వైద్యులు ఎక్కడా.? | Shortage Of Doctors In Adilabad | Sakshi
Sakshi News home page

వైద్యులు ఎక్కడా.?

Published Thu, Oct 25 2018 10:02 AM | Last Updated on Thu, Oct 25 2018 10:02 AM

Shortage Of Doctors In Adilabad - Sakshi

బజార్‌హత్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

బజార్‌హత్నూర్‌(బోథ్‌): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) వైద్యుల కొరత వేధిస్తోంది. సరిపడా వైద్యులు లేకపోవడంతో పేదలు మెరుగైన వైద్యానికి దూరమవుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 22 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 52 మంది వైద్యులు ఉండాల్సి ఉంది. కాని సగం మంది వైద్యులు కూడా లేకపోవడం విస్తుగొలుపుతోంది. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అనివార్యంగా పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల  చేసుకుంటున్నారు.జిల్లా వ్యాప్తంగా 7,8,972 మంది జనాభా ఉన్నారు. మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య    కేంద్రాలు, రెండు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఐదు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 91సబ్‌ సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో 70 శాతం గ్రామాలు అడవుల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యాలు కూడా లేవు. ఏదైనా రోగం వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే దిక్కు. అష్టకష్టాలు పడి పీహెచ్‌సీకి వస్తే వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.

పీహెచ్‌సీల్లో వైద్యులు కొరత..
జిల్లాలోని 22 పీహెచ్‌సీల్లో కేవలం 22 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 52 మంది వైద్యులు ఉండాలి. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కాంట్రాక్టు పద్ధతిన సెప్టెంబర్‌ నెలలో మరో 21 మంది వైద్యులను నియమించారు. కాని వారు కంటి వెలుగు కార్యక్రమానికి మాత్రమే పరిమితమయ్యారు. కార్యక్రమ అనంతరం వీరు పీహెచ్‌సీల్లో కొనసాగుతారో లేదో అనుమానంగానే ఉంది. ఇక పీహెచ్‌సీకి కేటాయించిన  రెగ్యూలర్‌ వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని బజార్‌హత్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉన్నా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. వైద్యుడు సెలవుపై వెళ/æతే స్టాఫ్‌ నర్సులే వైద్యులుగా వ్యవహరించాల్సి వస్తోంది.

నార్నూర్‌ పీహెచ్‌సీలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉన్నా ఒక్కరు కూడా లేరు. అది ఏజెన్సీ ప్రాంతం కావడం గిరిజనులు అధికంగా ఉండడంతో కలెక్టర్‌ ఆదేశాల మెరకు హస్నాపూర్, దంతన్‌పల్లి పీహెచ్‌సీల నుంచి ఇద్దరు వైద్యులను డిప్యూటేషన్‌పై నియమించారు. ఇందులోనూ ఒకరు కంటివెలుగులో పాల్గొంటున్నారు. ఇక మిగిలిన ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. తాంసి, బేలా పీహెచ్‌సీల్లో ఒక్కరు కూడా వైద్యులు లేకపోవడంతో స్టాప్‌ నర్స్‌లు అన్నీ చూస్తున్నారు. ఇచ్చోడ, నేరడిగొండ తలమడుగు, దంతన్‌పల్లి, హస్నపూర్, సొనాల పీహెచ్‌సీలలో ఇద్దరు వైద్యులకు ఒక్కరు చొప్పున మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లది అదే దుస్థితి. జిల్లాలోని ఉట్నూర్‌ సీహెచ్‌సీలో 12 మంది వైద్యులకు ఎనిమిది మంది ఉన్నారు. బోథ్‌ సీహెచ్‌సీలో ఏడుగురికి ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారు.
 
వేధిస్తున్న సిబ్బంది కొరత..
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఉప కేంద్రాల్లో సిబ్బంది కొరత సైతం వేధిస్తోంది. ఏఎన్‌ఎంలు 48, ల్యాబ్‌టెక్నీషియన్లు 13, హెల్త్‌ అసిస్టెంట్‌లు 36 ఖాళీలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సబ్‌ సెంటర్‌లలో ఏఎన్‌ఎంలు లేకపోవడం, ఉన్నా రోజలు తరబడి గ్రామాలకు రావడం లేదు. దీంతో చిన్న రోగానికి సైతం మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది.

సమయపాలన పాటించని వైద్యులు..
ఇక వైద్యులలేమి ఒక సమస్య అయితే ఉన్న వైద్యులు సైతం సమయపాలన పాటించకపోవడం మరో సమస్యగా మారింది. వైద్యులు స్థానికంగా ఉండక ఆదిలాబాద్, నిర్మల్‌ పట్టణాల నుంచి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు విధుల్లో చేరాల్సి ఉన్నా ఉదయం 10– 11 గంటల సమయంలో ఆసుపత్రికి వస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకూ ఉండాల్సి ఉన్నా మధ్యాహ్నం 2 గంటలకే తిరుగు ప్రయాణం అవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఉదయం వచ్చిన రోగులు 2గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుందని వాపోతున్నారు.  ఏదైన ప్రమాదం జరిగితే ఆసుపత్రికి వచ్చి ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా కిందిస్థాయి సిబ్బంది ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తున్నారు. తర్వాత ఆదిలాబాద్‌ రిమ్స్‌కు రెఫర్‌ చేస్తారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ దుస్థితి మార్చాలని పలువురు కోరుతున్నారు. సరిపడా వైద్యులను నియమించి మెరుగైన సేవలందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 

ఉదయం నుంచి నిరీక్షిస్తున్నాం
బజార్‌హత్నూర్‌ మండలం బద్దునాయక్‌ తండా మాది. భూతాయి(కే) సబ్‌సెంటర్‌లో ఏఎన్‌ఎం లేకపోవడంతో ఉదయం 10గంటలకు ఇక్కడి పీహెచ్‌సీకి వచ్చాను. చాలా సమయం వేచిచూసి సిబ్బందిని అడిగితే డాక్టర్‌ సెలవులో ఉన్నాడని తెలిపారు. జ్వరం ఎక్కువై కళ్ళు తిరుగుతున్నాయని తెలపడంతో స్టాప్‌నర్స్‌ ఫోన్‌లో వైద్యుడిని అడిగి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. – రాథోడ్‌ సావిత్రిబాయి, బద్దునాయక్‌ తండా 

వైద్యులు మొగ్గు చూపడం లేదు 
ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులు మొగ్గు చూపడంలేదు. నగరాల్లో, పట్టణాల్లో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో లక్షల్లో వేతనాలు ఉండడంతో ప్రభుత్వం ఇచ్చే వేతనానికి ఉద్యోగం చేసే పరిస్థితులు లేవు. దీంతో వైద్యుల కొరత ఏర్పడుతుంది. నలుగురు వైద్యులు అవసరమున్న చోట ఒక్కరితోనే సర్దుబాటు చేస్తున్నాం. సిబ్బంది నియామకంలో ఎలక్షన్‌ కోడ్‌ ఉంది. డిసెంబర్‌ లేదా జనవరి నెలలో నియామకాలు చేపడతాం. – రాజీవ్‌రాజ్, జిల్లా వైద్యాధాకారి, ఆదిలాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement