సొమ్ముంటే సాక్ష్యాలు చూపాల్సిందే..
►రూ.50 వేలకంటే ఎక్కువ తీసుకువెళ్లేవారిపై నిఘా
►13 చెక్‌నాకాల ఏర్పాటుచేసిన పోలీసులు
►హవాలా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి
►నేరచరితులపై ముందస్తు చర్యలు
►లెసైన్సుడ్ తుపాకులు డిపాజిట్ చేయాలని వినతి
సాక్షి, ముంబై : అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం మాల్‌ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు నగర పోలీసులు సమాయత్తమయ్యారు. ఇందుకు గాను రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బు ఉన్న వారి నుంచి అవసరమైన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. పత్రాలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు నిర్ణయించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బును ఎరగా ఉపయోగించి ఓటర్లను ప్రలోభపరిచే అవకాశముందనే అనుమానంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కొందరు దేశీయ, చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న 13 తుపాకీలను, 29 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నేర చరిత్ర కలిగిన 4,813 దుండగులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇకమీదట రూ.50 వేలకు పైగా నగదును కలిగిఉన్న వారిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇందుకు సంబంధించిన విత్‌డ్రా స్లిప్‌ను పోలీసులకు వారు చూపించాల్సి ఉంటుంది. ఏ ఉద్దేశంతో విత్‌డ్రా చేశారనే తదితర అంశాలను పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను తెలియచేయడంలో సదరు వ్యక్తి విఫలమైతే సదరు సొమ్మును సీజ్ చేసి ఎన్నికల కమిషన్‌కు స్వాధీనపరచనున్నట్లు ముంబై పోలీస్ అధికార ప్రతినిధి ధనుంజయ్ కులకర్ణి పేర్కొన్నారు. హవాలా కార్యకలాపాలు చేసేవారు తమ పర్యవేక్షణలో ఉంటారన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు హవాలాలను ఉపయోగించుకొని రాష్ట్రానికి డబ్బు తరలిస్తుంటారని ఆయన పేర్కొన్నారు.ముందుజాగ్రత్త చర్యగా 13 చెక్‌నాకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి రైల్వేలపై కూడా నిఘా ఉంచనున్నాయి.దీంతోపాటు లెసైన్సుడ్ తుపాకీలను కలిగి ఉన్నవారు వాటిని డిపాజిట్ చేయాల్సిందిగా కోరామన్నారు. ఇప్పటికే 288 మంది తమ ఆయుధాలను డిపాజిట్ చేశారు. అంతేకాకుండా కొందరు నేరస్తులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశామన్నారు. ఇప్పటికే 1,808 వారెంట్లు అమలు చేశామని కులకర్ణి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించడంతో జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో లెసైన్సు కలిగిన తుపాకీల వివరాలను సమీక్షించారు. దీంతో ఓ పట్టికను తయారు చేసి సదరు వ్యక్తులను తమ ఆయుధాలను డిపాజిట్ చేయమని కోరామన్నారు.