hospital - Sakshi

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా మారింది. వివక్షకు నిలువుటద్దాన్ని తలపిస్తోంది. తెలంగాణ వైద్య ప్రదాయినిగా.. ప్రభుత్వ వైద్యరంగానికి పెద్ద దిక్కుగా ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వైద్యుల నియామకాల్లో చిన్నచూపునకు గురవుతున్నాయి. ప్రధానమైన విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు సేవల్లో జాప్యంతో పాటు వైద్య విద్యాబోధన కుంటుపడుతోంది.  
– గాంధీ ఆస్పత్రి

గాంధీలోని 35 విభాగాల్లో 273 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు మంజూరు కాగా ఖాళీగా 51 పోస్టులు ఉండటం గమనార్హం. ప్రధాన విభాగాలైన జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్, అనస్తీషియా, న్యూరాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎస్పీఎం తదితర విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. అనస్తీషియా, బయోకెమిస్త్రీ విభాగాలకు ప్రొఫెసర్లే లేకపోవడం అత్యంత దయనీయం. 60 మంది ప్రొఫెసర్లకు గాను 56 మంది మాత్రమే ఉన్నారు. 

వైద్యవిద్యా బోధనలో కీలకపాత్ర పోషించే అసోసియేట్‌ ప్రొఫెసర్లు 74 మందికి కేవలం 51 మంది ఉన్నారు. 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 విభాగాల్లో 139 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 115 మంది మాత్రమే ఉండగా, 24 ఖాళీలు ఉన్నాయి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, సైకాలజీ, మైక్రోబయోలజీ, పెథాలజీ, సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఎస్‌పీఎం) వంటి నాన్‌క్లినికల్‌ విభాగాల్లో 59 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకుగాను ఎనిమిది ఖాళీగా ఉన్నాయి.  

శస్త్రచికిత్సల్లో జాప్యం 
శస్త్రచికిత్సలో కీలకమైన అనస్తీషియా విభాగంలో వైద్యుల కొరత పట్టి పీడిస్తోంది. కేటాయించిన మూడు ప్రొఫెసర్‌ పోస్టులతోపాటు ఒక అసోషియేట్, ఎనిమిది అసిస్టెంట్‌ పోస్టులకు మొత్తం 12 పోస్టులు గత కొన్నేళ్లుగా భర్తీ చేయకపోవడంతో పలు విభాగాల్లో జరగాల్సిన  శస్త్రచికిత్సలు తరచూ వాయిదా పడుతున్నాయి. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యుల కొరత, శస్త్రచికిత్సల జాప్యం కారణంగా ఆపరేషన్‌ థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.  

ముందుకు సాగని వైద్యవిద్య..  
గాంధీ మెడికల్‌ కాలేజీలో వైద్యవిద్యా బోధనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కరోనా వైరస్‌ విజృంభణతో గాంధీని కోవిడ్‌ నోడల్‌ సెంటర్‌గా ఏర్పాటు చేయడంతో వైద్యవిద్య కుంటుపడింది. ఓ వైపు కరోనా, మరోవైపు వైద్యుల కొరతతో రెండేళ్లుగా చదువులు ముందుకు సాగలేదని ఓ వైద్యవిద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా రెగ్యులర్‌ వైద్యుల నియామకం చేపట్టకపోవడం, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న వైద్యులకు విద్యాబోధనలో అనుభవం లేకపోవడం, కేవలం రోగుల వైద్యసేవలకే పరిమితం కావడంతో వైద్యవిద్య మూలనపడింది.   

భర్తీ చేయాల్సిన పోస్టులివే..  
గాంధీ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మూడు కేటగిరీల్లో మొత్తం 51 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. 

ఆ వివరాలు ఇలా.. 
అనస్తీషియా– 12, జనరల్‌ మెడిసిన్‌– 5, నియోనెటాల్‌ పిడియాట్రిక్‌–1,  రేడియాలజీ– 1, టీబీ అండ్‌ సీడీ – 2, సైకియాట్రిస్ట్‌– 3, కార్డియాలజీ– 1, నెఫ్రాలజీ –1, యూరాలజీ– 1, అనాటమీ–1, సైకాలజీ– 2, ఫార్మకాలజీ–1, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌–1, మైక్రోబయోలజీ–1, పెథాలజీ–1, ఎస్‌పీఎం–2, గైనకాలజీ–4, పిడియాట్రిక్‌– 3, న్యూరాలజీ– 2, పిడియాట్రిక్‌ సర్జరీ– 2, న్యూరోసర్జరీ–1, సీటీ సర్జరీ– 3 పోస్టులతో పాటు మరో 8 నాన్‌క్లినికల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement